CM Revanth Reddy: ఏటా నెల రోజులు ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేయండి
ABN , Publish Date - Jul 03 , 2025 | 03:22 AM
ప్రైవేటు హాస్పిటళ్లలో పనిచేసే వైద్యులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఓ కీలక సూచన చేశారు. ఏడాదిలో కనీసం నెల రోజులపాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేయాలని కోరారు.
ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించడంలో మద్దతివ్వండి
ప్రైవేటు ఆస్పత్రుల వైద్యులకు సీఎం రేవంత్‌రెడ్డి సూచన
హైదరాబాద్ సిటీ, జూలై 2(ఆంధ్రజ్యోతి): ప్రైవేటు హాస్పిటళ్లలో పనిచేసే వైద్యులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఓ కీలక సూచన చేశారు. ఏడాదిలో కనీసం నెల రోజులపాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేయాలని కోరారు. తద్వారా సర్కారు దవాఖానాల్లో సేవల నాణ్యతను మెరుగుపరచడానికి తమ వంతు చేయూతనందించాలన్నారు. పేదలకు మెరుగైన వైద్య సేవలను చేరువ చేయాలనే ప్రభుత్వ ప్రయత్నాలకు మద్దతివ్వాలని అన్నారు. తెలంగాణలో చదువుకొని దేశ విదేశాల్లో స్థిరపడ్డ వైద్యులు కూడా ఇక్కడి ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలందించాలని కోరారు. ‘‘సంవత్సరంలో 11 నెలలు మీకు నచ్చిన ప్రైవేట్ హాస్పిటల్‌లో, మీకు నచ్చిన జీతానికి పనిచేసుకోండి. ఒక్క నెల మాత్రం ప్రభుత్వ ఆస్పత్రులకు కేటాయించండి. హైదరాబాద్‌లో ఉన్న డాక్టర్లకు మాత్రమేకాకుండా.. దేశ విదేశాల్లోని తెలుగు డాక్టర్లందరకీ ఇది నా విన్నపం. మీరు ఏడాదికోసారి అయినా మీ అమ్మనాన్నలను చూడటానికో, మరేదైనా పనిమీదనో మీ సొంత ఊరికి వస్తుంటారు. అప్పుడు వీలు చూసుకుని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మీ సేవలను అందించడానికి ప్రయత్నించండి. మీకు నచ్చిన ప్రభుత్వ ఆస్పత్రిలో సేవలనందిస్తామంటే.. అందుకు తగిన ఏర్పాట్లను ప్రభుత్వం తరఫున చేస్తాం’’ అని రేవంత్ అన్నారు. బుధవారం బంజారాహిల్స్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఏఐజీ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతిపెద్ద హాస్పిటల్‌ను నగరంలో ఏర్పాటు చేసినందుకు ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డి.నాగేశ్వర్‌రెడ్డిని అభినందిస్తున్నట్లు తెలిపారు.నాగేశ్వర్‌రెడ్డికి ఎన్నో ఆఫర్లు వచ్చినా కాదని.. పేదలకు వైద్య సేవలందించాలనే లక్ష్యంతో భారత్‌లోనే ఉండిపోయారని పేర్కొన్నారు. భారతరత్న పురస్కారానికి నాగేశ్వర్‌రెడ్డి అర్హుడని, ఇందుకోసం ప్రభుత్వం తరఫున కేంద్రానికి సిఫారసు చేస్తామన్నారు.
ఆరోగ్య పర్యాటక కేంద్రంగా హైదరాబాద్..
హైదరాబాద్ ఇప్పుడు ఆరోగ్య పర్యాటక కేంద్రంగా వెలుగొందుతోందని సీఎం రేవంత్ అన్నారు. మిడిల్ ఈస్ట్ లాంటి అనేక దేశాల నుంచి ఎంతోమంది వైద్య సేవల కోసం ఇక్కడికి వస్తున్నారని తెలిపారు. సీఐఏ నివేదికల ప్రకారం హైదరాబాద్‌కు 2.20 లక్షల మంది రోగులు విదేశాల నుంచి వస్తున్నారని చెప్పారు. ఆయా దేశాలకు నేరుగా విమానాలు నడపడం ద్వారా వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశముందని, ఈ విషయమై తాము పౌర విమానయాన శాఖ మంత్రితో చర్చించామని తెలిపారు. దేశంలో బల్క్ డ్రగ్ ఉత్పత్తిలో దాదాపు 35 శాతం హైదరాబాద్‌లోనే ఉత్పత్తి అవుతోందని అన్నారు. ప్రపంచానికి మూడు కొవిడ్ వ్యాక్సిన్‌లు ఉత్పత్తి చేసి ఇచ్చిన నగరమూ మనదేనని పేర్కొన్నారు. 60 ఏళ్ల క్రితం ఇందిరగాంధీ, నెహ్రూ వేసిన బీజాలే ఇప్పుడు ఫలాలను అందిస్తున్నాయని చెప్పారు. ఐడీపీఎల్‌లో నాడు పరిశోధనల్లో పాల్గొన్న ఎంతోమంది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పేరొందిన ఫార్మా సంస్థల అధినేతలుగా ఎదిగారని తెలిపారు.
