Share News

Slot Booking Scam: రిజిస్ట్రేషన్లలో స్లాట్ల దందా!

ABN , Publish Date - Dec 02 , 2025 | 05:46 AM

ఆస్తులు, డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను సులభతరం చేయడానికి ప్రవేశపెట్టిన స్లాట్ల విధానాన్ని కొందరు డాక్యుమెంట్‌ రైటర్లు, దళారులు దుర్వినియోగం చేస్తున్నారు. ముందే స్లాట్లు బుక్‌ చేసుకుని కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు.....

Slot Booking Scam: రిజిస్ట్రేషన్లలో స్లాట్ల దందా!

  • హైదరాబాద్‌ పరిధిలోని కార్యాలయాల్లో వినియోగదారులకు లభించని స్లాట్లు

  • కృత్రిమ కొరత సృష్టిస్తున్న డాక్యుమెంట్‌ రైటర్లు

  • ఒక్కో స్లాట్‌ను రూ.5- 10వేలకు అమ్ముతున్న వైనం

  • 6 వేలకుపైగా ఐడీలను బ్లాక్‌ చేసిన ఉన్నతాధికారులు

  • యూజర్‌ ఐడీకి ఆధార్‌ నంబరును జోడిస్తే ఈ ఇబ్బంది తప్పుతుందంటున్న ఉద్యోగ సంఘాలు

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): ఆస్తులు, డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను సులభతరం చేయడానికి ప్రవేశపెట్టిన స్లాట్ల విధానాన్ని కొందరు డాక్యుమెంట్‌ రైటర్లు, దళారులు దుర్వినియోగం చేస్తున్నారు. ముందే స్లాట్లు బుక్‌ చేసుకుని కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. అత్యవసరంగా రిజిస్ట్రేషన్‌ కోసం వచ్చినవారి నుంచి రూ.5 వేల నుంచి రూ.10వేల వరకు వసూలు చేస్తూ, ఆ స్లాట్లలో రిజిస్ట్రేషన్‌ అయ్యేందుకు సహకరిస్తున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఈ దందా ఎక్కువగా జరుగుతోందని.. నెలకు సుమారు రూ.6 కోట్ల వరకు దండుకుంటున్నారని అంచనా. సంగారెడ్డి, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కొన్ని రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోనూ ఇలాంటి దందా సాగుతోంది. ఆయా జిల్లాల్లో రోజూ 40కంటే ఎక్కువ డాక్యుమెంట్లు వచ్చే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలో ఈ వ్యవహారం ఎక్కువగా జరుగుతోందని ఫిర్యాదులు రావడంతో రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు దీనిపై దృష్టిసారించారు. నవంబరులో 6 వేలకుపైగా కంప్యూటర్‌/లాగిన్‌ ఐడీలను అక్రమాలకోసం వాడుతున్నట్టు గుర్తించి, బ్లాక్‌ చేశారు. ఈ దందా సాగిస్తున్న దళారులు మరో ఐదారు వేలమంది ఉండవచ్చని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి.


ముఖ్యమైన రోజులను గుర్తించి మరీ..

రిజిస్ట్రేషన్‌ కోసం సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులకు వెళ్లేవారికి స్లాట్‌ బుకింగ్‌ విధానం ఎంతో సౌకర్యవంతంగా మారింది. డాక్యుమెంట్‌ రైటర్ల అవసరం లేకుండా, వివరాన్నీ ఆన్‌లైన్‌లో పొందుపరిచి రిజిస్ట్రేషన్‌ చేయించుకోవడానికి, డాక్యుమెంట్‌ను పొందడానికి వీలు లభించింది. కానీ దీనిని కొందరు డాక్యుమెంట్‌ రైటర్లు, దళారులు దందాకు మార్గంగా మలచుకున్నారు. ఎక్కువగా రిజిస్ట్రేషన్లు జరిగే కార్యాలయాలు, డిమాండ్‌ ఉండే సీజన్‌, మంచి రోజులు.. చూసుకుని ఒక్కో లాగిన్‌ ఐడీ నుంచి 10వరకు స్లాట్లను బుక్‌ చేస్తున్నారు. చిన్నపాటి (ఒకట్రెండు గజాల) స్థిరాస్తి వివరాలను పొందుపరిచి, తక్కువ స్టాంపు డ్యూటీ (రూ.500-2,000)చెల్లించి స్లాట్లను బుక్‌ చేస్తున్నారు. ఆయా రోజుల్లో రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలనుకునే వారు స్లాట్లు దొరక్క డాక్యుమెంట్‌ రైటర్లు, దళారులను ఆశ్రయిస్తున్నారు. వారు తమ స్లాట్‌ను రద్దు చేసుకుని.. డిమాండ్‌ను బట్టి, ఎక్కువ సొమ్ము ముట్టజెప్పిన వారికి ఇచ్చేలా చేస్తున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో మొత్తం 45సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీసులు ఉండగా.. అందులో కుత్బుల్లాపూర్‌, ఉప్పల్‌, మహేశ్వరం, ఎల్బీనగర్‌, సరూర్‌నగర్‌, హయత్‌నగర్‌, గండిపేట్‌, శేరిలింగంపల్లి, పటాన్‌చెరు, శంషాబాద్‌ తదితర 20 చోట్ల స్లాట్ల బ్లాక్‌ దందా నడుస్తోందని అధికారులు గుర్తించారు. ఒకే కంప్యూటర్‌ ఐడీ, ఒకే ఫోన్‌ నంబరుతో ఎక్కువ స్లాట్లు బుక్‌ చేస్తున్నవారిని గుర్తించి బ్లాక్‌ చేస్తున్నారు. కానీ వేర్వేరు కంప్యూటర్లు, ఫోన్‌ నంబర్లతో స్లాట్లు బుక్‌ చేస్తున్న వారిని అడ్డుకోలేని పరిస్థితి ఏర్పడింది.

ఈ మార్పులు చేస్తే పరిష్కారం

స్లాట్ల దందాకు పాల్పడుతున్న దళారులను గుర్తించి, చర్యలు చేపట్టాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. రిజిస్ట్రేషన్లు అత్యవసరమైన వారికి కొంత ఫీజుతో తత్కాల్‌ తరహాలో కొన్ని స్లాట్లను కేటాయించడం.. స్లాట్‌ బుకింగ్‌ లేకుండా నేరుగా వాకిన్‌ విధానంలో (సాయం త్రం 5గంటల తర్వాత)అనుమతించే డాక్యుమెంట్ల సంఖ్యను ఐదు నుంచి 10కి పెంచడం.. యూజర్‌ ఐడీలకు ఆధార్‌ను లింక్‌ చేయడం వంటి చర్యలతో స్లాట్ల దందాను అరికట్టవచ్చని సూచిస్తున్నారు.

Updated Date - Dec 02 , 2025 | 05:46 AM