Share News

CM Revanth Reddy: సర్వేయర్లకు నియామక పత్రాలు పంపిణీ చేసిన రేవంత్ రెడ్డి..

ABN , Publish Date - Oct 19 , 2025 | 03:18 PM

శిక్షణ పొందిన సర్వేయర్లకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్బంగా గత కేసీఆర్ ప్రభుత్వం మీద సీఎం విమర్శలు గుప్పించారు.

CM Revanth Reddy: సర్వేయర్లకు నియామక పత్రాలు పంపిణీ చేసిన రేవంత్ రెడ్డి..
Telangana CM Revanth Reddy

హైదరాబాద్, అక్టోబర్ 19: శిక్షణ పొందిన సర్వేయర్లకు తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ(ఆదివారం) నియామక పత్రాలు (Appointment Letters to Licensed Surveyors) అందజేశారు. ఈ సందర్బంగా గత కేసీఆర్ ప్రభుత్వం మీద సీఎం విమర్శలు గుప్పించారు. BRS తెచ్చిన ధరణి చట్టం.. కొందరికి చుట్టంగా మారిందని(CM Revanth Reddy Slams Dharani Law) ముఖ్యమంత్రి ఎద్దేవా చేశారు. 'ధరణి చట్టాన్ని అడ్డుపెట్టుకుని ఆధిపత్యం చెలాయించాలని చూశారు. గత ప్రభుత్వ ఓటమికి ప్రధాన కారణం ధరణి చట్టమే. అధికారంలోకి రాగానే ధరణి భూతాన్ని వదిలించాం. భూ సమస్యలు పరిష్కరించాలనే లైసెన్స్డ్‌ సర్వేయర్లను తీసుకొచ్చాం. గత ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వలేదు.. ఇచ్చినా పరీక్షలు పెట్టలేదు. ఒకవేళ పరీక్షలు పెట్టినా ప్రశ్నపత్రాలు జిరాక్స్ సెంటర్లలో దొరికేవి. గత ప్రభుత్వ హయాంలో TGPSC పునరావాస కేంద్రంగా ఉండేది. అధికారంలో రాగానే TGPSCని ప్రక్షాళన చేశాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే 60వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. మేం ఉద్యోగాలు ఇస్తుంటే.. కోర్టుల్లో కేసులు వేసి ఆపాలని చూశారు. కోర్టుల్లో పోరాడి అభ్యర్థులకు నియామకపత్రాలు అందజేశాం' అని సీఎం రేవంత్ తెలిపారు.


గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో(Previous BRS Government) తెచ్చిన ధరణి చట్టం కొంత మంది దొరలకే చుట్టంగా మారిందన్న రేవంత్ రెడ్డి.. అందుకే ప్రతీ ఒక్క సర్వేయర్ బాధ్యతగా పని చేయాలంటూ సీఎం సూచించారు. 'ధరణి భూతాన్ని పెంచి పోషించి భూమిపై ఆధిపత్యాన్ని చెలాయించాలనుకున్న దొరలకు గత ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారు. అధికారంలోకి వచ్చాక ధరణి దరిద్రాన్ని వదిలిస్తామని ఆనాడు మేం మాట ఇచ్చాం. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే ధరణి భూతం నుంచి విముక్తి కల్పించాం. పదేళ్లుగా ఉద్యోగ నియామకాలపై గత పాలకులు నిర్లక్ష్యం వహించారు. ప్రజా ప్రభుత్వంలో ఉద్యోగ నియామక ప్రక్రియను చేపట్టి నిరుద్యోగుల కళ్లల్లో ఆనందం చూస్తున్నాం. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దడమే మా లక్ష్యం. ఆ దిశగా ముందుకెళ్లేందుకు మీ సహకారం ఉండాలి. రైతే దేశానికి వెన్నెముక.. అలాంటి రైతుకు అండగా ఉండండి. తెలంగాణ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కావాలి' అని సీఎం రేవంత్ రెడ్డి కొత్తగా ఎంపికైన సర్వేయర్లకు దిశానిర్దేశం చేశారు.


ఇవి కూడా చదవండి..

దీపావళి వేళ.. ఢిల్లీలో ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం

భూభారహరణం.. నరకాసురుడి మరణం

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 19 , 2025 | 07:04 PM