Congress protest: బీసీ రిజర్వేషన్ల సాధనకు నేడు ఢిల్లీలో సమరం
ABN , Publish Date - Aug 06 , 2025 | 04:27 AM
బీసీ రిజర్వేషన్ల పోరాటం దేశ రాజధాని ఢిల్లీ చేరుకుంది. ఎంత జనాభాకు అంత వాటా అనే రాహుల్‌గాంధీ నినాదాన్ని ఆచరణలో పెట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ఉద్యమిస్తోంది.
సీఎం రేవంత్ ఆధ్వర్యంలో జంతర్‌మంతర్ వద్ద ధర్నా.. బిల్లులను పార్లమెంటులో ఆమోదించాలని డిమాండ్
హస్తినకు మంత్రులు, ఎమ్మెల్యేలు, బీసీ సంఘాల నేతలు.. ధర్నాలో పాల్గొననున్న రాహుల్, ప్రతిపక్ష నేతలు
ధర్నాకు మద్దతు తెలపాలని 200 మంది ఇండియా కూటమి ఎంపీలకు కాంగ్రెస్ ఎంపీల లేఖలు
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై లోక్‌సభలో వాయిదా తీర్మానాల తిరస్కృతి
న్యూఢిల్లీ/హైదరాబాద్, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): బీసీ రిజర్వేషన్ల పోరాటం దేశ రాజధాని ఢిల్లీ చేరుకుంది. ఎంత జనాభాకు అంత వాటా అనే రాహుల్‌గాంధీ నినాదాన్ని ఆచరణలో పెట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ఉద్యమిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు, విద్య, ఉపాధి రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులను పార్లమెంట్‌లో ఆమోదించాలని కోరుతూ బుధవారం జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేపట్టనుంది. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ ధర్నా నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రితోపాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్‌లు, బీసీ సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇందుకోసం సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ, వివిధ జిల్లాల కాంగ్రెస్ నాయకులు మంగళవారం సాయంత్రానికి ఢిల్లీ చేరుకున్నారు. ధర్నా ప్రాంతాన్ని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం రాత్రి పరిశీలించారు. ధర్నాకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీతోపాటు ఇండియా కూటమిలోని సమాజ్‌వాదీ పార్టీ, డీఎంకే, వామపక్షాలు, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (ఎస్పీ) తదితర పార్టీల నాయకులు హాజరై తమ సంఘీభావం తెలపనున్నారు. కాగా, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుస్తామని కాంగ్రెస్ ఎంపీల ఫోరం రాష్ట్ర కన్వీనర్ మల్లు రవి తెలిపారు. ఇందుకోసం రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ కోరామన్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రపతి వద్ద రెండు బిల్లులు, ఒక ఆర్డినెన్స్ పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని ఆమోదించాల్సిందిగా కోరామని చెప్పారు.
బీసీ రిజర్వేషన్లపై వాయిదా తీర్మానాల తిరస్కృతి..
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలన్న విషయంపై బుధవారం లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీలు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాలను స్పీకర్ ఓం బిర్లా తిరస్కరించారు. దీంతో బుధ, గురువారాల్లో కూడా ఈ తీర్మానాలను ప్రవేశపెట్టి చర్చకు పట్టుబడతామని ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఇక బుధవారం జంతర్‌మంతర్ వద్ద నిర్వహిస్తున్న ధర్నాకు హాజరై మద్దతు తెలపాలని కోరుతూ ఇండియా కూటమికి చెందిన 200 మంది ఎంపీలకు కాంగ్రెస్ ఎంపీలు లేఖలు అందజేశారు. కాగా మంగళవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి.. ధర్నా ఏర్పాట్లపై పార్టీ నేతలతో సమీక్షించారు. అనంతరం తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా వివాహ విందుకు హాజరయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి
పార్లమెంట్ ఆవరణలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఆందోళన
కేసీఆర్ ఇచ్చిన టాస్క్‌ను పూర్తి చేశా.. గువ్వాల బాలరాజు షాకింగ్ కామెంట్స్
Read latest Telangana News And Telugu News