Share News

CM Revanth Reddy Urges Voters: మంత్రులతో పనులు చేయించుకునేటోళ్లను గెలిపించుకోండి!

ABN , Publish Date - Dec 02 , 2025 | 05:33 AM

రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేస్తున్న పనుల్లో కాళ్లలో కట్టెలు పెట్టేటోళ్లను గెలిపిస్తే ఊరిలో అభివృద్ధి జరగదని అన్నారు......

CM Revanth Reddy Urges Voters: మంత్రులతో పనులు చేయించుకునేటోళ్లను గెలిపించుకోండి!

  • కాళ్లలో కట్టెలు పెట్టేటోళ్లను గెలిపిస్తే ఊరి అభివృద్ధి జరగదు

  • సర్పంచి ఎన్నికలపై రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి పిలుపు

  • మీ ఆశీర్వాదంతో సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని గాడిన పెట్టాను

  • పిల్లలందరికీ నా మనుమడు తినే సన్నబియ్యమే ఇస్తున్నాం

  • కొడంగల్‌ ఎత్తిపోతలను కేసులేసి ఏడాదిన్నర ఆపారు

  • రూ.20 లక్షల పరిహారం ఇస్తే 96ు మంది భూములిచ్చారు

  • దగ్గరుండి ప్రాజెక్టులను పూర్తి చేసుకునే బాధ్యత యువతదే

  • మక్తల్‌ ప్రజాపాలన విజయోత్సవ సభలో రేవంత్‌రెడి

మహబూబ్‌నగర్‌/నారాయణపేట, డిసెంబరు 1 (ఆంద్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేస్తున్న పనుల్లో కాళ్లలో కట్టెలు పెట్టేటోళ్లను గెలిపిస్తే ఊరిలో అభివృద్ధి జరగదని అన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులతో వెంటపడి పనులు చేయించుకునే వారినే గెలిపించుకోవాలని సూచించారు. వనపర్తి, నారాయణపేట జిల్లాల పరిధిలో ఉన్న మక్తల్‌ నియోజకవర్గం ఆత్మకూరు, మక్తల్‌లలో సోమవారం పర్యటించిన ముఖ్యమంత్రి మక్తల్‌- నారాయణపేట- కొడంగల్‌ ఎత్తిపోతలు సహా పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం ప్రసంగించారు. చీకట్లో క్వార్టర్‌, ఆఫ్‌, ఫుల్‌ తీసుకొని ఓటేస్తే కుట్రలు చేసేవారు, తగవులు పెట్టే వాళ్లు వస్తారని హెచ్చరించారు. మంచోడు సర్పంచి అయితే ఊరు బాగుపడుతుందని, కాళ్లలో కట్టెలు పెట్టేటోడు అయితే ఉన్నది గుంజుకుపోతాడని అన్నారు. మంచోడు అనుకొని సద్ది కడితే బొడ్రాయి దగ్గర కూర్చొని తిని, ఇంకేమైనా ఉన్నదా? అనే రకాలు ఉన్నారని, జాగ్రత్తగా ఆలోచించి ఓటేయాలని హెచ్చరించారు.

రెండేళ్ల క్రితం పాలమూరు పిలగాడినని, 12 మంది ఎమ్మెల్యేలను గెలిపించి ఆశీర్వదించారని, ఆ బలంతోనే సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని సరైన దిశలో పెట్టడానికి కృషి చేస్తున్నానని చెప్పారు. చిట్టెం నర్సిరెడ్డి ప్రారంభించిన నారాయణపేట-కొడంగల్‌ ఎత్తిపోతల పథకానికి 2014లో ఉమ్మడి రాష్ట్రంలో తాను జీఓ 69ను తెస్తే గత ప్రభుత్వం పదేళ్లు పాతాళంలో తొక్కిపెట్టిందన్నారు. 2009లో పాలమూరు ప్రజలు ఆశీర్వదిస్తే గెలిచిన కేసీఆర్‌ తెలంగాణ వచ్చిన తర్వాత ప్రాజెక్టుల పేరుతో రూ.2 లక్షల కోట్లు ఖర్చు పెట్టాడు గానీ, సంగంబండలో బండ పగులగొట్టడానికి రూ. 12 కోట్లు ఇవ్వలేదని వ్యాఖ్యానించారు. పాలమూరు ప్రాజెక్టులను పట్టించుకోలేదని, జలసాధన సమితి ఏర్పడి ఎన్ని ఉద్యమాలు చేసినా ఈ లిఫ్ట్‌ను పూర్తి చేయలేదని మండిపడ్డారు. ఈ ప్రాంతం బిడ్డ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారని, ఎవరినీ అభ్యర్థించాల్సిన అవసరం లేదని, వడ్డించే వాడు పాలమూరు వాడే అయినందున నిధులకు కొరత లేదని చెప్పారు.


