Bio Design Innovation: మన మేధస్సు.. మన కోసం!
ABN , Publish Date - Aug 25 , 2025 | 04:04 AM
మన మేధావులు ఎన్నో ఏళ్లుగా ఇతర దేశాల సమస్యలను పరిష్కరిస్తూ వస్తున్నారు. ఇప్పుడు మన సొంత మనుషులకు సహాయపడేలా మన మేధస్సును వినియోగించాల్సిన సమయం ఆసన్నమైంది’’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
సొంత మనుషులకు సాయపడేలా వాడుకోవాలి
పరిశోధనలకు అవసరమైన చారిత్రక డాటా అందిస్తాం
విద్యాసంస్థలతో పరిశోధకులను అనుసంధానం చేస్తాం
రాష్ట్రం నుంచి ఆవిష్కరణలకు ఇది సరైన సమయం
ఆసియా-పసిఫిక్ బయో డిజైన్ సదస్సులో రేవంత్
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): ‘‘మన మేధావులు ఎన్నో ఏళ్లుగా ఇతర దేశాల సమస్యలను పరిష్కరిస్తూ వస్తున్నారు. ఇప్పుడు మన సొంత మనుషులకు సహాయపడేలా మన మేధస్సును వినియోగించాల్సిన సమయం ఆసన్నమైంది’’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. వారికి అవసరమైన పూర్తి మద్దతును తమ ప్రభుత్వం అందిస్తుందన్నారు. డాటా గోప్యత చట్టాలకు లోబడి పరిశోధనలకు అవసరమైన చారిత్రక డాటాను కూడా పంచుకుంటామని తెలిపారు. విద్యాసంస్థలతో పరిశోధకులను అనుసంధానించడంతోపాటు పరిశోధన, ఆవిష్కరణలు, స్కిల్ వర్సిటీలతో కలిపే ప్రయత్నం చేస్తామన్నారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో జరుగుతున్న ఆసియా-ఫసిఫిక్ బయో డిజైన్ ఇన్నొవేషన్-2025 సదస్సును ప్రారంభించడానికి సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్లు, పరిశోధకులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. బయో డిజైన్‌ను ఉపయోగించి వైద్య ఉత్పత్తులలో ఆవిష్కరణలపై ఇక్కడ చర్చించడం సంతోషంగా ఉందన్నారు. దేవుడు గొప్ప డిజైనర్ అని, ప్రకృతి అత్యుత్తమ టీచర్ అని, కానీ.. మనం మంచి విద్యార్థులుగా ఉంటున్నామా అనేదే ప్రశ్న అని అన్నారు. ప్రకృతిని పరిశీలించడంతోపాటు దాని నుంచి నేర్చుకుంటే వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాదన్నారు. బయో డిజైన్‌కు సంబంధించి కృత్రిమ మేధస్సు దీనికి చక్కటి ఉదాహరణగా పేర్కొన్నారు. మనుషులు కృత్రిమ మెదడును రూపొందించడానికి మానవ మెదడు ఉపయోగిస్తున్నారని గుర్తుచేశారు. తమ ప్రభుత్వం తెలంగాణ రైజింగ్-2047 లక్ష్యంతో ముందుకు సాగుతోందన్నారు. భారతదేశపు లైఫ్ సైన్సెస్, మెడికల్ డివైజెస్, టెక్నాలజీ రంగాలకు కేంద్రంగా తెలంగాణ వెలుగొందుతోందని, సాంకేతిక రంగాన్ని అత్యంత కీలకంగా తాము భావిస్తున్నామని వివరించారు. ఫార్మా, ఐటీ, బయోటెక్, లైఫ్‌సైన్సెస్, మెడికల్ టెక్నాలజీలకు నిలయంగా హైదరాబాద్ వెలుగొందుతోందని, ఈ రంగాల్లో తయారీ నుంచి ఆవిష్కరణల వరకూ మనం ఎదిగామని అన్నారు.
సుల్తాన్‌పూర్‌లో మెడికల్ డివైజెస్ పార్క్..
దేశంలో అతి పెద్ద మెడికల్ డివైజెస్ పార్క్‌ను తాము సుల్తాన్‌పూర్‌లో ఏర్పాటు చేశామని సీఎం రేవంత్ తెలిపారు. అక్కడ పరిశోధన, ప్రొటోటైపింగ్, టెస్టింగ్, తయారీకి సంబంధించి అత్యుత్తమ మౌలిక సదుపాయాలున్నాయని అన్నారు. దాదాపు 60 కంపెనీలు అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని చెప్పారు. డయాగ్నస్టిక్ డివైజెస్, ఇమేజింగ్ టెక్నాలజీస్, ఇంప్లాంట్స్, సర్జికల్ ఎక్వి్‌పమెంట్స్, డిజిటల్ హెల్త్ సొల్యూషన్స్ విభాగాల్లో పెట్టుబడులు అధికంగా వస్తున్నాయని వివరించారు. అంతర్జాతీయ కంపెనీలతోపాటు స్థానిక స్టార్ట్‌పలు, ఎంఎ్‌సఎంఈలు ఈ రంగాలలో చక్కగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని ప్రశంసించారు. హైదరాబాద్‌ను ఇవి వినూత్న స్థానంలో నిలుపుతున్నాయన్నారు. హైదరాబాద్‌లో నైపుణ్యంతో కూడిన మానవ వనరులున్నాయని, చక్కటి విద్యాసంస్థలు, నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలు, విద్య-పరిశ్రమ భాగస్వామ్యాలు దీనికి తోడ్పడుతున్నాయని పేర్కొన్నారు. సామాన్య భారతీయుల సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో ఈ తరహా సదస్సులను ఏర్పాటు చేయడంతోపాటు పరిశోధనలు చేస్తున్న ఏఐజీని, డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డిని అభినందిస్తున్నట్లు తెలిపారు.
బయో డిజైన్‌కు కేంద్రంగా హైదరాబాద్..
దేశంలో బయో డిజైన్‌కు కేంద్రంగా హైదరాబాద్ నిలవనుందని ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అల్పాదాయ వర్గాలకు సైతం మెరుగైన ఆరోగ్య సేవలందించే అవకాశం బయో డిజైన్ ఉత్పత్తులతో కలుగుతుందన్నారు. హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ జీవీ రావు.. భారత్ బయోడిజైన్ విజన్ డాక్యుమెంట్ గురించి వివరించారు. ఏఐ మెడ్‌టెక్ అలయెన్స్‌తో కలిసి ఏఐజీ హాస్పిటల్స్ ‘ఇన్నోవేటింగ్ ఫర్ భారత్ బయోడిజైన్ బ్లూ ప్రింట్’ పేరిట ఈ డాక్యుమెంట్‌ను రూపొందించిందన్నారు. కాగా, బయో డిజైన్ పరంగా అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన 10 మంది నిపుణులు హైదరాబాద్‌కు వచ్చారని ఏఐఎం ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ రాకేశ్ కల్పల చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
లైఫ్ సైన్సెస్, మెడికల్ టెక్నాలజీ విభాగంలో తెలంగాణ హబ్‌గా ఎదిగింది: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణలో మరో భారీ అగ్ని ప్రమాదం..
For More Telangana News And Telugu News