CM Revanth Reddy: కట్టె లేకుండా నిలబడు చాలు!
ABN , Publish Date - Feb 01 , 2025 | 03:54 AM
తాను కొడితే మామూలుగా ఉండదన్న మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఘాటుగా బదులిచ్చారు. ‘బలంగా కొట్టడమేమోగానీ.. కట్టె లేకుండా నిలబడు చూద్దాం’ అంటూ ఎద్దేవా చేశారు.
దమ్ముంటే అసెంబ్లీకి రా.. లెక్కలు తేల్చుకుందాం
మాజీ సీఎం కేసీఆర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి సవాల్
సోషల్ మీడియాలో రాఖీ సావంత్‌కూ లైక్‌లొస్తాయ్
కేసీఆర్‌కు ప్రజలతో బంధాలు తెగాయని వ్యాఖ్య
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి): తాను కొడితే మామూలుగా ఉండదన్న మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఘాటుగా బదులిచ్చారు. ‘బలంగా కొట్టడమేమోగానీ.. కట్టె లేకుండా నిలబడు చూద్దాం’ అంటూ ఎద్దేవా చేశారు. ఫామ్‌హౌ్‌సలో ఉండి మాట్లాడటం కాదని, దమ్ముంటే అసెంబ్లీకి రావాలని, ఎవరేంటో లెక్కలు తేల్చుకుందామని సవాల్ విసిరారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా మొగిలిగిద్ద ప్రభుత్వ పాఠశాల 150వ వార్షికోత్సవ వేడుకలకు సీఎం రేవంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన తొలుత విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ ప్రతిపక్ష నేత కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ధనిక రాష్ట్రాన్ని అప్పగిస్తే కేసీఆర్ కుటుంబ సభ్యులు పందికొక్కుల్లా దోచుకుతిన్నారని, పదేళ్లలో రూ.7 లక్షల కోట్ల అప్పులు చేశారని ఆరోపించారు. ‘‘అన్ని వర్గాలకు పంగనామాలు పెట్టిన చరిత్ర చంద్రశేఖర్‌రావుది. జహంగీర్ పీర్ దర్గాకు రూ.100 కోట్లు ఇస్తానని, రాజన్న సిరిసిల్ల ఆలయానికి రూ.100 కోట్లు ఇస్తానని మోసం చేశాడు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుతోపాటు ఇతర ప్రాజెక్టులు పూర్తిచేస్తామని మాట ఇచ్చి ఎండబెట్టి దుర్మార్గుడు. ఏడాది కూడా కాకముందే ఆయన కోసం ప్రజలు ఏడుస్తున్నారట! నీకోసం ఎవరూ బాధపడడం లేదు. నువ్వు బలంగా కొట్టడమేమోగానీ.. కట్టె లేకుండా నిలబడు చూద్దాం. 14 నెలలు ఫామ్‌హౌ్‌సలో ఉంటూ గంభీరంగా చూస్తున్నానంటున్నావ్. ఏం చూస్తున్నావ్? అచ్చోసిన ఆంబోతుల్లా కొడుకును, అల్లుడిని ప్రజల మీదకు వదిలావ్. వారు ఊరిమీద పడి మేస్తున్నరు. వారిని అదుపులో పెట్టుకో. నేను మీలా మాట ఇచ్చి మడమ తిప్పను. హామీలు ఇచ్చి ఎగ్గొట్టను. అబద్ధాలు చెప్పడం వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయారు. పార్లమెంట్ ఎన్నికల్లో మీకు గుండు సున్నా. అయినా మీలో మార్పురాలేదు’’ అని రేవంత్‌రెడ్డి విమర్శలు గుప్పించారు.
ప్రజలకు పంగనామాలు పెట్టారు..
