Share News

CM Revanth Reddy: కేసీఆర్‌ చీకట్లో మీ కాళ్లు పట్టుకున్నందుకేనా?

ABN , Publish Date - Feb 25 , 2025 | 03:34 AM

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో బీఆర్‌ఎస్‌ నేతలు కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు అరెస్టు కాకుండా కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లే కాపాడుతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

CM Revanth Reddy: కేసీఆర్‌ చీకట్లో మీ కాళ్లు  పట్టుకున్నందుకేనా?

  • అందుకే కేసీఆర్‌, కేటీఆర్‌కు బీజేపీ రక్షణ

  • వారిని కాపాడుతున్నది కిషన్‌రెడ్డి, సంజయే

  • ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావును

  • అమెరికా నుంచి ఎందుకు రప్పించట్లేదు

  • ఫామ్‌హౌ్‌సలోంచి సర్కార్‌పై కేసీఆర్‌ కుట్రలు

  • కేసీఆర్‌, కేటీఆర్‌, కవిత ఎవరికి ఓటేస్తారు?

  • కాంగ్రె్‌సను ఓడించాలని అనడంలో మతలబేంటి?

  • మేం కులగణన చేపడితే.. బీజేపీ కుట్రలు

  • పట్టభద్రులతో ఆత్మీయ సమ్మేళనంలో రేవంత్‌రెడ్డి

నిజామాబాద్‌/మంచిర్యాల/కరీంనగర్‌, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో బీఆర్‌ఎస్‌ నేతలు కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు అరెస్టు కాకుండా కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లే కాపాడుతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఈ కేసులో నిందితులైన ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావు అమెరికాకు పారిపోతే.. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నించారు. హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్‌కి ఇది సాధ్యం కావడంలేదా? అని ఎద్దేవా చేశారు. ఆ ఇద్దరిని రాష్ట్రానికి తీసుకువచ్చిన 48 గంటల్లోనే తాము బీఆర్‌ఎస్‌ నాయకులను అరెస్టు చేస్తామని ప్రకటించారు. ‘‘కేసీఆర్‌ ఢిల్లీకి వచ్చి చీకట్లో మీ కాళ్లు పట్టుకున్నందునే వారిని అమెరికా నుంచి రప్పించడంలేదు’’ అని సీఎం ఆరోపించారు. బండి సంజయ్‌ ఇప్పటికైనా ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావును తెచ్చి తమకు అప్పగించాలన్నారు. ఈ కేసులో జైలుకు పంపించిన రాధాకిషన్‌రావు, ప్రణీత్‌రావుకు పది నెలల తర్వాతే బెయిల్‌ వచ్చిందని గుర్తు చేశారు. హరీశ్‌రావు కోర్టుకు వెళ్లి బెయిల్‌ తెచ్చుకున్నారని పేర్కొన్నారు. ఫార్ములా ఈ-కార్‌ రేసులో ఫైళ్లన్నీ తీసుకెళ్లిన ఈడీ అధికారులు.. కేటీఆర్‌ను ఎందుకు అరెస్టు చేయడంలేదని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సోమవారం కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిజామాబాద్‌, మంచిర్యాల, కరీంనగర్‌లో నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో సీఎం పాల్గొని మాట్లాడారు. ‘‘ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎప్పుడూ ఢిల్లీ వెళ్లని బీఆర్‌ఎస్‌ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌ ఇప్పుడెందుకు వెళ్తున్నారో, కేంద్ర మంత్రులను ఎందుకు కలుస్తున్నారో అర్థం కావడంలేదా? కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని కలిసిన కేటీఆర్‌ రాష్ర్టానికి చిల్లిగవ్వయినా తెచ్చారా? తెలంగాణకు నిధులు కావాలంటే మాతో కలిసి రావాలి కదా! మీరిద్దరూ చీకట్లో కలిసేది ఎందుకు? బీజేపీ, బీఆర్‌ఎస్‌ నాయకులు చీకట్లో ఒప్పందాలు చేసుకునేందుకే కలుస్తున్నారు’’ అని రేవంత్‌ ఆరోపించారు. రాష్ట్రానికి నిధుల కోసం తాము రోజూ పోరాడుతున్నామని, నిధులెలా తేవాలో తమకు తెలుసన్నారు.


ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ దుష్ప్రచారం..

తమ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని, కుట్రలు, కుతంత్రాలు చేసి బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తున్నారని సీఎం రేవంత్‌ ఆరోపించారు. కేసీఆర్‌ ఫామ్‌హౌ్‌సలో కూర్చొని కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను నిలపలేదని, మరి పట్టభద్రులైన కేసీఆర్‌, కేటీఆర్‌, కవిత ఎవరికి ఓటేస్తారని ప్రశ్నించారు. పైగా అభ్యర్థిని నిలబెట్టని పార్టీ.. ఎవరికి ఓటు వేయాలో ఎలా చెబుతుందని నిలదీశారు. పోటీ చేయడానికి ఆ పార్టీకి అభ్యర్థులే లేరని ఎద్దేవా చేశారు. పోటీ ఎందుకు చేయడంలేదని, పోటీ చేయని పార్టీకి రాజకీయ పార్టీ అని చెప్పుకొనే అర్హత ఉందా? అని ప్రశ్నించారు. 2023లో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ 8 సీట్లలో డిపాజిట్లు కోల్పోతే, అవే సీట్లలో బీజేపీ ఎలా గెలిచిందో ప్రజలకు అర్థం కాదా? అని అన్నారు. పది నెలల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏమీ చేయలేదంటున్న బీఆర్‌ఎస్‌ నేతలు.. పదేళ్లలో వారేం చేశారో చెప్పాలన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటైన కొద్ది రోజులకే పార్లమెంట్‌ ఎన్నికలు వచ్చాయని, దీంతో ఎన్నికల కోడ్‌ కారణంగా తమకు 8 నుంచి 9 నెలలు మాత్రమే పరిపాలన చేసే అవకాశం వచ్చిందని తెలిపారు. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో నిరుద్యోగుల సమస్య పరిష్కారం కాలేదని, తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన పట్టభద్రులకే ఉద్యోగాలు ఇవ్వలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఉద్యోగాల భర్తీ చేపట్టినట్టు పేర్కొన్నారు. 10 నెలల కాలంలోనే 55,163 ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు. కొత్తగా 17వేల మంది టీచర్లను నియమించామని, 35 వేల మందికి పదోన్నతులు కల్పించామని, 22 వేల మందిని బదిలీ చేశామన్నారు. భార్యాభర్తలు ఒకేచోట పనిచేసే అవకాశం కల్పించామన్నారు. బీఆర్‌ఎస్‌ చేసిన అప్పులకు.. ప్రతి నెలా రూ.6500కోట్లు వాయిదాలుగా చెల్లిస్తున్నామని తెలిపారు.


బీజేపీ జనగణన ఎందుకు చేయలేదు?

