Share News

CM Revanth Reddy: రేపు ఓయూకి రేవంత్‌రెడ్డి

ABN , Publish Date - Aug 24 , 2025 | 03:23 AM

ఉద్యమాలకు ఊపిరిపోసిన ఉస్మానియా యూనివర్సిటీలో రెండు దశాబ్దాల తరువాత రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యక్రమాలు జరగనున్నాయి....

CM Revanth Reddy: రేపు ఓయూకి రేవంత్‌రెడ్డి

  • రెండు దశాబ్దాల తర్వాత వర్సిటీలో సీఎం కార్యక్రమాలు

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): ఉద్యమాలకు ఊపిరిపోసిన ఉస్మానియా యూనివర్సిటీలో రెండు దశాబ్దాల తరువాత రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యక్రమాలు జరగనున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం (ఈ నెల 25న) ఓయూకు రానున్నారు. రాష్ట్ర విద్యారంగంలో సమూల మార్పులపై ఈ సందర్భంగా సీఎం ప్రసంగించనున్నారు. సీఎం రాక నేపథ్యంలో సుదీర్ఘకాలంగా వర్సిటీలో నెలకొని ఉన్న అనేక సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నంలో విద్యార్థులు ఉన్నారు. వాస్తవానికి ఉస్మానియా వర్సిటీలో టీచింగ్‌, నాన్‌టీచింగ్‌ పోస్టులను ఎప్పుడో ఉమ్మడి రాష్ట్ర హయాంలో భర్తీ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్క ఖాళీ పోస్టునూ భర్తీ చేయలేదు. ఇంజనీరింగ్‌, సైన్స్‌, ఆర్ట్స్‌ ఇలా అనేక కోర్సులకు సంబంధించి పెద్ద ఎత్తున ఖాళీలున్నాయి. ఇంజనీరింగ్‌ కోర్సులో ఒక్క ప్రొఫెసర్‌ కూడా లేరు. కాంట్రాక్టు, గెస్ట్‌ లెక్చరర్లతోనే కోర్సును కొనసాగిస్తున్నారు. ఉర్దూ డిపార్ట్‌మెంట్‌లో 19 మంది అధ్యాపకులకుగాను నలుగురే ఉన్నారు. సైకాలజీలో, ఫిలాసఫీలో ఇద్దరు మాత్రమే ప్రొఫెసర్లున్నారు. వర్సిటీలో 1400 టీచింగ్‌ పోస్టులకుగాను ప్రస్తుతం వెయ్యి వరకు ఖాళీగా ఉన్నాయి. నాన్‌టీచింగ్‌ పోస్టులు 2300 వరకు ఖాళీగా ఉన్నాయి. దీంతో అకాడమిక్‌ నిర్వహణ పూర్తిగా దెబ్బతిన్నది. ఉస్మానియా యూనివర్సిటీని 1917లో స్థాపించినప్పుడు నిజాం రాజు పెద్ద ఎత్తున భూసేకరణ చేపట్టి ఎకరాకు రూ.2 చొప్పున సుమారు 2200 ఎకరాల మేర సేకరించి వర్సిటీ పేరుమీద రాసిచ్చారు. అయితే 1950లో ఉస్మానియా యూనివర్సిటీ భూమి 1627 ఎకరాలున్నట్లుగా ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఆ తర్వాత కాలంలో రాజకీయ ప్రాబల్యంతోనే యూనివర్సిటీల భూములు కబ్జాకు గురయ్యాయి. వివాదంలో ఉన్న 251.64 ఎకరాలపై కోర్టు విచారణ సందర్భంలో సరైన పత్రాలను అందించడంలోనూ వర్సిటీ అధికారులు విఫలమవుతున్నారనే ఆరోపణలున్నాయి. వర్సిటీ భూములను సర్వే చేసి హద్దులు నిర్ణయించాల్సిన అవసరం ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ ఎన్నికల్లో గెలిచిన ఎంతో మంది రాష్ట్ర స్థాయి నేతలుగా ఎదిగారని, దీన్ని దృష్టిలో పెట్టుకొని యూనివర్సిటీలో ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు.


రేపు ఓయూలో సీఎం కార్యక్రమాలివే..!

ఉస్మానియా వర్సిటీలో రూ.80 కోట్ల వ్యయంతో నిర్మాణమై 1200 మంది విద్యార్థులకు వసతి కల్పించే రెండు హాస్టళ్లను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఆర్థిక సహాయంతో మరో 300 మంది విద్యార్థులకు వసతి కల్పించే రెండు కొత్త హాస్టళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. రూ.10 కోట్ల వ్యయంతో డిజిటల్‌ లైబ్రరీ రీడింగ్‌ రూం పనులను ప్రారంభించనున్నారు. ఓయూలోని ఠాగూర్‌ ఆడిటోరియంలో ‘తెలంగాణ విద్యా రంగంలో మార్పులు ప్రభుత్వ ప్రణాళిక’ అనే అంశంపై సీఎం ప్రసంగించనున్నారు.

ఇవి కూడా చదవండి..

నిధుల్లో న్యాయబద్ధమైన వాటా మాకివ్వడం లేదు.. కేంద్రంపై స్టాలిన్ విసుర్లు

అది సుప్రీం తీర్పు, నా వ్యక్తిగతం కాదు: హోం మంత్రికి సుదర్శన్ రెడ్డి కౌంటర్

For More National News And Telugu News

Updated Date - Aug 24 , 2025 | 08:14 AM