దళిత ముఖ్యమంత్రి, దళితులకు మూడెకరాలు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లతోపాటు అనేక హామీలు ఇచ్చి ప్రజలకు పంగనామాలు పెట్టిన చరిత్ర కేసీఆర్‌ది అని సీఎం రేవంత్ ఆరోపించారు. అందుకే ప్రజలు ఎన్నికల్లో గుణపాఠం చెప్పారన్నారు. ‘‘నువ్వు అసెంబ్లీకి వస్తే అన్నీ మాట్లాడకుందాం. అడిగిన లెక్కలన్నీ చెబుతా. మేము మాట తప్పం.. మడమ తిప్పం. రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఉచిత విద్యుత్తు, మహిళలకు ఉచిత బస్సు, కూలీలకు ఏడాదికి రూ.12 వేల చొప్పున ఆర్థిక సహాయం వంటి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నాం. నిరుద్యోగ సమస్యను దృష్టిలో పెట్టుకుని ఆరు నెలల్లోనే 55,143 ప్రభుత్వ ఉద్యోగాలిచ్చాం. పదేళ్లలో బీఆర్‌ఎస్ ఇవ్వలేనన్ని ఉద్యోగాలు ఏడాదిలోనే ఇచ్చాం’’ అని సీఎం అన్నారు. వీటన్నింటిపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమని చెప్పారు. తమ నేత రాహుల్‌గాంధీ ‘భారత్ జోడో’ యాత్రలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో కులగణన చేపట్టి తొలిసారి బీసీల లెక్కలు తేల్చామన్నారు. కులగణన నివేదిక శనివారం రానుందని చెప్పారు. ఎస్సీ వర్గీకరణపై జ్యుడీషియల్ కమిషన్ ఇచ్చిన నివేదికతో పాటు కులగణన నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెడతామన్నారు.
రాఖీ సావంత్‌కూ లైక్‌లు వస్తాయి..
కేసీఆర్ రద్దయిన వెయ్యి రూపాయల నోటు లాంటివారని, కాలం చెల్లిన నోట్లను జేబులో పెట్టుకుని తిరుగుతామా? అని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ను తెలంగాణ సమాజంలో అడిగేటోళ్లే లేరని, ఫామ్‌హౌ్‌సలో ఉన్న ఆయనకు ప్రజలతో సంబంధాలు తెగిపోయాయని అన్నారు. ప్రజలు తిరస్కరించినా బీఆర్‌ఎస్ మారలేదని విమర్శించారు. ‘‘సోషల్ మీడియాలో కేసీఆర్‌కు, నాకు పోటీ పెడితే.. నాకంటే కేసీఆర్‌కు ఎక్కువ లైక్‌లు వచ్చాయంటున్నారు. కేంద్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్.. సోషల్ మీడియా, టిక్‌టాక్‌లో లైక్‌లు చూసి సంబరపడుతున్నారు. దీనినిబట్టి ఆయన మానసిక స్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గతంలో సల్మాన్‌ఖాన్‌కు, రాఖీ సావంత్‌కు సోషల్ మీడియాలో పోటీ పెడితే.. రాఖీ సావంత్‌కే ఎక్కువ లైక్‌లు వచ్చాయి. అంతమాత్రాన సల్మాన్‌ఖాన్ గొప్పనటుడు కాకుండా పోతారా? ఆయన (కేసీఆర్) పెద్దమనిషి. ఆయన్ను నేను ఏమీ అనడం లేదు. ఊరిమీద పడి అరుస్తున్న తన అల్లుడిని, కొడుకును కంట్రోల్‌లో పెట్టుకోవాలి’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు.
విద్యారంగానికి అధిక ప్రాధాన్యం..
