CM Revanth Reddy: కళాశాలలో ఉండగానే.. కొలువు ఖాయం!
ABN , Publish Date - Jan 18 , 2025 | 04:00 AM
కాలేజీలో చదువుతుండగానే విద్యార్థికి ఉద్యోగావకాశం సిద్ధంగా ఉండే విద్యా విధానాన్ని తెలంగాణలో అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.

తెలంగాణలో సింగపూర్ తరహా విద్యా విధానం
ఆ దేశ ఐటీఈతో స్కిల్స్ యూనివర్సిటీ ఒప్పందం
పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా సిలబస్
పట్టా పొందగానే ఉద్యోగం దక్కేలా శిక్షణ
విద్యా విధానంలో విప్లవాత్మకమన్న సీఎం రేవంత్
ఐటీఈ ప్రతినిధులతో సీఎం, మంత్రి శ్రీధర్‌బాబు భేటీ
సింగపూర్ విదేశాంగ శాఖ మంత్రితోనూ సమావేశం
హైదరాబాద్, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): కాలేజీలో చదువుతుండగానే విద్యార్థికి ఉద్యోగావకాశం సిద్ధంగా ఉండే విద్యా విధానాన్ని తెలంగాణలో అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. సింగపూర్‌లో ప్రభుత్వ అధీనంలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఐటీఈ)లో ఈ విధానం అమల్లో ఉందని, దీనిని రాష్ట్రంలోని సాంకేతిక విద్యాసంస్థల్లో అమలు చేస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేస్తున్న యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో తొలుత పూర్తిస్థాయిలో ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు, ఆ తర్వాత ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ లాంటి సాంకేతిక విద్యలో అమలు చేయాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
సింగపూర్ ఐటీఈ.. పదో తరగతి చదివే విద్యార్థుల స్థాయి నుంచి, చదువు పూర్తి చేసిన యువత, ఆసక్తి ఉన్న ఏ వయసు వారికైనా పరిశ్రమలు, ఐటీ సంస్థల సహకారంతో జాబ్ రెడీ శిక్షణనిస్తుంది. ‘స్కిల్స్ ఫర్ ఫ్యూచర్, స్కిల్స్ ఫర్ లైఫ్’ అనే నినాదంతో పనిచేస్తున్న ఐటీఈలో ప్రస్తుతం 28 వేల మంది శిక్షణ పొందుతున్నారు. మొత్తం 100 ఫుల్ టైమ్ కోర్సులకు ఆన్‌లైన్, క్యాంపస్ శిక్షణ లభిస్తుంది. దీనికితోడు ఐటీఈకి 5వేల పరిశ్రమలతో భాగస్వామ్యం ఉంది. పరిశ్రమలు తమకు అవసరమైన మానవ వనరులకు నేరుగా శిక్షణ ఇచ్చి.. ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి. ఈ విధానాన్ని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ఇప్పటికే అధ్యయనం చేసింది. అక్కడి విధానాన్ని రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా మార్పులు చేసి ఇక్కడ అమలు చేయాలని నిర్ణయించింది.
ఐటీఈతో స్కిల్స్ యూనివర్సిటీ ఒప్పందం
సింగపూర్ ఐటీఈ స్పూర్తితో తెలంగాణలో ఏర్పాటైన యుంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ.. తన శిక్షకులకు ఐటీఈతో శిక్షణ (ట్రెయినింగ్ ఫర్ ట్రెయినర్స్) ఇప్పించేలా పరస్పర అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. ప్రస్తుతం సింగపూర్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు శుక్రవారం ఐటీఈ ప్రతినిధులతో సమావేశమయ్యారు. వీరి సమక్షంలో ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ సుబ్బారావు, ఐటీఈ డిప్యూటీ డైరెక్టర్ ఫాబియన్ చియాంగ్ ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఈ ఒప్పందంతో.. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఉన్న సింగపూర్ ఐటీఈ తమ పాఠ్యాంశాలను (కరికులమ్) తెలంగాణ రాష్ట్రంతో పంచుకోనుంది.
ఇక్కడి పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు కావాల్సిన సహకారం అందించనుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. విద్యా విధానంలో ఇదో విప్లవాత్మకమైన నిర్ణయమన్నారు. చదువు పూర్తయ్యాక ఉద్యోగం వస్తుందా, రాదా.. అన్న ఆందోళనలో ఉండే యువతకు తాజా ఒప్పందం శుభవార్త అని వ్యాఖ్యానించారు. ఈ ఒప్పందంతో రాష్ట్రంలోని యువతకు ఉపాధి అవకాశాలు లభించడంతోపాటు పరిశ్రమలకు నైపుణ్యమున్న మానవ వనరులు లభిస్తాయని పేర్కొన్నారు. ఐటీఈ ప్రతినిధులతో భేటీ అనంతరం సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్‌తో సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్‌బాబు సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వానికి సింగపూర్ ఐటీఈ అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. పారిశ్రామిక రంగంలో సింగపూర్ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోందని సీఎం రేవంత్ కొనియాడారు.