CM Revanth Reddy: బ్రిటిష్ వారి కంటే బీజేపీ నేతలు ప్రమాదకారులు
ABN , Publish Date - Apr 10 , 2025 | 04:14 AM
బీజేపీ నేతలు.. బ్రిటిష్ వారికంటే ప్రమాదకారులని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఆనాడు అందరూ ఒక్కటై బ్రిటిష్ వారిని దేశం నుంచి తరిమికొట్టినట్లుగానే.. ఇప్పుడు రాహుల్‌గాంధీ నాయకత్వంలో అందరం ఒక్కటై దేశవ్యాప్తంగా బీజేపీని ఓడగొడదామని పిలుపునిచ్చారు.

వారిని తరిమికొట్టినట్లుగా దేశంలో బీజేపీని ఓడిద్దాం
తెలంగాణలో ఆ పార్టీని అడుగు పెట్టనివ్వం
గాడ్సే ఆలోచనల వ్యాప్తికి ప్రయత్నిస్తున్న మోదీ
ఆయనపై వ్యతిరేకంగా రాహుల్ ఆధ్వర్యంలో పోరాడదాం
పటేల్‌తో తెలంగాణకు స్వాతంత్య్రం.. సోనియాతో రాష్ట్రం
తెలంగాణలో కులగణన చేసి చూపించాం
25 లక్షల మందికి 21 వేల కోట్ల రుణమాఫీ చేశాం
ఏఐసీసీ విస్తృత సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్
14న 423 మందికి నియామక పత్రాలు అందించనున్న సీఎం.. నీటిపారుదల శాఖలో భర్తీ
హైదరాబాద్/న్యూఢిల్లీ, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): బీజేపీ నేతలు.. బ్రిటిష్ వారికంటే ప్రమాదకారులని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఆనాడు అందరూ ఒక్కటై బ్రిటిష్ వారిని దేశం నుంచి తరిమికొట్టినట్లుగానే.. ఇప్పుడు రాహుల్‌గాంధీ నాయకత్వంలో అందరం ఒక్కటై దేశవ్యాప్తంగా బీజేపీని ఓడగొడదామని పిలుపునిచ్చారు. మోదీ పరివారంపై పోరాటానికి అందరమూ సిద్ధంగా ఉందామన్నారు. బీజేపీని ఓడించే బాధ్యతను దేశ వ్యాప్తంగా ఉన్న గాంధేయవాదులు, కాంగ్రెస్ కార్యకర్తలు తీసుకోవాలని కోరారు. తాము తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని అడుగు పెట్టనివ్వబోమని ప్రకటించారు. బుధవారం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఏఐసీసీ విస్తృత సమావేశంలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జన్మించిన ఈ గుజరాత్ గడ్డపై నుంచి చెబుతున్నా. తెలంగాణ గడ్డపై బీజేపీని అడుగు పెట్టనివ్వం. వారిని అడ్డుకుంటాం. అందుకు మేం ఇక్కడి నుంచి ఆశను, ఆదేశాన్ని తీసుకొని వెళుతున్నాం. బీజేపీని ఓడించే బాధ్యతను ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, గాంధీ వారసులు ఇక్కడి నుంచి తీసుకెళ్లాలి. దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చినా.. తెలంగాణకు రాలేదు. జవహర్‌లాల్ నెహ్రూ నేతృత్వంలో సర్దార్ వల్లభ్‌బాయ్ పటేల్ మాకు నిజాం పాలన నుంచి స్వాతంత్ర్యాన్ని ప్రసాదించారన్నారు. గుజరాత్ ప్రజలకు పటేల్‌తో వారసత్వ బంధం ఉండొచ్చు. కానీ, తెలంగాణ ప్రజలకు ఆయనతో హృదయ బంధం ఉంది. తెలంగాణ ప్రజలకు పటేల్ స్వాతంత్య్రం ప్రసాదిస్తే.. సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్నే ఇచ్చారు’’ అని రేవంత్ అన్నారు. సోనియాగాంధీని ‘తెలంగాణ మాత’ అని సంబోధించారు.
గాడ్సే ఆలోచనల వ్యాప్తికి మోదీ ప్రయత్నం...
దేశంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా గాంధీజీ 30 ఏళ్లపాటు అనేక పోరాటాలు నిర్వహించినా.. వారు ఏనాడూ ఆయనపై లాఠీ ప్రయోగం చేయలేదని రేవంత్‌రెడ్డి తెలిపారు. కానీ, దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఆరు నెలలు తిరగకుండానే గాడ్సే, అతని వారసులు గాంధీజీపై తూటాను ప్రయోగించి హత్య చేశారన్నారు. నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశంలో విభజన రాజకీయాలు ఎక్కువయ్యాయన్నారు. రాహుల్‌గాంధీ నేతృత్వంలో గాంధీ ఆలోచనా విధానానికి అనుగుణంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంటే.. మోదీ మాత్రం గాడ్సే ఆలోచనా విధానాన్ని దేశంలో వ్యాప్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రైతు వ్యతిరేక నల్లచట్టాలు, మణిపూర్ అల్లర్లు మోదీ గ్యారెంటీలు అని, నల్లచట్టాలకు వ్యతిరేకంగా రైతులు 15 నెలలపాటు ఆందోళనలు చేసినా.. మోదీ కనికరించలేదని విమర్శించారు. మణిపూర్‌లో మంటలు రాజేసి.. దేశ మూలవాసుల జీవన హక్కును కాలరాసే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ఏటా 2కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చి 11 ఏళ్లు గడిచిందని, ఆ లెక్కన ఈ పాటికే 20 కోట్లకు పైగా ఉద్యోగాలు కల్పించి ఉండాలని అన్నారు. కానీ, మోదీ, అమిత్‌షాలకు ఉద్యోగాలు వచ్చాయే తప్ప.. యువతకు 2 కోట్ల ఉద్యోగాలు మాత్రం రాలేదన్నారు.
తెలంగాణలో రాహుల్ హామీలను నెరవేర్చాం..
కన్యాకుమారి నుంచి కశ్మీరు వరకు 4వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన రాహుల్‌గాంధీ.. జాతీయ జనగణన, యువతకు ఉద్యోగాల కల్పన, మహిళా సంక్షేమంపై వాగ్దానాలు చేశారని రేవంత్ అన్నారు. తెలంగాణలో పాదయాత్ర సందర్భంగా.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు రూ.2 లక్షల మేరకు రుణాలను మాఫీ చేస్తామని మాట ఇచ్చారని గుర్తు చేశారు. రాహుల్‌గాంధీ వాగ్దానం మేరకు రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే 25.50 లక్షల మంది రైతులకు రూ.21 వేల కోట్ల రుణాలను మాఫీ చేశామని తెలిపారు. కులగణన కూడా చేసి చూపించామన్నారు. తెలంగాణలో నిర్వహించిన కులగణనను రాహుల్‌గాంధీ పార్లమెంటులో లేవనెత్తుతారన్న భయంతోనే ఆయనకు మోదీ మైక్ ఇవ్వలేదని ఆరోపించారు. కాగా, దేశ వ్యాప్తంగా ఇటీవలి కాలంలో మరణించిన కాంగ్రెస్ నేతలకు ఏఐసీసీ విస్తృత సమావేశం నివాళులర్పించింది. ఇందులో భాగంగా తెలంగాణ నుంచి పీసీసీ మాజీ అధ్యక్షులు డి.శ్రీనివాస్, నర్సారెడ్డి, ఏఐసీసీ సభ్యులుగా పని చేసిన ఇంద్రసేనారెడ్డి, టి.నాగయ్య మృతికి సంతాపం ప్రకటించి.. నివాళులర్పించింది. రెండు రోజులపాటు జరిగిన సీడబ్ల్యూసీ, ఏఐసీసీ విస్తృత సమావేశంలో తెలంగాణ నుంచి సీఎం రేవంత్‌రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, సీడబ్ల్యూసీ ఆహ్వానితుడు వంశీచంద్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, ఏఐసీసీ సభ్యులు తదితరులు మొత్తం కలిసి 41 మంది పాల్గొన్నారు.
తమిళిసై తండ్రి మృతికి సీఎం రేవంత్ సంతాపం
తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై తండ్రి.. తమిళనాడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, సాహితీవేత్త కుమారి అనంతన్(హరికృష్ణన్ నాడార్ అనంతకృష్ణన్) మరణం పట్ల సీఎం రేవంత్ దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. మహాత్ముడి సిద్ధాంతాలను పుణికి పుచ్చుకున్న దేశ భక్తుడు, అయిన అనంతన్ మరణం బాధాకరమన్నారు. తమిళసై, వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మడి కట్టుకోవడం అంటే ఏమిటో తెలుసా
ఉపవాసం ఉంటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..
గుడికి వెళ్తున్నారా.. ఇవి పాటించండి..
For More AP News and Telugu News