విద్యారంగానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని, అందుకే విద్యాశాఖను తన వద్దే ఉంచుకున్నానని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. మొగిలిగిద్ద ప్రభుత్వ పాఠశాల విద్యార్థులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ఎంతో చరిత్ర కలిగిన ఈ పాఠశాల 150 ఏళ్ల వేడుకల్లో పాల్గోనే అవకాశం రావడం తన భాగ్యమన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, పాలమూరు బిడ్డ బూర్గుల రామకృష్ణారావుతోపాటు రాజకీయ ఉద్దండులు మర్రి చెన్నారెడ్డి, యూపీ మాజీ గవర్నర్ సత్యనారాయణరెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాసరావు, పౌరహక్కుల సంఘం నేత హరగోపాల్ వంటి ప్రముఖులు చదువుకున్న పాఠశాల చరిత్ర ఎంతో ఘనమైనదని తెలిపారు. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉందనే విషయాన్ని తాను బలంగా నమ్ముతానని చెప్పారు. తాము అధికారంలోకి రాగానే ఈ రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చి ఖాళీ ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడమే కాకుండా భారీగా నిధులు కేటాయించామని తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చాక విద్యాశాఖ బడ్జెట్ రూ.21 వేల కోట్లకు పెంచామని, గతంలో ఏడు శాతం ఉండగా 11 శాతానికి తీసుకువచ్చామని తెలిపారు. రాబోయే రోజుల్లో 15 శాతం కేటాయిస్తామని చెప్పారు. ఫ్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యనందించే విషయంపై ఉపాధ్యాయులు కొంత ఆలోచన చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఎవరిపైనా ఆరోపణలు చేయడం లేదంటూనే.. లోపాలను సవరించుకుందామన్నారు. ‘‘విద్యారంగంలో గణాంకాలు చూసినపుడు చిన్న చిన్న అంశాలు ఆశ్చర్యం, బాధ కలిగిస్తున్నాయి. రాష్ట్రంలో 30 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 24 లక్షల మంది పిల్లలు చదువుతుండగా, 12,500 ప్రైవేటు స్కూళ్లలో 30 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రైవేటు స్కూళ్లలో చదువు చెప్పే టీచర్లు మీ కంటే గొప్పగా చదువుకున్నవారు కాదు. కానీ, ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల ఫలితాలు చూసినపుడు బాధ వేస్తుంది. ఉపాధ్యాయులు, ఫ్రొఫెసర్లు ఈ విషయంలో ఆలోచించాలి. పాఠశాలలు అయిపోయిన తరువాత విద్యార్థుల టాలెంట్ వెలికితీసి.. మేలి రత్నాలను తయారు చేయాలి.’’ అని సీఎం అన్నారు. మొగిలిగిద్ద ప్రభుత్వ పాఠశాల, జూనియర్ కాలేజీని ఆదర్శవంతంగా తీర్దిదిద్దుదామన్నారు. ప్రొఫెసర్ హరగోపాల్ పాఠశాల గొప్పదనాన్ని తన దృష్టికి తీసుకురావడంతో అభివృద్ధి కోసం రూ.16 కోట్లను మంజూరు చేశానని తెలిపారు.
క్రీడాభివృద్ధికి ప్రత్యేక చర్యలు..
జాతీయోద్యమ సమయంలో యువత కోసం మహత్మాగాంధీ 1921-31 వరకు యంగ్ ఇండియా పత్రిక నిర్వహించారని, ఆయన స్ఫూర్తితో రాష్ట్రంలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీ ప్రారంభించామని సీఎం రేవంత్ తెలిపారు. క్రీడల్లో కూడా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళుతున్నామని చెప్పారు. ఇక వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధం కావాలని సీఎం పిలుపునిచ్చారు.
తెలంగాణ విద్యా చరిత్రలో మొగిలిగిద్ద పాఠశాల ఓ జ్ఞాపకం: సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ విద్యా చరిత్రలో మొగిలిగిద్ద పాఠశాల చెక్కుచెదరని జ్ఞాపకమని సీఎం రేవంత్‌పేర్కొన్నారు. ఆ పాఠశాలను సందర్శించినప్పుడు రాష్ట్రంలోని తండాలు, గూడేలు, మారుమూల పల్లెల నుంచి విద్యావ్యవస్థను పునరుద్ధరించుకోవాలన్న తన సంకల్పానికి ఒక స్ఫూర్తిగా అనిపించిందంటూ ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. 150 ఏళ్లగా విద్యా చైతన్యాన్ని వెదజల్లుతున్న మొగిలిగిద్ద పాఠశాలకు, దశాబ్దాలుగా అందుకు సహకరిస్తూ వస్తున్న ప్రతీ ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు చెప్పారు.
ఇవీ చదవండి:
సచిన్‌కు ప్రతిష్టాత్మక పురస్కారం.. ఈ అవార్డు చాలా స్పెషల్
ఒకే రోజు ముగ్గురు స్టార్ల సెంచరీలు మిస్.. ఇది ఊహించలేదు
చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆసీస్‌కు బిగ్ షాక్.. అసలైనోడు దూరం
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి