CM Revanth Reddy: ప్రపంచ వ్యాపార కేంద్రంగా హైదరాబాద్!
ABN , Publish Date - Jul 04 , 2025 | 04:02 AM
తెలంగాణలో పెట్టుబడిదారులకు పూర్తి రక్షణ కల్పిస్తామని, వ్యాపారాలు లాభదాయకంగా కొనసాగేలా చూస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు.
అంతర్జాతీయ స్థాయిలో ‘భారత్ ఫ్యూచర్ సిటీ’
పెట్టుబడిదారులకు పూర్తి రక్షణ కల్పిస్తాం
మలబార్ ఆభరణాల తయారీ యూనిట్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి): తెలంగాణలో పెట్టుబడిదారులకు పూర్తి రక్షణ కల్పిస్తామని, వ్యాపారాలు లాభదాయకంగా కొనసాగేలా చూస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. హైదరాబాద్‌ను పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చి, ప్రపంచ వ్యాపార కేంద్రంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వాలు మారినంత మాత్రాన విధానాల్లో, ప్రోత్సాహకాల్లో మార్పు ఉండదని స్పష్టం చేశారు. వాటిని మరింత మెరుగ్గా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మహేశ్వరం పారిశ్రామిక పార్కులో ప్రముఖ ఆభరణాల తయారీ సంస్థ మలబార్ నిర్మించిన ‘మలబార్ జెమ్స్ అండ్ జ్యూయలరీ’ తయారీ కేంద్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మలబార్ గ్రూప్ చైర్మన్ ఎం.పి.అహ్మద్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌కు దేశంలో ఏ నగరం పోటీ కాదని, ప్రపంచ స్థాయి నగరాలతోనే పోటీ అని చెప్పారు. ఇందులో భాగంగానే మహేశ్వరంలో అంతర్జాతీయ స్థాయిలో ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ నిర్మాణానికి రూపకల్పన చేస్తున్నామన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తర్వాత ఇప్పుడు తమ ప్రభుత్వం నాలుగో నగరాన్ని నిర్మించి.. దేశానికి ఫ్యూచర్ సిటీని అందించే ఏర్పాట్లు చేస్తోందని చెప్పారు. రాబోయే వందేళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని విజన్ 2047 ప్రణాళికను రూపొందిస్తున్నామన్నారు. తెలంగాణ రైజింగ్ పేరుతో దీన్ని డిసెంబరు 9న ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. చరిత్రలో గుర్తుండిపోయేలా మహేశ్వరం నియోజకవర్గంలో 35 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామన్నారు.
గోల్డ్‌లో కూడా లెజెండ్
బంగారం కొనేవాళ్లలో తెలుగు మహిళలదే అగ్రస్థానమని సీఎం రేవంత్ పేర్కొన్నారు. రాష్ట్రంపై నమ్మకం ఉంచి ఇక్కడ తయారీ యూనిట్ ప్రారంభించిన మలబార్ సంస్థకు అభినందనలు తెలిపారు. మలబార్ తయారీ యూనిట్ ఏర్పాటుతో ఇక్కడ బంగారం, వజ్రాభరణాల రంగంలో నూతన శకం ప్రారంభమైందని అన్నారు. దేశంలో ఐటీ, ఫార్మా రంగంలో హైదరాబాద్ లెజెండ్‌గా ఉందని.. ఇపుడు గోల్డ్‌లో కూడా లెజెండ్‌గా మారనుందని చెప్పారు. 2035 నాటికి తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కొత్త పారిశ్రామిక విధానం-2025 రూపకల్పనకు శ్రీకారం చుట్టామని చెప్పారు. ఈ విధాన రూపకల్పనలో పారిశ్రామిక దిగ్గజాలను భాగస్వాముల్ని చేశామన్నారు. పరిశ్రమలకు వేగంగా, పారదర్శకంగా అనుమతులు మంజూరు చేసేలా టీజీఐపా్‌సను ఏఐతో అనుసంధానం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. తమది నిబంధనల పేరిట వేధించే ప్రభుత్వం కాదని, భుజం తట్టి ప్రోత్సహించే సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వమని చెప్పారు. కొత్తగా ప్రారంభించిన మలబార్ యూనిట్.. తెలంగాణను తయారీ రంగ హబ్‌గా తీర్చిదిద్దడంలో దిక్సూచిగా ఉంటుందన్నారు. మలబార్ సంస్థ ఫర్నిచర్ తయారీ యూనిట్ ఏర్పాటుకు ముందుకు రావాలని కోరారు. తెలంగాణ యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇచ్చేందుకు చేతులు కలపాలని కోరారు. 2023-24లో తెలంగాణ తయారీ రంగ ఎగుమతులు రూ.1.2 లక్షల కోట్లకు చేరినట్లు వెల్లడించారు. ఏకగవాక్ష విధానంలో టీజీఐపాస్ ద్వారా 4200 యూనిట్లకు అనుమతులు ఇచ్చామని, ఇందులో 98 యూనిట్లకు 15 రోజుల్లోనే అనుమతులు ఇచ్చామని చెప్పారు.
2750 మందికి ఉపాధి
మహేశ్వరంలో 3.45 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్తగా ఏర్పాటు చేసిన సమీకృత తయారీ కేంద్రం ద్వారా 2,750 మందికి ఉపాధి కల్పించనున్నట్లు మలబార్ గ్రూప్ చైర్మన్ ఎం.పి.అహ్మద్ చెప్పారు. తమ కంపెనీ సీఎ్‌సఆర్ కింద తెలంగాణలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి
రాయచోటిలో ఉగ్రవాదులు అరెస్ట్.. కీలక అప్ డేట్..
తెలంగాణ నీటి వాటాను ఏపీకి దారాదత్తం చేశారు.. కేసీఆర్, హరీష్‌లపై మహేష్ గౌడ్ ఫైర్
టాలీవుడ్‌లో పైరసీ గుట్టు రట్టు.. ఒకరి అరెస్ట్
Read latest Telangana News And Telugu News