Share News

Good News: కౌలు రైతులకూ ‘అన్నదాత సుఖీభవ’ పథకం

ABN , Publish Date - May 05 , 2025 | 11:43 AM

ఏపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను నిలబెట్టుకుంటూ, అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు ఆర్థిక సహాయం అందించడానికి సిద్ధమైంది. ప్రతి రైతు కుటుంబానికి రూ. 20 వేలు ఆర్థిక సహాయం అందుతుంది. కౌలు రైతులకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. అర్హులైన రైతుల జాబితాను వ్యవసాయ శాఖ సిద్ధం చేస్తోంది. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ఈ పథకం రాష్ట్రంలోని రైతుల జీవితాల్లో వెలుగులు నింపనుంది.

Good News: కౌలు రైతులకూ ‘అన్నదాత సుఖీభవ’ పథకం
AP Government

అమరావతి: ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం (Kutami Govt.) ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది.. ఇప్పటికే పలు హామీలను అమలు చేస్తుండగా.. మే నెలలో మరో రెండు పథకాలను (2 Schemes) నెరవేర్చేందుకు సిద్ధమైంది. వీటిలో ముఖ్యమైనది అన్నదాత సుఖీభవ పథకం (Annadata Sukhibhava scheme).. ప్రభుత్వం ఒక్కో రైతుకు రూ.20 వేలు చొప్పున సాయం అందజేయనుంది. ఈ పథకాన్ని సొంత భూమి లేని కౌలు రైతులకు కూడా ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది. ఏపీ ప్రభుత్వం అందించే రూ.20 వేలను.. మూడు విడతల్లో ఇస్తారు. ఈ రూ. 20 వేలల్లో 'పీఎం కిసాన్' పథకం కింద ఇచ్చే రూ.6 వేలు కూడా కలుపుతారు. అటవీ భూములపై హక్కులు ఉన్నవారికి కూడా ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకానికి సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు రైతుల వివరాలను పరిశీలించి, అర్హుల జాబితాను తయారు చేస్తారు. ఈ నెల 20వ తేదీలోగా ఈ జాబితాను వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని ప్రభుత్వం సూచించింది. కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని ఈ నెలలోనే ప్రారంభిస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ పథకం అమలుకు సంబంధించి వ్యవసాయశాఖ తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది.


farmer.jpg

కాగా ఇప్పటికే మరణించిన లబ్ధిదారుల పేర్లను తొలగించడం, భూ రికార్డులకు అనుగుణంగా లబ్ధిదారుల నమోదు, రైతుల ఐడీ నంబర్లు, పెండింగ్‌లో ఉన్న ఆధార్‌, ఈకేవైసీ వివరాల సవరణ వంటి పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులకు సూచించింది. అటవీ హక్కుల చట్టం కింద హక్కులు పొందిన గిరిజనులకు, అలాగే ప్రత్యేకంగా గుర్తించబడిన అత్యంత వెనుకబడిన గిరిజన వర్గాలకు చెందిన అర్హుల ఎంపిక కోసం గిరిజన శాఖతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించింది.

అర్హులు కానివారు..

ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తులకు ఈ పథకం వర్తించదు. ప్రస్తుత, మాజీ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, శాసనసభ్యులు, మంత్రులు, శాసనమండలి సభ్యులు, మేయర్లు, జడ్పీ చైర్‌పర్సన్లు వంటి రాజ్యాంగ బద్ధ పదవులను నిర్వహిస్తున్నవారు, నిర్వహించినవారు అర్హులు కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల మంత్రిత్వ శాఖలు, శాఖల కార్యాలయాల్లో, ప్రభుత్వ రంగ సంస్థలలో, స్థానిక సంస్థలలో శాశ్వత ఉద్యోగంగా పని చేస్తున్నవారూ ఈ పథకం కింద సాయం పొందలేరు. అలాగే నెలకు రూ.10 వేలు లేదా అంతకన్నా ఎక్కువ పెన్షన్‌ తీసుకునే వారికి కూడా పథకం వర్తించదు. అయితే, మల్టీటాస్కింగ్‌ స్టాఫ్‌, క్లాస్‌-4, గ్రూప్‌-డి ఉద్యోగులకు మాత్రం మినహాయింపు ఉంది. వైద్యులు, ఇంజినీర్లు, న్యాయవాదులు, ఛార్టెడ్‌ అకౌంటెంట్లు, ఆర్కిటెక్టులు, అలాగే ఇతర నమోదిత వృత్తి నిపుణులకూ ఈ పథకం వర్తించదు.

Also Read: అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు..


atchannaidu.jpg

కాగా అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్‌ పథకం కింద రైతులకు ఏడాదికి రూ.20వేలు ఆర్థిక సాయం కింద ఇవ్వడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, మే నెలలోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఇది వరకే స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్‌ కింద ఏడాదికి రూ. 6వేలు ఆర్థిక సాయం చేస్తోందని, మరో 14 వేలు కలిపి రూ.20 వేల చొప్పున రైతులకు అందిస్తామన్నారు. 43 లక్షల మంది రైతులకు కేంద్రం పీఎం కిసాన్‌ సాయం ఇస్తోందని, రాష్ట్రంలో మరో 9 నుంచి 10 లక్షల మంది వరకు అర్హులైన రైతులు ఉంటారని వారందరికీ పథకాన్ని వర్తింపజేస్తామన్నారు. ఇంకా అర్హులైనవారు ఉంటే అందరికీ ఏటా 20 వేలు ఇస్తామన్నారు. కౌలు రైతులకు పథకం అమలుపై విధి విధానాలు ఖరారు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని 90 శాతం మంది కౌలు రైతులకు న్యాయం చేస్తామని చెప్పారు. రైతు భరోసా అందించే విషయంలో వైసీపీ ప్రభుత్వం రైతులను మోసగించిందని, కేంద్రం ఇచ్చే సాయంతో సంబంధం లేకుండా రాష్ట్రమే ఏటా రూ.12,500 ఇస్తామని చెప్పి, మాట తప్పిందని అచ్చెన్నాయుడు విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో వ్యవసాయ యంత్రాలు లేవు, భూసార పరీక్షలు లేవు, పంటల బీమా చెల్లింపులు లేవని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం వ్యవసాయానికి తాళం వేసిందని మంత్రి విమర్శించారు. ఊరు చివర్లో దిష్టిబొమ్మల్లా రైతు భరోసా కేంద్రాలు కట్టారని, వాటిని రైతు సేవా కేంద్రాలుగా మార్చి సేవలందిస్తున్నామని చెప్పారు. కంపెనీలకు రూ. 1,120 కోట్లు బకాయిలు పెడితే తామే చెల్లించామన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

భూ భారతి చట్టం రైతులకు రక్షణ కవచం..

హైదరాబాద్: జూబ్లీహిల్స్ లో బూమ్ బూమ్..

మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ ముస్తాబు..

For More AP News and Telugu News

Updated Date - May 05 , 2025 | 11:56 AM