Miss World 2025: అందాల పోటీలతో రాష్ట్ర ఖ్యాతి విశ్వవ్యాప్తం
ABN , Publish Date - May 06 , 2025 | 04:26 AM
మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసేందుకు దోహదం చేస్తాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆ మేరకు ఈ నెల 10-31 తేదీల మధ్య హైదరాబాద్ వేదికగా జరగనున్న పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని, ఏర్పాట్లను ఘనంగా చేయాలని అధికారులకు సూచించారు.
ప్రతిష్ఠాత్మకంగా మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలతో స్వాగతం
ప్రతి కార్యక్రమానికి ఓ నోడల్ అధికారి: రేవంత్
మిస్ వరల్డ్ పోటీలపై అధికారులతో సీఎం సమీక్ష
10న గచ్చిబౌలిలో పోటీలు షురూ.. 31న ముగింపు
ఉప్పల్‌లో ఐపీఎల్ సెమీస్ వీక్షించనున్న అందగత్తెలు
హైదరాబాద్, మే 5 (ఆంధ్రజ్యోతి): మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసేందుకు దోహదం చేస్తాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆ మేరకు ఈ నెల 10-31 తేదీల మధ్య హైదరాబాద్ వేదికగా జరగనున్న పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని, ఏర్పాట్లను ఘనంగా చేయాలని అధికారులకు సూచించారు. పోటీల నిర్వహణకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ పోటీల్లో 116 దేశాలకు చెందిన యువతులు పాల్గొంటారని, అలాగే ఆయా దేశాలకు చెందిన ప్రతినిధులు, దాదాపు మూడు వేలమంది మీడియా ప్రతినిధులు హాజరవుతారని.. వీరందరికి ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ఘనంగా ఆతిథ్యమివ్వాలని సూచించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలతో అతిథులకు స్వాగతం పలకాలని.. నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని నిర్దేశించారు. మిస్ వరల్డ్-2025 ఏర్పాట్లపై సోమవారం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు జూపల్లి, పొంగులేటి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. 10న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమం నుంచి, 31న జరిగే గ్రాండ్ ఫినాలే వరకు ప్రతి కార్యక్రమం కోసం ప్రత్యేకంగా నోడల్ అధికారిని నియమించాల ని సూచించారు. హైదరాబాద్‌లోని చార్మినార్, లాడ్‌బజార్, సచివాలయం, తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు రాష్ట్రంలోని పలు పర్యాటక ప్రాంతాలను పోటీదారులు సందర్శించనున్న నేపథ్యంలో అవసరమైన రవాణా, ఇతర వసతులు కల్పించాలన్నారు.
డ్వాక్రా బజార్ సందర్శించనున్న అందగత్తెలు
పోటీలకు విచ్చేయనున్న అందగత్తెలు ఐకేపీ మహిళలు నిర్వహించనున్న డ్వాక్రా బజార్‌ను సందర్శించనుండటంతో పాటు ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ సెమీఫైనల్ మ్యాచ్‌ను తిలకించనున్న నేపథ్యంలో ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం నిర్దేశించారు. మిస్ వరల్డ్‌కు వచ్చే విదేశీ అతిథులు బస చేసే హోటళ్లతో పాటు గచ్చిబౌలి ేస్టడియం, చార్మినార్, లాడ్ బజార్, చౌమహల్లా ప్యాలెస్, సచివాలయ పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని పోలీసు శాఖను ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రజా ప్రతినిధులతో పాటు వివిధ రంగాల్లో ప్రముఖులను ప్రభుత్వం తరఫున మిస్ వరల్డ్-2025 ప్రారంభోత్సవానికి ఆహ్వానించాలని సూచించారు. ప్రభుత్వ గురుకులాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ వెల్పేర్ రెసిడెన్షియల్ స్కూళ్లు, మోడల్ స్కూళ్లు, కస్తూర్బా పాఠశాలలకు చెందిన విద్యార్థులకు కూడా ఒకరోజు మిస్ వరల్డ్ వేడుకలు చూపించాలని, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. సమీక్షలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎస్ రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, డీజీపీ జితేందర్, సిటీ సీపీ సీవీ ఆనంద్, రాచకొండ సీపీ జి.సుధీర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Pahalgam Terror Attack: ప్రధాని మోదీతో రక్షణ శాఖ కార్యదర్శి భేటీ.. ఎందుకంటే..
WAQF Amendment Bill 2025: వక్ఫ్ సవరణ బిల్లుపై విచారణను ఈ నెల 15కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు
TGSRTC: బస్ భవన్‌ను ముట్టడించిన కార్మికులు.. పరిస్థితి ఉద్రిక్తం
For Telangna News And Telugu News