మహిళలకు యునిక్ హెల్త్ కార్డులు..
తాము రూపొందిస్తున్న తెలంగాణ రైజింగ్-2047 డాక్యుమెంట్‌లో ఆరోగ్య రంగానికి ప్రత్యేకంగా ఓ అధ్యాయం పెట్టామని సీఎం రేవంత్ అన్నారు. డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి లాంటి వారి సూచనలు, సలహాలను ఆహ్వానిస్తున్నామన్నారు. వైద్యాన్ని పేదప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నదే తమ ప్రయత్నమని చెప్పారు. ఆరోగ్యశ్రీ కింద గతంలో రూ.2 లక్షల వరకు చికిత్సకు అందిస్తే, దానిని ఇప్పుడు రూ.10 లక్షలకు పెంచామని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి దాదాపు రూ.1400 కోట్లు పేదల వైద్యానికి అందించామన్నారు. ఇదంతా అనారోగ్యం బారిన పడిన తరువాత చేస్తున్న ఖర్చు అని, ఇలా కాకుండా సమస్య బారిన పడకుండా నివారణపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా స్వయం సహాయక బృందాల మహిళలకు యునిక్ ఐడీ కార్డు ఇచ్చి.. వారి ఆరోగ్య ప్రొఫైల్ రూపొందించాలని ప్రయత్నిస్తున్నామని చెప్పారు. క్యాన్సర్ బారిన పడుతున్నది ఎక్కువగా మహిళలేనని, హెల్త్‌కార్డు ద్వారా వారి కుటుంబ ఆరోగ్య చరిత్ర మొత్తం డాక్టర్‌కు తెలిసే ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు.
టీజేఎస్ సూచనలు స్వీకరిస్తాం
ప్రజా సమస్యల పరిష్కారానికి టీజేఎస్ నేతల సూచనలు స్వీకరిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం నేతృత్వంలో నేతలు బుధవారం సీఎంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు ప్రజా సమస్యలపై రేవంత్‌రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. అలాగే, ఆగస్టు1న నవతెలంగాణ దినపత్రిక వార్షికోత్సవానికి రావాలని సీపీఎం నేతలు రాఘవులు, జూలకంటి రంగారెడ్డి, నవతెలంగాణ ఎడిటర్ రమేష్, సీజీఎం ప్రభాకర్ ఉన్నారు.
ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులు..
సర్కారు ఆస్పత్రుల్లో కూడా ప్రైవేటు హాస్పిటళ్లకు దీటుగా మౌలిక సదుపాయాలు ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం రేవంత్ అన్నారు. ఉస్మానియా ఆస్పత్రిని గోషామహల్‌లో రూ.3వేల కోట్లతో 2700 పడకలతో 30 ఎకరాల్లో నిర్మిస్తున్నామని చెప్పారు. అలాగే నిమ్స్‌లో కొత్త బ్లాక్ , వరంగల్, టిమ్స్ అల్వాల్, ఎల్‌బీనగర్, సనత్‌నగర్‌లో ఆస్పత్రులు నిర్మిస్తున్నామని, ఈ ఏడాది డిసెంబరు 9 లోపు 7వేల పడకల హాస్పిటళ్లను అందుబాటులోకి తీసుకువస్తున్నామని వెల్లడించారు. విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందన్నారు. డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ తాము 25 ఏళ్ల క్రితం ఏఐజీని సోమాజిగూడలో ప్రారంభించామని, ఇప్పుడు అది గచ్చిబౌలిలో 1000 పడకల స్థాయికి చేరి.. ప్రపంచంలోనే అత్యుత్తమ హాస్పిటళ్లలో ఒకటిగా నిలిచిందని అన్నారు. ప్రస్తుతం బంజారాహిల్స్‌లో 300 పడకలతో ఈ హాస్పిటల్‌ను ఏర్పాటుచేశామని, ఏఐ సహాయంతో ఆరోగ్య సంరక్షణ సేవలను మరింత మెరుగ్గా అందిస్తామని తెలిపారు.
ఇవి కూడా చదవండి
రూ.15 వేల పెట్టుబడితో రూ.12 కోట్ల రాబడి.. ఎలాగో తెలుసా..
పాత పన్ను విధానం ఎంచుకున్న వారికి గుడ్ న్యూస్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి