Share News

CM Revanth Reddy: ఊరు మార్చి.. పేరు మార్చి..

ABN , Publish Date - Aug 05 , 2025 | 03:34 AM

ఊరు మార్చి.. పేరు మార్చి.. అంచనాలు మార్చి.. అవినీతి, అక్రమాల పునాదులతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని, ఈ విషయాను జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ తన నివేదికలో స్పష్టంగా వివరించిందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

CM Revanth Reddy: ఊరు మార్చి.. పేరు మార్చి..

అవినీతి పునాదులతో కాళేశ్వరం నిర్మాణం.. అందుకే కూలిందని నివేదిక స్పష్టం చేసింది

  • ఘోష్‌ కమిషన్‌ నివేదికను క్యాబినెట్‌ ఆమోదించింది

  • త్వరలో అసెంబ్లీలో.. ఆ తర్వాత తుది నిర్ణయం

  • మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు కారణాలను వివరిస్తూ కేసీఆర్‌ హయాంలోనే ఎన్డీఎ్‌సఏ నివేదిక ఇచ్చింది

  • రాజకీయ కక్ష, వ్యక్తిగత ద్వేషంతో నిర్ణయం తీసుకోం

  • క్యాబినెట్‌ సమావేశం తర్వాత సీఎం రేవంత్‌ రెడ్డి వెల్లడి

  • నిర్మాణ సంస్థలకు లబ్ధి చేకూర్చడానికే నామినేషన్‌ పద్ధతి

  • గోదావరిలో జలకళ ప్రచారం కోసమే నీటి నిల్వ: ఉత్తమ్‌

  • అసెంబ్లీని తప్పుదోవ పట్టించిన కేసీఆర్‌: భట్టి

హైదరాబాద్‌, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): ఊరు మార్చి.. పేరు మార్చి.. అంచనాలు మార్చి.. అవినీతి, అక్రమాల పునాదులతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని, ఈ విషయాను జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ తన నివేదికలో స్పష్టంగా వివరించిందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇందులో ప్రజా ప్రతినిధులు, ఐఏఎస్‌ అధికారులు, ఇంజనీరింగ్‌ నిపుణులు, నిర్మాణ సంస్థల గురించి చాలా విశ్లేషణాత్మకంగా పేర్కొందని తెలిపారు. ఈ నివేదికను క్యాబినెట్‌లో ఆమోదించామని, రాబోయే రోజుల్లో శాసన సభలో ప్రవేశపెట్టి, అన్ని రాజకీయ పార్టీల నాయకులకు వారి అభిప్రాయాన్ని చెప్పే అవకాశాన్ని కల్పిస్తామని చెప్పారు. ప్రతిపక్ష నేత కేసీఆర్‌, ఆనాటి సాగునీటి పారుదల శాఖ మంత్రులు, అప్పటి ఇతర మంత్రులంతా వాళ్ల అభిప్రాయాలు చెప్పవచ్చని స్పష్టం చేశారు. శాసన సభలో, మండలిలో ప్రజా ప్రతినిధులు ఒక అవగాహన తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ ఇచ్చిన నివేదికను త్వరలోనే అసెంబ్లీలో ప్రవేశపెట్టి, అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. ఆ తర్వాత.. సిఫారసుల అమలుకు ప్రభుత్వం ఒక కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళుతుందన్నారు. ఇందులో ఎలాంటి శషభిషలు, రాజకీయ కక్షలకు తావు లేదని, పూర్తి ఇండిపెండెంట్‌, జ్యుడీషియల్‌ కమిషన్‌ చేసిన సూచనలను ప్రభుత్వం తప్పకుండా పాటిస్తుందని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన సోమవారం సచివాలయంలో క్యాబినెట్‌ సమావేశం జరిగింది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన సమావేశం రెండు గంటలకుపైగా కొనసాగింది. సమావేశంలో ప్రధానంగా జస్టిస్‌ పీసీ ఘోష్‌ నివేదిక, ఐఏఎస్‌ అధికారుల కమిటీ ఇచ్చిన సంక్షిప్త నివేదికపై చర్చించారు. ఘోష్‌ నివేదికలోని అంశాలను మంత్రులందరికీ వివరించారు. అనంతరం, జస్టిస్‌ పీసీ ఘోష్‌ నివేదికను క్యాబినెట్‌ ఆమోదించింది. అనంతరం మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క తదితరులతో కలిసి సీఎం రేవంత్‌ రెడ్డి వివరాలను విలేకరులకు వెల్లడించారు.


కేసీఆర్‌ హయాంలోనే ఎన్డీఎ్‌సఏ నివేదిక

ఉమ్మడి రాష్ట్ర సీఎంగా వైఎస్‌ ఉన్నప్పుడు తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును రూపొందించారని, తెలంగాణ ఏర్పాటైన తర్వాత ప్రాజెక్టుల రీ డిజైనింగ్‌ పేరిట అప్పటి సీఎం కేసీఆర్‌ తుమ్మిడిహెట్టి నుంచి మార్చి మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం వద్ద బ్యారేజీలను నిర్మించాలని నిర్ణయించారని సీఎం రేవంత్‌ రెడ్డి వివరించారు. 2015-16లో మొదలు పెట్టిన పనులను 2018-19లో పూర్తి చేశారని, కానీ, మూడేళ్లలోపే అంటే 2023 అక్టోబర్‌లో మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందని, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు పగుళ్లు వచ్చాయని వివరించారు. ప్రాజెక్టులు ప్రమాదంలో పడ్డాయని అప్పట్లో సాంకేతిక నిపుణులు, ఎన్‌డీఎ్‌సఏ సహా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు గుర్తించి, విచారణ జరిపాయని గుర్తు చేశారు. ప్రణాళిక, నిర్మాణం, నిర్వహణలో లోపాలున్నాయని తేల్చారని, దీనిపై పూర్తి స్థాయి విచారణ జరపాలంటూ కేసీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడే ఎన్‌డీఎ్‌సఏ వంటి సంస్థలు నివేదికలు ఇచ్చాయని వెల్లడించారు. అప్పట్లోనే తాము ప్రాజెక్టులో అవినీతి, అశ్రిత పక్షపాతం, నిర్లక్ష్యం ఉన్నాయని, తాము అధికారంలోకి రాగానే విచారణ జరిపిస్తామని చెప్పామని, అన్నట్లే అధికారంలోకి వచ్చిన తర్వాత జస్టిస్‌ పీసీ ఘోష్‌తో న్యాయ కమిషన్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. జస్టిస్‌ పీసీ ఘోష్‌ దేశంలోనే గొప్ప న్యాయ నిపుణులని, అలాంటి వ్యక్తినే కమిషన్‌కు చైర్‌పర్సన్‌గా నియమించామని తెలిపారు. దాదాపు 16 నెలలపాటు విచారణ జరిపి.. ఆనాటి ముఖ్యమంత్రి, మంత్రులు, ఐఏఎస్‌, ఇంజనీరింగ్‌ అధికారులు, నిర్మాణ సంస్థలు, ప్రజా సంఘాలు, పాత్రికేయులను విచారించిందని గుర్తు చేశారు. కేసీఆర్‌, హరీశ్‌ రావు, ఈటల రాజేందర్‌లకు నోటీసులు ఇచ్చి, ప్రశ్నించిందని, వారి వివరణలకు సమయం కూడా ఇచ్చిందని వివరించారు. వారిచ్చిన వివరణలన్నింటినీ కమిషన్‌ విశ్లేషించి 665 పేజీలతో సుదీర్ఘ నివేదికను ప్రభుత్వానికి అందజేసిందని తెలిపారు.


నివేదికను బీఆర్‌ఎస్‌ తప్పుపట్టడం సహజమే

కాళేశ్వరం నివేదికను బీఆర్‌ఎస్‌ పార్టీ తప్పు పట్టడం సహజమేనని ఒక ప్రశ్నకు సమాధానంగా సీఎం రేవంత్‌ రెడ్డి చెప్పారు. నివేదిక వారికి అనుకూలంగా ఉంటే ఒకలా.. లేకపోతే మరోలా మాట్లాడటం వారికి అలవాటేనని అన్నారు. కమిషన్‌ నివేదికలో ఎలాంటి రాజకీయ జోక్యం లేదని, ఇది ఇండిపెండెంట్‌, జ్యుడీషియల్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదిక అని తెలిపారు. రాజకీయ కక్షలు, వ్యక్తిగత ద్వేషంతో నిర్ణయాలు తీసుకోవడం వంటివాటికి ఏమాత్రం తావివ్వకుండా ప్రభుత్వం పారదర్శకంగా పని చేయాలనుకుంటోందని తెలిపారు.

అసెంబ్లీని తప్పుదోవ పట్టించిన కేసీఆర్‌: భట్టి

కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయంగా ఆరోపణలు చేయడం లేదని, ఇది ప్రభుత్వ నివేదిక కాదని, ఒక ఇండిపెండెంట్‌, జ్యుడీషియల్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదిక అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మూడు బ్యారేజీల నిర్మాణంలో లోపాలు, నిర్వహణలో జరిగిన అక్రమాలు, అవకతవకలకు అప్పటి సీఎం కేసీఆర్‌ ప్రత్యక్షంగా, పరోక్షంగా బాధ్యుడంటూ నివేదిక తేల్చిందన్నారు. 31.3.2016న అప్పటి సీఎం శాసన సభలో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారని, తుమ్మిడిహెట్టి వద్ద నుంచి ఎందుకు మార్చామో చెప్పారని, కానీ, నిపుణుల కమిటీ నివేదికను కాదని, కేసీఆర్‌ సొంతంగా నిర్ణయం తీసుకున్నారని నివేదిక స్పష్టం చేసిందని, తద్వారా కేసీఆర్‌ శాసన సభను తప్పుదోవ పట్టించారని, రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించారని ఆరోపించారు. అప్పటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కాపాడడంలో చిత్తశుద్ధి, సమగ్రతతో వ్యవహరించలేదని నివేదిక తప్పుపట్టిందని వివరించారు.


కాళేశ్వరం వైఫల్యానికి కేసీఆరే బాధ్యుడు: మంత్రి ఉత్తమ్‌

కాళేశ్వరం బ్యారేజీల వైఫల్యానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆరే ప్రధాన కారణమంటూ జస్టిస్‌ పినాకి చంద్ర ఘోష్‌ కమిషన్‌ నివేదిక ఇచ్చిందని నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. క్యాబినెట్‌ సమావేశం అనంతరం నివేదికలోని ముఖ్యాంశాలను ఆయన విలేకరులకు వివరించారు. తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు బ్యారేజీని మార్చడం అతి పెద్ద తప్పిదమన్నారు. కాళేశ్వరంతో తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని నివేదిక చెప్పిందని గుర్తు చేశారు. కమిషన్‌ విచారణలో కేసీఆర్‌ ప్రత్యక్షంగా బాధ్యుడని, డిజైన్‌, నిర్మాణం, నాణ్యత లోపం వల్లే బ్యారేజీ కుంగిందని తేలిందన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద 205 టీఎంసీల నీటి లభ్యత ఉందని, ఈ మేరకు అప్పట్లో కేంద్ర జలశక్తి శాఖ మంత్రిగా ఉన్న ఉమాభారతి ప్రాజెక్టుకు హైడ్రాలజీ క్లియరెన్స్‌ ఇస్తున్నట్లు లేఖ రాశారని తెలిపారు. తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదనడం అబద్ధమని, ఒక సాకు మాత్రమేనని నివేదిక తేల్చిందన్నారు. మేడిగడ్డలో బ్యారేజీ నిర్మాణం ఏ మాత్రం సహేతుకం కాదని, తుమ్మిడిహెట్టి దిగువన ప్రాణహితపై వేమనపల్లి వద్ద బ్యారేజీ కట్టాలని కేసీఆర్‌ హయాంలోనే వేసిన నిపుణుల కమిటీ సిఫారసు చేసిందని, దానిని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు, నీటిపారుదల శాఖ మాజీ ముఖ్యకార్యదర్శి ఎస్‌కే జోషి, మాజీ ఈఎన్‌సీలు మురళీధర్‌, హరిరామ్‌ ఉద్దేశపూర్వకంగానే తొక్కి పెట్టారని కమిషన్‌ తప్పు పట్టిందని వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని శాశ్వతంగా ప్రమాదంలోకి నెట్టే విధంగా అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని నివేదికలో స్పష్టం చేశారని తెలిపారు. కాళేశ్వరం జీవోలకు మంత్రివర్గ ఆమోదం లేదని, ఆ తర్వాత ర్యాటిఫికేషన్‌ కూడా చేయించలేదని కమిషన్‌ తేల్చిందన్నారు. నిర్మాణ సంస్థలకు అనుచిత లబ్ధి చేకూర్చడానికి నిబంధనలకు విరుద్ధంగా రూ.369 కోట్ల పనులను నామినేషన్‌ పద్ధతిలో అప్పగించారని నివేదికలో తప్పుబట్టారని చెప్పారు. నీటిని మళ్లించడానికి బ్యారేజీలను, నిల్వకు డ్యామ్‌లను కడతారని, కేవలం ప్రచారం కోసం బ్యారేజీల్లో నీటిని ఎక్కువ కాలం నిల్వ చేశారని, గోదావరికి జలకళ అని ప్రచారం చేసుకున్నారని, బ్యారేజీల వైఫల్యానికి ఇదే ప్రధాన కారణమని నివేదిక చెప్పిందని మంత్రి ఉత్తమ్‌ వివరించారు. రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా కేసీఆర్‌ వ్యవహరించారని, వేలాది కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయిందని నివేదిక తేల్చిందన్నారు. బ్యారేజీలు కుంగిన రోజు కూడా మేడిగడ్డలో 10.05 టీఎంసీల నీటి నిల్వ ఉందన్నారు. బ్యారేజీ కట్టిన నాటినుంచి అసలు నిర్వహణ పనులు చేయలేదని కమిషన్‌ గుర్తించిందన్నారు.


