Share News

CM Revanth Reddy: న్యాయమంటే శిక్షలే కాదు.. బాధితులకు భరోసా

ABN , Publish Date - Jul 06 , 2025 | 03:31 AM

న్యాయమంటే కేవలం శిక్షలు విధించడమే కాదు. బాధితుల జీవితానికి భరోసా కల్పించడం. లైంగిక దాడుల బాధిత చిన్నారులకు అవసరమైన రక్షణ, సమాజంలో తగిన గౌరవం కల్పించేలా చర్యలు తీసుకోవడమే కాదు..

CM Revanth Reddy: న్యాయమంటే శిక్షలే కాదు.. బాధితులకు భరోసా

లైంగిక దాడుల బాధిత పిల్లలకు న్యాయం, గౌరవంతోపాటు బాల్యాన్నీ తిరిగివ్వాలి

  • ఆ చిన్నారులకు అన్ని దశల్లో సర్కారు అండగా ఉంటుంది

  • చైల్డ్‌ పోర్నోగ్రఫీ విషయంలో అత్యంత కఠినంగా ఉండండి

  • సోషల్‌ మీడియా దోషుల్ని వదలొద్దు

  • లైంగిక దాడుల బాధిత చిన్నారుల రక్షణ, భద్రత సదస్సులో సీఎం

  • బాలల భద్రత జాతీయ బాధ్యత

  • సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్‌ సూర్యకాంత్‌

  • పోక్సో నిందితుల్లో 98ు మంది కుటుంబ సభ్యులు, బంధువులు, ఇరుగుపొరుగే: జస్టిస్‌ సుజోయ్‌ పాల్‌

చిన్నారులపై జరుగుతున్న లైంగిక దాడుల పట్ల అశ్రద్ధ, వ్యవస్థాగత వైఫల్యం నేరపరమైన లోపం మాత్రమే కాదు.. అది బాల్యానికి చేస్తున్న తీవ్రమైన ద్రోహం. తెలంగాణలోని భరోసా కేంద్రాలు చట్టపరంగానే కాకుండా వైద్య, మానసిక సంరక్షణను సమగ్రంగా అందించే జాతీయ బాలల రక్షణ ఫ్రేమ్‌ వర్క్‌ను సాకారం చేస్తున్నాయి.

- సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌

హైదరాబాద్‌, జూలై 5 (ఆంధ్రజ్యోతి): ‘‘న్యాయమంటే కేవలం శిక్షలు విధించడమే కాదు. బాధితుల జీవితానికి భరోసా కల్పించడం. లైంగిక దాడుల బాధిత చిన్నారులకు అవసరమైన రక్షణ, సమాజంలో తగిన గౌరవం కల్పించేలా చర్యలు తీసుకోవడమే కాదు.. వారు తమ బాల్యాన్ని తిరిగి పొందడానికి అందరూ ప్రయత్నించాలి’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సూచించారు. పిల్లలు, మహిళల రక్షణకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందన్నారు. సోషల్‌ మీడియా విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని, దానిని దుర్వినియోగం చేస్తున్న వారి పట్ల ఎలాంటి కరుణ చూపాల్సిన అవసరం లేదని, దోషుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. లైంగిక దాడులకు గురైన చిన్నారుల రక్షణ, భద్రత విషయమై శనివారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థలో సదస్సు జరిగింది. సుప్రీం కోర్టు న్యాయమూర్తి, నల్సార్‌ అధ్యక్షుడు జస్టిస్‌ సూర్యకాంత్‌ ప్రారంభించిన ఈ సదస్సుకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లైంగిక దాడుల బాధితులైన చిన్నారులకు అన్ని దశల్లో అండగా ఉంటామని, వారి బాల్యాన్ని మళ్లీ వారికి అందించడానికి అన్ని శాఖల సిబ్బంది మానవతా దృక్పథంతో పని చేయాలని కోరారు.

1 copy.jpg


ఇలాంటి విషయాల్లో అందరం కలిసికట్టుగా ముందుకు సాగుదామని న్యాయమూర్తులు, పోలీసు అధికారులు, బాలల సంక్షేమ కమిటీలు, ఇతర భాగస్వామ్య సభ్యులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ‘‘న్యాయం అనేది కేవలం కోర్టుల్లోనే కాకుండా ప్రతి దశలోనూ చిన్నారులకు అందాలి. పోలీసు స్టేషన్‌ నుంచి బాలల సంక్షేమ కేంద్రాల వరకు అన్నిచోట్ల పిల్లలకు న్యాయం దక్కాలి. రక్షణ కల్పించాలి. బాలికలు, మహిళల రక్షణ కోసం ఇప్పటికే తెలంగాణలో భరోసా ప్రాజెక్టు అమల్లో ఉంది. దీనికి అనుసంధానంగా 29 కేంద్రాలు పనిచేస్తున్నాయి. వీటి ద్వారా పోలీసు సహాయమే కాకుండా న్యాయ, వైద్య, కౌన్సెలింగ్‌ సేవలూ అందిస్తున్నాం’’ అని వివరించారు. హైదరాబాద్‌ కేంద్రంగా పని చేస్తోన్న భరోసా కేంద్రం చైల్డ్‌ ఫ్రెండ్లీ కోర్టులను ప్రారంభించిందని, ఈ సేవలను అందిస్తున్న మొద టి రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోందని తెలిపారు. లైంగిక దాడులకు సంబంధించిన కేసులను వేగవంతంగా పరిష్కరించడమే కాకుండా ఆయా చిన్నారులకు సంపూర్ణ రక్షణ కల్పించి, వారిలో విశ్వాసాన్ని పెంపొందించి మళ్లీ సాధారణ జీవితానికి అలవాటు పడేలా ఈ కేంద్రాలు అన్ని రకాల చర్యలూ తీసుకుంటున్నాయని తెలిపారు. ‘‘పోక్సో, జువైనల్‌ చట్టాలు ప్రగతిశీల సాధనాలుగా పని చేస్తున్నాయి. అయితే, ఆచరణలో కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. బాధితులకు ఎలాంటి హాని కలిగించకుండా, వారి భవిష్యత్తుకు, రక్షణకు సంపూర్ణ సహాయకారిగా ఈ చట్టాలు ఉండాలి’’ అని సూచించారు. చైల్డ్‌ పోర్నోగ్రఫీ కేసుల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించాలని పోలీసు అధికారులకు నిర్దేశించారు. ‘వాయిస్‌ ఫర్‌ ది వాయి్‌సలెస్‌’ అనే థీమ్‌తో తమ బాధను చెప్పుకోలేని వారికి రక్షణ కల్పించేందుకు ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి రాష్ట్రస్థాయి సమావేశం అవసరమని అంటూనే.. ఎంతో కీలకమైన అంశంపై ఈ సదస్సు నిర్వహించిన తెలంగాణ పోలీసులకు, ఇతర నిర్వాహకులకు ఆయన అభినందనలు తెలిపారు.


పోక్సో కేసుల్లో 90 శాతం శిక్షలు: సీతక్క

పోక్సో చట్టానికి సంబంధించి 90 శాతం కేసుల్లో నేరగాళ్లకు శిక్షలు వేయించేలా ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. చిన్నారులు, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు చాలావరకు గంజాయి లాంటి మత్తుమందులు కారణమవుతున్నట్లు తమ విచారణలో వెల్లడైందని, అందుకే తెలంగాణను ‘డ్రగ్స్‌ ఫ్రీ రాష్ట్రం’గా మార్చడానికి సీఎం రేవంత్‌ రెడ్డి దృఢ నిశ్చయంతో ఉన్నారని ఆమె వివరించారు. మానవతా దృక్పథంతో వ్యవహరించాలని కోరారు. తెలంగాణ మహిళా భద్రతా విభాగం, మహిళా శిశు సంక్షేమశాఖ, రాష్ట్ర న్యాయ సేవా సాధికార సంస్థ సంయుక్తంగా ఈ సదస్సును ఏర్పాటు చేశాయి. సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌, తెలంగాణ హైకోర్టు తాత్కాలిక చీఫ్‌ జస్టిస్‌ సుజోయ్‌ పాల్‌, డీజీపీ జితేందర్‌, మహిళా భద్రతా విభాగం అదనపు డీజీపీ చారు సిన్హా, యునిసెఫ్‌ భారత ప్ర తినిధి క్యాధినా తదితరులు సదస్సులో పాల్గొన్నారు.


బాలల భద్రత జాతీయ బాధ్యత: జస్టిస్‌ సూర్యకాంత్‌

బాలల భద్రత కేవలం చట్టపరమైన బాధ్యత మాత్రమే కాదని, నైతిక, జాతీయ బాధ్యత అని సుప్రీం కోర్టు న్యాయమూర్తి, నల్సార్‌ అధ్యక్షుడు జస్టిస్‌ సూర్యకాంత్‌ అన్నారు. సదస్సులో ఆయన మాట్లాడుతూ.. చిన్నారులపై జరుగుతున్న లైంగిక దాడులకు సంబంధించి అశ్రద్ధ, వ్యవస్థాగత వైఫ ల్యం కేవలం నేరపరమైన లోపం మాత్రమే కాదని, బాల్యానికి చేస్తున్న తీవ్ర ద్రోహమని వ్యాఖ్యానించారు. తెలంగాణలోని భరోసా కేంద్రాలు చట్టపరంగానే కాకుండా వైద్య, మానసిక సంరక్షణను సమగ్రంగా అందించే జాతీయ బాలల రక్షణ ఫ్రేమ్‌ వర్క్‌ను సాకారం చేస్తున్నాయని ప్రశంసించారు. పోక్సో కేసుల సంఖ్య పెరుగుతుండడంపై హైకోర్టు తాత్కాలిక చీఫ్‌ జస్టిస్‌ సుజోయ్‌ పాల్‌ ఆందోళన వ్యక్తం చేశారు. పోక్సో కేసు నిందితుల్లో 98ు కుటుంబ సభ్యులు, బంధువులు లేదా ఇరుగుపొరుగు ఉంటున్నారని తెలిపారు. ఇలాంటి కేసులను చూస్తున్న అన్ని శాఖల సిబ్బంది తమ వద్దకు వచ్చే బాధితుల విషయంలో సానుభూతి, సున్నితత్వంతో వ్యవహరించాలని సూచించారు.


ఇవి కూడా చదవండి

తిరుపతికి వెళ్లేందుకు గూగుల్‌ను నమ్మారు.. తీరా చూస్తే

మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ముందుకు: డిప్యూటీ సీఎం భట్టి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 06 , 2025 | 05:18 AM