CM Revanth Reddy: నేనున్నా.. అన్నదాతలకు రేవంత్ భరోసా..
ABN , Publish Date - Sep 05 , 2025 | 04:01 AM
భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన రైతులకు అండగా ఉంటామని, ఆదుకుంటామని, పంట నష్టపరిహారం అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.
పంట నష్టపరిహారం అందిస్తాం
ఇసుక మేటల తొలగింపునకు సాయం చేస్తాం
కొడంగల్‌తో సమానంగా కామారెడ్డిని అభివృద్ధి చేస్తాం
కామారెడ్డిలో వరద బాధితులకు సీఎం రేవంత్ రెడ్డి భరోసా
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి
కేంద్రం నుంచి ఎన్ని వస్తే అన్ని నిధులు రాబట్టుకోవాలని వ్యాఖ్య
కామారెడ్డి, హైదరాబాద్, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన రైతులకు అండగా ఉంటామని, ఆదుకుంటామని, పంట నష్టపరిహారం అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. భారీ వరదలతో చాలా మంది రైతుల పంట పొలాల్లో ఇసుక మేటలు వేసిందని, దానిని తొలగించేందుకు ప్రభుత్వం సహాయం అందిస్తుందని హామీ ఇచ్చారు. తిరిగి రైతులు వ్యవసాయం చేసుకునేలా ఆ భూములను యథా స్థితికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. భారీ వర్షాలు, వరదలతో కామారెడ్డి జిల్లాలో అపార నష్టం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గురువారం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. బాధిత ప్రజలను పరామర్శించారు. లింగంపేట మండలం బురిగిద్ద గ్రామంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. పంట నష్టంపై మహిళా రైతులను అడిగి తెలుసుకున్నారు. తీవ్రంగా నష్టపోయామని బాధిత రైతులు కన్నీటి పర్యంతం కావడంతో అండగా ఉంటామని, పంట నష్టపరిహారం అందిస్తామని భరోసా ఇచ్చారు. కుర్దు గ్రామం వద్ద వరదలకు తెగిన బ్రిడ్జిని పరిశీలించారు. కామారెడ్డిలోని జీఆర్ కాలనీ, హౌజింగ్ బోర్డు కాలనీలో బాధితులను పరామర్శించి భరోసా ఇచ్చారు.
కామారెడ్డి కలెక్టరేట్‌లో వరద నష్టంపై ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయా సందర్భాల్లో ఆయన మాట్లాడుతూ.. వందేళ్లలో ఎప్పుడూ రానంతగా కామారెడ్డిలో భారీ వరదలు వచ్చాయని, జిల్లాలో ప్రజలు, రైతులు ఇబ్బందులు పడ్డారని, వారికి జరిగిన నష్టాలను చూడడానికే ప్రత్యక్షంగా ఇక్కడికి వచ్చానని తెలిపారు. బాధిత రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వరద నష్టంపై ప్రణాళికాబద్ధంగా అంచనాలు తయారు చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని వస్తే అన్ని నిధులు రాబట్టుకోవాలని ప్రభుత్వ యంత్రాంగానికి సూచించారు. ‘‘కేంద్రం నుంచి వచ్చిన ఎస్‌డీఆర్‌ఎఫ్ నిధులను సద్వినియోగం చేసుకోవాలి. విపత్తు సమయంలోనూ వాటిని వినియోగించుకోవడం చేతకాకపోతే ఎలా!? ప్రస్తు తం రాష్ట్రంలో రూ.1300 కోట్ల ఎస్‌డీఆర్‌ఎఫ్ నిధులు ఉన్నా యి. అయినా, వాటిని సద్వినియోగం చేయకుండా రాష్ట్ర నిధుల కోసమే బిల్లులు పెడుతున్నారు. వాటిని ఖర్చు చేసే లా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. రోడ్ల మరమ్మతుల్లో కిలోమీటరుకు ఎస్‌డీఆర్‌ఎఫ్ కింద లక్ష రూపాయల వరకూ సాయం అందుతుంది. దానిని కూడా వినియోగించుకోకపోతే ఎలా!?’’ అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఏ పనికి ఎంత వర్తిస్తే అంత మొత్తం నిధులను వినియోగించుకునేలా బిల్లులు పెట్టాలని.. అలా కాకుండా మొత్తం నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచే తీసుకునేలా పంపితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
ఎస్‌డీఆర్‌ఎఫ్ నిధులు, రాష్ట్ర ప్రభుత్వ నిధులకు వేర్వేరుగా బిల్లులు పెట్టేలా కలెక్టర్లు చొరవ తీసుకోవాలని ఆదేశించారు. వరదల సమయంలో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురికాకుండా.. తగిన విధంగా వంతెనలు నిర్మించుకోవాలని సూచించారు. కేంద్రం నుంచి నష్ట నివారణ నిధులు రాకపోతే రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తుందని చెప్పారు. వరదల సమయంలో ప్రధాన శాఖల మధ్య సమన్వయం కొరవడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని, అన్ని శాఖల ఉన్నతాధికారులు సమన్వయంతో పని చేసి ప్రజలకు నష్టం వాటిల్లకుండా చూడాలని సూచించారు. సమస్య వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా మానవతా దృక్పథంతో వ్యవహరించాలన్నారు. రాబోయే 15 రోజుల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరద నష్టంపై హైదరాబాద్‌లో జిల్లాల ప్రజా ప్రతినిధులతో సమీక్ష నిర్వహిస్తానని తెలిపారు. ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాల్లో ఉన్న ప్రధాన సమస్యలతో నివేదికలు తయారు చేసుకుని రావాలని చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ముఖ గుర్తింపు హాజరు అక్కరలేదా అని ప్రశ్నిస్తూ.. దీన్ని వెంటనే అమలు చేయాలని నిర్దేశించారు.
కొడంగల్‌తో సమానంగా కామారెడ్డిని అభివృద్ధి చేస్తాం
‘గతంలో చెప్పాను. ఇప్పుడూ చెబుతున్నా. కొడంగల్‌కు ఎంత సాయం చేస్తున్నానో కామారెడ్డికీ అంతేసాయం చేస్తా’ అని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. తాత్కాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించానన్నారు. సమావేశంలో యూరియా సరఫరాపైనా చర్చ జరిగింది. ఈ ప్రాంతంలో యూరియా వినియోగం ఎక్కువ ఉంటుందని.. ఒక్క బస్తా దారి మళ్లించినా ఉపేక్షించేది లేదని అధికారులను హెచ్చరించారు. ప్రతి బస్తా రైతులకు అందేలా అధికారులు పర్యవేక్షణ చేయాలని సూచించారు.
గత ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులపై మాట్లాడదలచుకోలేదు
ఎంత పెద్ద ఉపద్రవం వచ్చినా.. జిల్లాలో 103 ఏళ్ల కిందట రూ.26 లక్షలతో కట్టిన పోచారం ప్రాజెక్ట్ తెగకుండా ఉందని, ఇక గత ప్రభుత్వంలో కట్టిన ప్రాజెక్ట్‌ల గురించి తాను మాట్లాడదలచుకోలేదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. పోచారం ప్రాజెక్ట్ వరదలకు తట్టుకుని నిలబడి ఇక్కడి ప్రజలను కాపాడిందన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్‌గౌడ్, ఎంపీ సురేశ్ షెట్కార్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, వెంకటరమణారెడ్డి, మదన్‌మోహన్‌రావు, తోట లక్ష్మీకాంతారావు, భూపత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
సుగాలి ప్రీతి కేసుపై సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం
22 నుంచి దసరా ఉత్సవాలు.. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు: మంత్రి ఆనం
Read Latest TG News and National News