CM Revanth Reddy: నీటి వాటాల్లో రాజీ పడం
ABN , Publish Date - Aug 16 , 2025 | 03:48 AM
గోదావరి, కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను సాధించడంలో రాజీ పడే సమస్యే లేదని సీఎం రేవంత్‌రెడ్డి పునరుద్ఘాటించారు. తెలంగాణ ప్రజల భావోద్వేగం, పేగు బంధం...
ఒత్తిడికి లొంగం.. కుట్రలకు బెదరం.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన
రైతులకు 1.13లక్షల కోట్లు ఖర్చు పెట్టాం.. పేదల సొంతింటి కలను నెరవేర్చాం
తెలంగాణ రైజింగ్-2047ను పూర్తి చేయడమే లక్ష్యం
స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
గోల్కొండ కోటలో అట్టహాసంగా వేడుకలు
హైదరాబాద్, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): గోదావరి, కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను సాధించడంలో రాజీ పడే సమస్యే లేదని సీఎం రేవంత్‌రెడ్డి పునరుద్ఘాటించారు. తెలంగాణ ప్రజల భావోద్వేగం, పేగు బంధం... సాగు నీటి ప్రాజెక్టులని అన్నారు. కృష్ణా, గోదావరి నదుల్లో తెలంగాణకు రావాల్సిన ప్రతి నీటి చుక్కను సాధిస్తామన్నారు. ఎవరి ఒత్తిడికి లొంగబోమని, ఎవరి కుట్రలకు బెదరబోమని స్పష్టం చేశారు. 4 కోట్ల మంది ప్రజల పక్షాన నిటారుగా నిలబడి కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ హక్కులను సాధించుకుంటామని తెలిపారు. హైదరాబాద్‌లోని గోల్కొండ కోటలో స్వాతంత్య్ర వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మువ్వన్నెల పతాకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరాంసాగర్ వంటి బృహత్తర ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలో నిర్మించినవేనని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం, కూలడం, రూ.లక్ష కోట్లు గోదావరిలో కలవడం.. అన్నీ మన కళ్ల ముందే జరిగాయని ధ్వజమెత్తారు. అందుకే ఆ పార్టీ నాయకులు మరోసారి సెంటిమెంట్‌ను రగిల్చి.. రాజకీయ ప్రయోజనం పొందడానికి కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పూర్తి బాధ్యత, అవగాహన ఉందని, ప్రాజెక్టులకు అనుమతులు తెచ్చుకోవడానికి అవసరమైన ప్రణాళికలూ ఉన్నాయని పేర్కొన్నారు. ఎస్‌ఎల్‌బీసీ, పాలమూరు-రంగారెడ్డి, డిండి వంటి ఎత్తిపోతల పథకాలను పూర్తి చేసి, తెలంగాణను రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దే బాధ్యత ప్రజాప్రభుత్వం తీసుకుంటుందని ప్రకటించారు. పూర్తి ప్రసంగం ఆయన మాటల్లోనే..
సంక్షేమానికి కేరాఫ్ కాంగ్రెస్ పాలన
‘‘గత ఉగాది నుంచి ప్రజా ప్రభుత్వం ఆధ్వర్యంలో రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నాం. రూ.13 వేల కోట్లతో, 3.10 కోట్ల మందికి సన్న బియ్యం అందిస్తున్నాం. ఈ రోజు ధనికులతో సమానంగా పేదవారు సన్న బియ్యంతో భోజనం చేస్తున్నారు. ఇది కేవలం ఆకలి తీర్చే పథకం కాదు. ఆత్మగౌరవాన్ని చాటి చెప్పే పథకం. రేషన్‌కార్డులు.. ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక. ఒక భరోసా. ఇందుకోసం రాష్ట్ర ప్రజలు పదేళ్లు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశారు. ప్రజా ప్రభుత్వం వచ్చాకే ఆ ఎదురు చూపులకు పరిష్కారం లభించింది. ఈ ఏడాది జూలై 14 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నూతన రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించాం. పదేళ్ల తర్వాత పేదల సొంతింటి కలలకు మళ్లీ రెక్కలు తొడిగాం. తొలి విడతగా ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్లు మంజూరు చేశాం. ఇందుకోసం రూ.22,500 కోట్లు వెచ్చిస్తున్నాం. ఈ ఏడాదే 4.50లక్షల ఇళ్లు పూర్తి చేయబోతున్నాం. రాష్ట్ర రైతులకు ఇచ్చిన మాట ప్రకారం గత ఏడాది ఆగస్టు 15న రుణమాఫీకి శ్రీకారం చుట్టాం. రాష్ట్రంలోని 25.35 లక్షల మంది రైతులకు రూ.20,616కోట్ల మేర రుణాలను మాఫీ చేసి, కొత్త చరిత్రను లిఖించాం. ‘ఇందిరమ్మ రైతు భరోసా’ కింద ఎకరాకు రూ.12 వేల పెట్టుబడి సాయం అందించాం. ఇటీవల తొమ్మిది రోజుల్లోనే రూ.9వేల కోట్ల సొమ్మును రైతుల ఖాతాల్లో వేశాం. 7,178 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొన్నాం.మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్నదాతల సంక్షేమానికి రూ.1.13లక్షల కోట్లను ఖర్చు చేశాం.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు
సమగ్ర కుల గణన సర్వే ఆధారంగా స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లను కల్పించాలని నిర్ణయించాం. ఈ మేరకు బిల్లులను రూపొందించగా, ఈ ఏడాది మార్చి 17న శాసనసభ ఆమోదించింది. బీసీ రిజర్వేషన్ల అమలుకు సహకరించాలని కేంద్రాన్నీ కోరాం. అలాగే, దేశంలో ఎస్సీ వర్గీకరణ చేసిన మొదటి రాష్ట్రం తెలంగాణనే. ఆరోగ్యశ్రీ పరిధిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాం. రూ.2,700 కోట్లతో కొత్త ఉస్మానియా ఆస్పత్రి భవన సముదాయాన్ని నిర్మిస్తున్నాం. రాష్ట్రంలో అనేక చోట్ల వైద్య విద్యా కళాశాలలు నిర్మిస్తున్నాం. మహాలక్ష్మి పథకం కింద ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం. ఈ పథకం కింద ఆడబిడ్డలకు రూ.6,790 కోట్లు ఆదా అయ్యాయి. ఇటీవలే 200 కోట్ల జీరో టికెట్ల మైలురాయిని దాటడం మా విజయాల్లో మరో మైలురాయి. గత పదేళ్లలో యువతను మత్తుకు బానిసలను చేసే కుట్ర జరిగింది. ఆ కుట్రను మేం చేధించాం. ఇవ్వాళ తెలంగాణలో డ్రగ్స్ మాట వినబడటానికి వీలు లేదు. 20 నెలల్లోనే దాదాపు 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. హైదరాబాద్ బ్రాండ్‌ను ప్రమోట్ చేసే చర్యల్లో భాగంగా ఇటీవల ప్రపంచ సుందరి పోటీలు నిర్వహించాం. 2047నాటికి భారతదేశ ముఖచిత్రాన్ని మార్చే గేమ్ చేంజర్ పాత్రలో తెలంగాణ కీలకంగా ఉండాలన్న సంకల్పం మాది. 2035 నాటికి ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దాలన్న మహత్తర సంకల్పమే ‘తెలంగాణ రైజింగ్ 2047’. హైదరాబాద్‌ను స్వచ్ఛమైన, శుభ్రమైన, సౌకర్యవంతమైన నగరంగా తీర్చిదిద్దాలని మా ప్రభుత్వం భావిస్తోంది. ఆ ఆలోచన నుంచి ఏర్పాటైనదే హైడ్రా. చెరువుల ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలను నిరోధించాలన్న ఉద్దేశంతోనే హైడ్రాను తీసుకువచ్చాం. ఈ రోజు రూ.30వేల కోట్ల విలువైన భూములను హైడ్రా కాపాడింది. యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ.. ఇవి నాకు రెండు కళ్లు. మన పిల్లల భవితకు ఇవి కేరాఫ్ అడ్ర్‌సగా నిలుస్తాయనడంలో సందేహం లేదు’’ అని తెలిపారు.
వారసత్వ అప్పు రూ.8,21,651 కోట్లు
గత పాలకులు మాకు వారసత్వంగా రూ.8,21,651కోట్ల అప్పును మిగిల్చి వెళ్లారు. ఇందులో అప్పులు రూ.6,71,757 కోట్లు కాగా, ఉద్యోగులు, పథకాలకు సంబంధించిన బకాయిలు రూ.40,154కోట్లు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్, సింగరేణి, విద్యుత్ ఇతర విభాగాలకు చెల్లించాల్సిన బకాయిలు రూ.1,09,740కోట్లు. ఇంత ఆర్థిక భారం ఉన్నప్పటికీ శూన్యం నుంచి శిఖరానికి రాష్ట్రాన్ని తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నాం. ‘మనసుంటే మార్గం ఉంటుంది’అనే సూక్తిని నేను విశ్వసిస్తాను. మాకు విల్ ఉంది... తెలంగాణ రైజింగ్-2047 మా విజన్. ప్రపంచ వేదికపై తెలంగాణను నంబర్‌వన్‌గా నిలబెట్టడమే మా లక్ష్యం. అంత వరకు విశ్రమించబోం.
ఈ వార్తలు కూడా చదవండి..
రాజ్‌భవన్‌లో ఎట్ హోమ్.. హాజరైన సీఎం, డిప్యూటీ సీఎం దంపతులు
ఆవకాయ పెట్టాలన్నా.. అంతరిక్షంలోకి వెళ్లాలన్నా..
Read Latest Telangana News and National News