తమ ప్రభుత్వం రాగానే రూ.5 వేల కోట్లతో కొడంగల్‌ ఎత్తిపోతల పనులు ప్రారంభించామని, కుట్రలు చేసి, కేసులు వేసి ఏడాదిన్నర ప్రాజెక్టును ఆపారని విమర్శించారు. రూ.14 లక్షల పరిహారం సరిపోదంటే రూ.20 లక్షల పరిహారం ఇచ్చామని, 96 శాతం మంది రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని కొనియాడారు. ఉదండాపూర్‌ ప్రాజెక్టు సహాయ పునరావాసం అక్కడి ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి కోరిన విధంగా అందజేయనున్నట్లు ప్రకటించారు. కొడంగల్‌ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించుకోవడం తన జీవితంలో అత్యంత సంతోషకరమైన సందర్భంగా ముఖ్యమంత్రి అభివర్ణించారు. ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత స్థానిక యువతదేనని చెప్పారు.

కాంట్రాక్టర్‌ పూర్తి చేయకపోతే వీపు విమానం మోత మోగుతుందని చెప్పాలన్నారు. మన పనులు ఇప్పుడు పూర్తి చేసుకోకపోతే ఎప్పటికీ చేసుకోలేమని చెప్పారు. తండాలు, గూడేలు, మారుమూల పల్లెల్లో విద్యకూ తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ముఖ్యమంత్రి అన్నారు. ప్రతీ నియోజకవర్గానికి యంగ్‌ ఇండియా రెసిడెన్షియల్‌ స్కూళ్లను మంజూరు చేస్తున్నామని తెలిపారు. భూమి అందుబాటులో లేనిచోట 25 ఎకరాలు భూసేకరణ చేసి, శంకుస్థాపనలు చేస్తున్నామని చెప్పారు. ఇతర పార్టీల పట్ల వివక్ష లేకుండా అన్ని నియోజకవర్గాలకు స్కూళ్లను మంజూరు చేస్తున్నామని తెలిపారు. మహబూబ్‌నగర్‌లో ట్రిపుల్‌ ఐటీ, పాలమూరు వర్సిటీలో ఇంజనీరింగ్‌, లా కాలేజీ ఏర్పాటు ద్వారా పాలమూరు పిల్లలు సిలికాన్‌ వ్యాలీని ఏలేలా చేస్తున్నామని చెప్పారు. తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆడబిడ్డలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించానని, దీంతో బీఆర్‌ఎస్‌ వారు కళ్లలో నిప్పులు పోసుకొని ఆటో వాళ్లను తన మీదకు పంచాయతీకి పంపారని తెలిపారు.


పేద మహిళలు కాయకష్టం చేసుకొని కూడబెట్టుకున్నది గుంజుకోవాలని చూస్తే కర్రు కాల్చి వాత పెడతారని, కళ్లలో కారం, మామిడికాయ తొక్కు పెడతారని హెచ్చరించారు. గతంలో రేషన్‌షాపునకు పోయి తెచ్చుకున్న బియ్యాన్ని ఏనాడూ వండుకొని తినలేదని, పశువుల దాణాకో, రూ.11కి కిలో చొప్పున అమ్ముకోవడానికో వాడేవారని చెప్పారు. ఇప్పుడు తన మనవడు తినే క్వాలిటీ సన్నబియ్యం ఊళ్లో ఆడబిడ్డల పిల్లలకు ఇస్తున్నామని తెలిపారు. ఇప్పుడు రాష్ట్రంలో మూడు పూటలా సన్నబియ్యం తింటున్నారని చెప్పారు. మహిళలకు కరెంటు బిల్లు భారం తప్పించానని, నారాయణపేటలో పెట్రోల్‌ బంకు పెట్టించానని, 1000 బస్సులిచ్చి ఓనర్లను చేశామని ప్రస్తావించారు. మహిళా సంఘాల ఉత్పత్తులను అమ్ముకోవడానికి హైటెక్‌ సిటీ పక్కన మూడున్నరెకరాల్లో స్టాల్స్‌ ఏర్పాటు చేశామని తెలిపారు.

భవిష్యత్‌లో అమెజాన్‌లో ఆన్‌లైన్‌లో అమ్ముకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. వెయ్యి మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్లు అప్పగించి మహిళలను అంబానీ, అదానీలతో పోటీ పడేలా చేస్తామని ప్రకటించారు. 35 ఏళ్ల వర్గీకరణ సమస్యను పరిష్కరించి మాల, మాదిగలు కలిసి ఉండేలా చేశామన్నారు. వందేళ్ల నుంచి చేయనిది తాము బీసీల లెక్కలు తీసి 56 శాతం బీసీలు ఉన్నారని గుర్తించామని ముఖ్యమంత్రి ప్రస్తావించారు. రూ.21,653 కోట్లతో రైతు రుణమాఫీ చేశామని, రూ.12 వేల చొప్పున రైతు భరోసా ఇస్తున్నామని గుర్తు చేశారు. గత ప్రభుత్వాలు రూ.8 లక్షల కోట్ల అప్పు చేసిపోతే సంక్షోభంలో రాష్ట్రాన్ని సరైన దిశలోకి నడిపిస్తూ సంక్షేమ పథకాలు కూడా అందిస్తున్నానని చెప్పారు. మంత్రులు వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనర్సింహ ముఖ్యమంత్రితో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

1.jpg


ఈ వార్తలు కూడా చదవండి:

Slot Booking Scam: రిజిస్ట్రేషన్లలో స్లాట్ల దందా!

Hyderabad: హైదరాబాద్‏లో.. నేడు విద్యుత్‌ ఉండని ప్రాంతాలివే...

Updated Date - Dec 02 , 2025 | 06:55 AM