కాళేశ్వరం నిర్మాణం కేసీఆర్‌ సొంత నిర్ణయమే

తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును కాదని, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం కేసీఆర్‌ సొంత నిర్ణయమని, నిపుణుల కమిటీ నివేదికను మాజీ సీఎం, మాజీ మంత్రి పట్టించుకోలేదని కమిషన్‌ తన నివేదికలో స్పష్టం చేసిందని మంత్రి ఉత్తమ్‌ వివరించారు. బ్యారేజీల నిర్మాణ నిర్ణయం కేసీఆర్‌ ఒక్కడిదేనని నివేదిక తేల్చిందని వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్‌ సిద్ధం కాక ముందే ప్రాజెక్టు నిర్మాణ అంచనా వ్యయం రూ.71,436 కోట్లు అని 2016 ఫిబ్రవరి 11వ తేదీన ప్రధానమంత్రికి కేసీఆర్‌ లేఖ రాశారని, ఆ తర్వాత అంచనా వ్యయం రూ.1.10 లక్షల కోట్లకు, తాజాగా రూ.1.47 లక్షల కోట్లకు చేరిందని నివేదికలో ఉందని మంత్రి తెలిపారు. అంచనాలను పదే పదే పెంచారని నివేదిక తప్పుబట్టినట్లు వివరించారు. బ్యారేజీలు పూర్తి కాకపోయినా అయినట్లు సర్టిఫికెట్లు ఇచ్చారని, బ్యాంకు గ్యారంటీలు కూడా రిలీజ్‌ చేశారని నివేదికలో ఆక్షేపించారని చెప్పారు.


అధిక వడ్డీ... తక్కువ వ్యవధి

తెలంగాణ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చేలా ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని, అధిక వడ్డీకి తక్కువ వ్యవధిలో బకాయిలు కట్టేలా రూ.84 వేల కోట్లను రుణంగా తెచ్చుకున్నారని కమిషన్‌ గుర్తించిందని, తెలంగాణ సమాజాన్ని తాకట్టు పెట్టి, నాన్‌ బ్యాంకింగ్‌ సంస్థల నుంచి అప్పులు తెచ్చుకున్నారని నివేదికలో పేర్కొన్నట్లు వివరించారు. తుమ్మిడి హెట్టి వద్ద బ్యారేజీ కట్టి ఉంటే రూ.38 వేల కోట్లతో పూర్తై.. 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందిందని, హేతుబద్ధత లేకుండా, సహేతుక కారణాలు లేకుండా ప్రాణహిత-చేవెళ్లను పక్కనపెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారని నివేదికలో పేర్కొన్నారని తెలిపారు.


డిజైనింగ్‌.. నిర్మాణం.. కూలింది.. వాళ్ల హయాంలోనే

మేడిగడ్డ డిజైన్‌, నిర్మాణం చేసింది వారేనని, కూలింది కూడా వారు అధికారంలో ఉండగానేనని మంత్రి ఉత్తమ్‌ గుర్తు చేశారు. కేసీఆర్‌ అధికారంలో ఉన్నప్పుడే.. అంటే 2023 అక్టోబరు 25న దీనిపై జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ (ఎన్‌డీఎ్‌సఏ) నివేదిక ఇచ్చి.. మేడిగడ్డ బ్లాకు ఎందుకు కుంగిందో చెప్పిందని వివరించారు. ప్లానింగ్‌, డి జైన్‌, నిర్మాణం, క్వాలిటీ కంట్రోల్‌, ఓ అండ్‌ఎంలో లోపాలున్నాయని అప్పట్లోనే స్పష్టం చేసిందని తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కాళేశ్వరం నివేదికపై ఆరోపణలు.. బీఆర్ఎస్ పార్టీ సంచలన నిర్ణయం

కవితకు షాక్ ఇచ్చిన కోర్టు

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 05 , 2025 | 08:13 AM