Share News

Revanth Reddy SLBC Tunnel: రెండేళ్లలో ఎస్‌ఎల్‌బీసీ

ABN , Publish Date - Sep 05 , 2025 | 04:07 AM

శ్రీశైలం లెఫ్ట్‌ బ్యాంక్‌ కెనాల్‌ (ఎస్‌ఎల్‌బీసీ) టన్నెల్‌ తవ్వకాన్ని 2027 డిసెంబరు 9వ తేదీకల్లా పూర్తి చేయాలని , అదే రోజున తెలంగాణ ప్రజలకు అంకితం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు.

Revanth Reddy SLBC Tunnel: రెండేళ్లలో ఎస్‌ఎల్‌బీసీ

  • 2027 డిసెంబరు తొమ్మిదినాటికి పూర్తి కావాలి.. నిపుణుల సేవలు వాడుకోండి

  • గతంలో జరిగిన తప్పులు పునరావృతం కావొద్దు.. సమీక్షలో సీఎం రేవంత్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం లెఫ్ట్‌ బ్యాంక్‌ కెనాల్‌ (ఎస్‌ఎల్‌బీసీ) టన్నెల్‌ తవ్వకాన్ని 2027 డిసెంబరు 9వ తేదీకల్లా పూర్తి చేయాలని , అదే రోజున తెలంగాణ ప్రజలకు అంకితం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. పనులు ఒక్కరోజు కూడా ఆలస్యం కావడానికి వీల్లేదని నిర్దేశించారు. జూబ్లీ హిల్స్‌లోని సీఎం నివాసంలో గురువారం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సమక్షంలో అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. పునరుద్ధణ చేపట్టిన తర్వాత ఒక్కరోజు కూడా పనులు ఆలస్యం కారాదని నిర్దేశించారు. ఈ ప్రాజెక్టు కేవలం ఫ్లోరోసిస్‌ పీడిత నల్గొండ జిల్లాకే కాకుండా యావత్‌ తెలంగాణకు అత్యంత కీలకమని చెప్పారు. ఎస్‌ఎల్‌బీసీ పూర్తయితే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా గ్రావిటీతో నీరు అందే అవకాశం ఉందన్నారు. శ్రీశైలం నుంచి అక్కపల్లి రిజర్వాయర్‌ దాకా ఉన్న సమస్యలన్నీ పరిష్కారం కావాలన్నారు. ‘‘టన్నెల్‌ తవ్వకాన్ని ఇన్‌లెట్‌ (శ్రీశైలం) నుంచి టన్నెల్‌ బోరింగ్‌ మిషన్‌ (టీబీఎం) ద్వారా కాకుండా టన్నెలింగ్‌ బ్లాస్టింగ్‌ మెథడ్‌తో చేపట్టాలి. ఇందుకు అవసరమైన అనుమతులు సాధించాలి. సొరంగం తవ్వకానికి నిర్మాణ సంస్థ జేపీ అసోసియేట్స్‌ సర్వ సన్నద్ధంగా ఉండాలి. సింగరేణి నిపుణుల సేవలనూ వినియోగించుకోవాలి. టన్నెల్‌ తవ్వకానికి, నిరంతరం సీపేజీ నీటిని బయటికి తరలించడానికి విద్యుత్‌ సరఫరా చేయాలి. గతంలో జరిగిన తప్పులు, లోటుపాట్లు పునరావృతం కావద్దు. పకడ్బందీగా రక్షణ చర్యలు చేపట్టి ముందుకు సాగాలి’’ అని నిర్దేశించారు. ఆర్మీ సహా ఆయా రంగాల్లో నిష్ణాతుల సేవలను వినియోగించుకోవాలని, యుద్ధ ప్రాతిపదికన పనులు చేయాలని ఆదేశించారు. భవిష్యత్తులో దేశ విదేశాల్లో చేపట్టే టన్నెల్‌ ప్రాజెక్ట్‌లకు ఆదర్శంగా ఉండేలా ఎస్‌ఎల్బీసీ నిర్మాణం పూర్తి చేయాలని.. ఇదొక కేస్‌ స్టడీగా ఉండాలని చెప్పారు. ఇందుకు అవసరమైన అన్ని అనుమతులు, నిర్ణయాలు తీసుకునేందుకు ఈనెల 15లోగా క్యాబినెట్‌ సమావేశం ఏర్పాటు చేయాలని సీఎ్‌సను ఆదేశించారు. అటవీ శాఖ అనుమతులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఇన్‌లెట్‌.. ఔట్‌లెట్‌.. రెండు వైపుల నుంచి పనులు చేపట్టాలని.. అందుకు అవసరమైన యంత్ర పరికరాలతోపాటు సరిపడ నిపుణులు, కార్మికులను రంగం లోకి దింపాలని సూచించారు.


గ్రీన్‌ చానల్‌లో నిధులు

ఎస్‌ఎల్‌బీసీ పనులకు గ్రీన్‌ చానల్‌లో నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. మొత్తం 44 కిలోమీటర్ల సొరంగ మార్గానికి గాను ఇప్పటికే 35 కిలో మీటర్ల తవ్వకం పూర్తయిందని, మిగిలిన తొమ్మిది కిలోమీటర్లకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నట్టు ఇండియన్‌ ఆర్మీ కల్నల్‌ పరీక్షిత్‌ మోహ్ర వివరించారు. ప్రతి నెల 178 మీటర్ల సొరంగం తవ్వడం లక్ష్యంగా పెట్టుకుని జనవరి 2028 నాటికి పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ప్రపంచంలో అత్యాధునిక సాంకేతికతతో కూడిన హెలీ-బోర్న్‌ సర్వే నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఎన్‌జీఆర్‌ఐ ద్వారా దీనిని నిర్వహించనున్నారు. దీంతో సొరంగం తవ్వకాల సమయంలో ముందుగానే ప్రమాదాలను పసిగట్టే వీలుంటుంది.


సీఎంతో లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ హర్పాల్‌సింగ్‌ భేటీ

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ తవ్వకంపై సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని సరిహద్దు రోడ్డు సంస్థ (బీఆర్‌వో) మాజీ డీజీ, ఆర్మీ మాజీ ఈఎన్‌సీ లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ హర్పాల్‌ సింగ్‌ కలిశారు. ఆయన్ను ప్రభుత్వం గౌరవ సలహాదారుగా నియమించిన విషయం విదితమే. సమీక్షలో నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, సలహాదారులు ఆదిత్యనాథ్‌దాస్‌, ఈఎన్‌సీలు మహ్మద్‌ అంజత్‌ హుేస్సన్‌, ఎన్జీఆర్‌ఐ డైరెక్టర్‌ ప్రకాశ్‌ కుమార్‌, చీఫ్‌ సైంటిస్ట్‌ హెచ్వీఎస్‌ సత్యనారాయణ, జీఎ్‌సఐ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ కేవీ మారుతి, డైరెక్టర్‌ శైలేంద్ర కుమర్‌ సింగ్‌, నల్గొండ చీఫ్‌ ఇంజనీర్‌ అజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

సుగాలి ప్రీతి కేసుపై సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం

22 నుంచి దసరా ఉత్సవాలు.. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు: మంత్రి ఆనం

Read Latest TG News and National News

Updated Date - Sep 05 , 2025 | 04:07 AM