Revanth Reddy: గత పాలకుల భూ దోపిడిని బయటపెట్టండి
ABN , Publish Date - Sep 06 , 2025 | 04:27 AM
ధరణి భూతాన్ని తెచ్చి భూములు కొల్లగొట్టాలని గతపాలకులు చూశారు. వాళ్ల దోపిడీకి మీరు అడ్డుగా ఉన్నారని భావించారు. అందుకే, మిమ్మల్ని దోషులుగా, దోపిడీ దారులుగా చిత్రీకరించారు.
మీపై పడిన మచ్చను తొలగించుకునేలా పని చేయండి.. వారి దోపిడిని ప్రశ్నిస్తారనే మీపై అవినీతి ముద్ర
మిమ్మల్ని దోపిడీదారులుగా చిత్రీకరించారు
మీ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసిన వారి భరతం పట్టండి
సర్కారుకు, ప్రజలకు మధ్య వారధిగా నిలవండి
గ్రామ పాలనాధికారులతో సీఎం రేవంత్
5000 మందికి హైటెక్స్‌లో నియామక పత్రాల అందజేత
హైదరాబాద్, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): ‘‘ధరణి భూతాన్ని తెచ్చి భూములు కొల్లగొట్టాలని గతపాలకులు చూశారు. వాళ్ల దోపిడీకి మీరు అడ్డుగా ఉన్నారని భావించారు. అందుకే, మిమ్మల్ని దోషులుగా, దోపిడీ దారులుగా చిత్రీకరించారు. ధరణి దర్రిదాన్ని వదిలించి.. మిమ్మల్ని దోపిడీదారులుగా చిత్రీకరించిన గత పాలకుల భరతం పట్టండి. వారు దోచుకున్న భూముల లెక్కలు బయటపెట్టండి’’ అని రెవెన్యూ ఉద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఐదు వేలమంది గ్రామ పాలనాధికారుల (జీపీవో)కు నియామక పత్రాలను అందించేందుకు శుక్రవారం హైటెక్స్‌లో ‘కొలువుల పండగ’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎంపిక చేసిన పదిమందికి సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తమ భూముల దోపిడీ లెక్కలు గ్రామగ్రామాన బయటకు తెలుస్తాయని, తెలంగాణ సమాజం ప్రశ్నిస్తుందనే గత పాలకులు వీఆర్వో, వీఆర్‌ఏ వ్యవస్థను రద్దు చేశారని, వారిని బలి పశువులను చేశారని మండిపడ్డారు. గతంలో భూమిని చెరబట్టిన వారిని తెలంగాణ ప్రజలు దిగంతాలకు తరిమారని గుర్తు చేశారు. ‘‘నేను పాదయాత్ర చేసే సమయంలో ఏ గ్రామానికి వెళ్లినా.. ఎవరిని కదిలించినా ధరణి భూతం పీడిస్తోందనే చెప్పారు. కొరివి దయ్యం నుంచి విముక్తి కల్పించండి అని అడిగారు. ధరణితో విసిగిపోయి ఇబ్రహీంపట్నంలో పెట్రోల్ పోసి ఓ అధికారిని తగులబెట్టారు. సిరిసిల్లలో ఓ మహిళ తన వద్ద డబ్బులు లేవంటూ తాళిబొట్టును కార్యాలయం తలుపుకు కట్టి వెళ్లింది. ధరణి అధికారుల వల్ల తలెత్తిన సమస్య కాదు. పాలకులు సృష్టించిన వైరస్. అందుకే, ప్రజాపాలనలో ధరణిని బంగాళాఖాతంలో విసిరేస్తామని చెప్పాం. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ధరణి మహమ్మారిని వదిలించి భూభారతి చట్టం తెచ్చాం’’ అని వివరించారు. తమ ప్రభుత్వం గ్రామ స్థాయి రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించిందని, ప్రజలకు, ప్రభుత్వానికి వారధులుగా పని చేయాలనే 5 వేల మంది జీపీవోలను నియమిస్తున్నామని తెలిపారు. 1.56 కోట్ల ఎకరాల భూముల రెవెన్యూ రికార్డులను ప్రక్షాళన చేసి.. గతంలో జరిగిన తప్పిదాలను సరిదిద్ది.. ప్రజలకు సమస్యలు లేకుండా చూడాల్సిన బాధ్యత వారిపైనే ఉందన్నారు. సాదాబైనామా వంటి సమస్యలతోపాటు భూ సమస్యలను పరిష్కరించాలని చెప్పారు.
