CM Revanth Reddy: 3లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం
ABN , Publish Date - May 13 , 2025 | 04:39 AM
తెలంగాణ రాష్ట్రానికి 2023 డిసెంబరు నుంచి ఇప్పటివరకు కొత్తగా రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, లక్షకు పైగా ఉద్యోగాలు సృష్టించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
రాష్ట్రంలో లక్షకుపైగా ఉద్యోగాలు సృష్టించాం
సాఫ్ట్‌వేర్, లైఫ్ సైన్సెస్ రంగాలకు ప్రోత్సాహం
ఆర్థిక అభివృద్ధి కోసం పరిశ్రమలకు మద్దతు
నానక్‌రాంగూడలో సొనాటా ఏఐ కేంద్రాన్ని
ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
గవర్నర్‌తో సీఎం భేటీ.. రాష్ట్రంలో పరిస్థితులు, శాంతి భద్రతల గురించి వివరణ
హైదరాబాద్, మే 12 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రానికి 2023 డిసెంబరు నుంచి ఇప్పటివరకు కొత్తగా రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, లక్షకు పైగా ఉద్యోగాలు సృష్టించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. దేశీయంగా, అంతర్జాతీయంగా పెట్టుబడుల ఆకర్షణలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని చెప్పారు. మూడు దశాబ్దాలుగా హైదరాబాద్‌లోని బేగంపేట కేంద్రంగా ఉన్న సొనాటా సాఫ్ట్‌వేర్ కంపెనీ ఐటీ కారిడార్‌కు విస్తరించింది. నానక్‌రాంగూడలోని వంశీరాం సువర్ణదుర్గ టెక్ పార్క్‌లో 2లక్షల చదరపు అడుగుల్లో కొత్త కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. నూతన ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) కేంద్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సొనాటా సాఫ్ట్‌వేర్ ఏఐను ఉపయోగించి పర్యావరణ వ్యవస్థలను రూపొందించడం గర్వకారణమన్నారు. హైదరాబాద్ మహానగరం సాఫ్ట్‌వేర్, లైఫ్ సైన్సెస్ రంగాల్లో జీసీసీ (గ్లోబల్ కేపబిలిటీ సెంటర్)కి హబ్‌గా మారిందని పేర్కొన్నారు. అలాగే ఏఐ-రెడీ డేటా సెంటర్లు, తయారీ రంగాలకూ హైదరాబాద్ కేంద్రంగా మారిందని తెలిపారు. మైక్రోసాఫ్ట్, కాగ్నిజెంట్, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, విప్రో వంటి ఐటీ దిగ్గజ కంపెనీలు హైదరాబాద్‌లోని తమ క్యాంప్‌సలను విస్తరిస్తున్నాయన్నారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వం రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, సీనియర్ సిటిజన్ల సంక్షేమం కోసం పనిచేస్తూనే.. పరిశ్రమలకు మద్దతు ఇస్తూ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేస్తోందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లోని సముద్ర ఓడరేవుతో అనుసంధానించేందుకు ఇక్కడ డ్రైపోర్ట్ నిర్మిస్తున్నామన్నారు. ఫ్యూచర్ సిటీలో ఏఐ నగరం, యంగ్ ఇండియా స్కిల్స్, స్పోర్ట్స్ యూనివర్సిటీలు, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు పేరొన్నారు.
ప్రతీ కంపెనీ హైదరాబాద్‌కు బ్రాండ్ అంబాసిడర్
ప్రపంచంలోనే గొప్ప ఈవెంట్లలో ఒకటిగా పేరుపొందిన మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్‌లో జరుగుతుండడం మనందరికీ గర్వకారణమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మరిన్ని ప్రపంచ ఈవెంట్లను తెలంగాణలో నిర్వహించడానికి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని తెలిపారు. తెలంగాణ రైజింగ్ కార్యాచరణ ద్వారా ఆర్థికాభివృద్ధి, పెట్టుబడులు, ఉద్యోగాలు, మౌలిక సదుపాయాలు, సంక్షేమం సమతుల్యంగా సాగుతోందని, ఒక ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా ఎదగడంలో, హైదరాబాద్‌ను అత్యద్భుత నగరంగా మార్చడంలో అందరి సహకారం కోరుతున్నామని చెప్పారు. ఇక్కడి ప్రతీ కంపెనీ హైదరాబాద్‌కు బ్రాండ్ అంబాసడర్లుగా మారాలని, మన విజయాలను ప్రపంచానికి చూపాలని ఆయన అన్నారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఏఐ, మెషిన్ లెర్నింగ్ లాంటి ఎమర్జింగ్ టెక్నాలజీ్‌సలో ప్రపంచంలోనే తెలంగాణను లీడర్‌గా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. తెలంగాణను ఏఐ లీడర్‌గా మార్చేందుకు ఇప్పటికే కసరత్తు ప్రారంభించామని చెప్పారు.

ఏఐ సిటీకి శ్రీకారం చుట్టామని, ఈ సిటీలో భాగస్వామయేందుకు మైక్రోసాఫ్ట్ లాంటి టెక్ దిగ్గజ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయని పేర్కొన్నారు. ఏఐలో ప్రపంచ స్థాయి నిపుణులను తయారు చేసేందుకు జూన్ లేదా జూలై నెలలో ఏఐ యూనివర్సిటీని ప్రారంభించబోతున్నామన్నారు. పౌర సేవలను ఏఐతో అనుసంధానించి ప్రజల ముంగిట చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఆన్‌లైన్‌లోనూ నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి అనుబంధంగా డిజిటల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నామని ఆయన ప్రకటించారు. సొనాటా సాఫ్ట్‌వేర్ సీఈవో, ఎండీ సమీర్ ధిర్ మాట్లాడుతూ.. ఏఐ టెక్నాలజీకి కేంద్రంగా కొత్త కార్యాలయం నిలుస్తుందని తెలిపారు. నూతన కార్యాలయంలో దాదాపు ఐదు వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించడం తమ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో మండలి అధ్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గవర్నర్‌తో సీఎం రేవంత్ భేటీ
రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఉదయం భేటీ అయ్యారు. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు, దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో గవర్నర్‌తో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పరిస్థితులు, శాంతిభద్రతల గురించి గవర్నర్‌కు ముఖ్యమంత్రి వివరించారు. సుమారు 20 నిమిషాలపాటు జరిగిన ఈ సమావేశంలో జాతీయస్థాయి అంశాలు, రాష్ట్రంలో పరిస్థితులు, ఇతర కీలక అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. కాగా ప్రపంచ సుందరీమణులకు ఫలక్‌నుమా ప్యాలె్‌సలో ప్రభుత్వం తరపున ఇచ్చే విందులో గవర్నర్‌ను పాల్గొనాల్సిందిగా సీఎం ఆహ్వానించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు హాజరుకావాలని కూడా గవర్నర్‌ను రేవంత్ ఆహ్వానించారు. సీఎంతోపాటు మంత్రి శ్రీధర్ బాబు కూడా గవర్నర్‌తో సమావేశమయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు..
భూ భారతి చట్టం రైతులకు రక్షణ కవచం..
For More AP News and Telugu News