‘‘బీసీ కులగణనపై కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ఆకాశమంత ఎగిరి దూకుతున్నాడు. తామే బడా బీసీలమని బండి సంజయ్‌, మోదీ చెబుతున్నారు. అయితే దేశంలో 2021లో బీజేపీ ప్రభుత్వం జనగణన ఎందుకు చేపట్టలేదు?’’ అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. వందేళ్లలో బీసీ కులగణన చేయలేదని, తమ ప్రభుత్వ హయాంలో నెలరోజుల్లోనే చేపట్టి ప్రజల ముందు లెక్కలు పెట్టామని అన్నారు. ప్రభుత్వం కులగణన చేపడితే బీజేపీ నేతలు మాత్రం కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. కేంద్రం జనగణనతోపాటే కులగణన చేసి.. తాము చేసిన కులగణన లెక్కలు తప్పని తేలిస్తే ముక్కు నేలకు రాస్తానని సవాల్‌ చేశారు.మైనారిటీలను బీసీల్లో ఎలా కలుపుతారని బండి సంజయ్‌ ప్రశ్నిస్తున్నారని, కానీ.. 1960 నుంచే మైనారిటీలు బీసీ రిజర్వేషన్లు పొందుతున్నారని సీఎం తెలిపారు. గుజరాత్‌లో 29 ముస్లిం కులాలు బీసీ రిజర్వేషన్లను అనుభవిస్తున్నాయని, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, బిహార్‌లోనూ ముస్లింలు బీసీ రిజర్వేషన్‌ పొందుతున్నారని పేర్కొన్నారు. అవసరమైతే ఆ రాష్ర్టాలకు నిజనిర్ధారణ కమిటీని పంపిస్తామన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్ల నుంచి కొట్లాడుతున్నారని సీఎం తెలిపారు. మందకృష్ణ మాదిగకు ప్రధాని మోదీ ముద్దు పెట్టారు తప్ప.. ఎస్సీ వర్గీకరణ లెక్క తేల్చలేదని విమర్శించారు. తాము ఎస్సీ వర్గీకరణకు చట్టం చేశామని గుర్తు చేశారు. హైదరాబాద్‌ మెట్రో రైల్వే విస్తరణకు అడ్డు పడింది.. అనుమతి ఇవ్వవద్దన్నది కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డేనని ఆరోపించారు. మూసీ ప్రక్షాళనకు, రీజినల్‌ రింగ్‌ రోడ్డుకు అనుమతులు రాకుండా, నిధులు ఇవ్వకుండా అడ్డుకుంటున్నదీ ఆయనేనన్నారు. రాష్ట్రానికి నిధులు తీసుకురాని దద్దమ్మ కిషన్‌రెడ్డి అని ధ్వజమెత్తారు. తెలంగాణ నుంచి ఇద్దరికి(కిషన్‌రెడ్డి, సంజయ్‌కు) మాత్రమే ఉద్యోగాలిచ్చిన బీజేపీకి ఓట్లడిగే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. ఆ పార్టీని బండకేసి కొడితే మెట్రో, మూసీ, ట్రిపుల్‌ఆర్‌ ప్రాజెక్టులు ముందుకు సాగుతాయన్నారు. పట్టభద్రులు బీజేపీని బొంద పెట్టాలని, అల్ఫోర్స్‌ నరేందర్‌రెడ్డిని గెలిపించాలని కోరారు.


ఒకటో తేదీనే జీతాలిస్తున్నాం..

కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒకటో తేదీనే ఉద్యోగుల వేతనాలు ఇస్తున్నామని తెలిపారు. నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చేందుకు యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని, రాష్ట్రంలోని 65ఐటీఐలను రూ.2400కోట్లతో అడ్వాన్డ్స్‌ టెక్నాలజీ సెంటర్లుగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు స్పోర్ట్స్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. తాను సీఎంగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క రోజైనా సెలవు తీసుకోలేదని, హామీల అమలు కోసం పని చేస్తున్నానని చెప్పారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం పదేళ్ల పాలనలో ఉద్యోగాలివ్వకుండా నిరుద్యోగులను మోసం చేసిందని ఆరోపించారు. రేవంత్‌ అగ్రవర్ణానికి చెందిన వ్యక్తిఅయి ఉండీ.. రిజర్వేషన్ల విషయం లో బీసీలకు మద్దతివ్వడం గొప్పవిషయమన్నారు.


అప్పుడు ఉప ఎన్నికలు వచ్చాయా?

బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ అసెంబ్లీకి రారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ పెట్టరని, కానీ.. ఉప ఎన్నికల్లో మాత్రం తడాఖా చూపిస్తానంటూ ప్రకటనలు చేస్తున్నారని రేవంత్‌రెడ్డి విమర్శించారు. ‘‘పదేళ్లలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన అనేక మంది ఎమ్మెల్యేలను చేర్చుకుంటే ఉప ఎన్నికలు వచ్చాయా? ఇప్పుడెందుకు వస్తాయి? అప్పుడున్న స్పీకర్లు, కోర్టులే ఇప్పుడూ ఉన్నాయి కదా!’’ అని సీఎం అన్నారు. పార్టీలు మారిన తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ను, సబితా ఇంద్రారెడ్డిని మంత్రులను చేసింది కేసీఆర్‌ కాదా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌కు ఇక మిగిలింది గతమేనని, భవిష్యత్తు లేదని అన్నారు.


ఇవి కూడా చదవండి...

CM Revanth Reddy: సొల్లు మాటలు వద్దు.. ఆధారాలతో చూపించండి

Telangana: మేడిగడ్డ వ్యవహారం.. కేసీఆర్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్..

TGSRTC: భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన టీజీఎస్‌ఆర్టీసీ.. ఆరోజు ఏకంగా 3 వేల బస్సులు..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 25 , 2025 | 03:34 AM