రెండు, మూడు శాతం చెడ్డవాళ్లు ఉంటారు
ప్రతి ఉద్యోగి జాగ్రత్తగా పని చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ప్రతి వ్యవస్థలోనూ రెండు మూడు శాతం చెడ్డవారు ఉంటారని, అంత మాత్రాన వ్యవస్థను తగులబెట్టుకుంటామా అని ప్రశ్నించారు. ఆనాడు రెవెన్యూ శాఖలో తప్పిదాలు జరిగి ఉండవచ్చని, వాటిని సరిదిద్దుకునేందుకు, చట్టప్రకారం చర్యలు తీసుకునేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పారు. వ్యవస్థనే రద్దు చేయడం వల్ల ప్రజలకు న్యాయం జరగలేదన్నారు. రేషన్ కార్డుల జారీ, సన్న బియ్యం పంపిణీ, రైతు భరోసా అమలు సమయంలో గ్రామ స్థాయి రెవెన్యూ సిబ్బంది లేని లోటును గుర్తించామని, గ్రామాలకు వెళ్లి.. సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వానికిచెడ్డపేరు వస్తే అందరికి వస్తుందని, దీనిని ఆత్మ గౌరవానికి సంబంధించిన సమస్యగా జీపీవోలు పనిచేయాలని చెప్పారు. మీపై పడిన ముద్రను తొలగించుకుని గత పాలకులు చేసిన ప్రచారాన్ని ప్రజలు మరిచిపోయేలా పనిచేయాలని హితవు పలికారు.
ప్రభుత్వానికి మచ్చ రాకుండా పని చేయండి
మంత్రి పొంగులేటి
ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం.. దొరల ప్రభుత్వం తెచ్చిన ధరణి అనే భయంకర భూతాన్ని బంగాళాఖాతంలో కలిపి భూ భారతి చట్టాన్ని తీసుకు వచ్చామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. దీని రూపకల్పన సమయంలో సీఎం రేవంత్‌రెడ్డిని పలుమార్లు విసిగించి ఆయన సలహాలతో తీసుకొచ్చామని చెప్పారు. ఇకపై ప్రభుత్వానికి మాట, మచ్చ రాకుండా పని చేయాల్సిన బాధ్యత రెవెన్యూ ఉద్యోగులదేనని చెబుతూ.. ప్రజలకు ఉన్నత సేవలు అందిస్తామంటూ వారితో ప్రత్యేకంగా ప్రతిజ్ఞ చేయించారు. మొత్తం దరఖాస్తులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గ్రామ పాలనాధికారులు, సర్వేయర్ల నియామకంతో భూ సమస్యలన్నిటినీ పరిష్కరిస్తామన్నారు. 7000 మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లను ఉగాదిలోగా భర్తీ చేస్తామని ప్రకటించారు. మూడు దశాబ్దాలుగా వివిధ ప్రాజెక్ట్‌లకు జరిగిన భూసేకరణలో ఇంకా రైతుల పేర్లు పహాణీల్లో ఉండిపోయాయని, ఈ సమస్యను కూడా పరిష్కరిస్తామని చెప్పారు. ఏటా డిసెంబర్ 31 నాటికి గ్రామాల వారీగా క్రయ విక్రయాల లెక్కలను వివరించేలా ప్రకటన జారీ చేస్తామని, దీని హార్డ్ కాపీ ప్రతి రెవెన్యూ గ్రామంలో అందుబాటులో ఉంచుతామని తెలిపారు. గ్రామ పాలనాధికారుల నియామకాలు చేసినందుకు తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు వంగ అరవింద్ రెడ్డి, కార్యదర్శి గౌతమ్ కుమార్ సీఎంకు, ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి సీతక్క, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఫలించిన ప్రభుత్వ ప్రయత్నం.. తెలంగాణకు యూరియా రాక..
మద్యం కుంభకోణం కేసులో కీలక పురోగతి
Read Latest TG News and National News