Hyderabad: ఆర్టీసీకి భారీ గిరాఖీ
ABN , Publish Date - Aug 09 , 2025 | 04:12 AM
సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో నగరంలోని ప్రధాన బస్టాండ ్లన్ని కిక్కిరిసిపోయాయి. వరలక్ష్మీ వ్రతం, రాఖీ పౌర్ణమి పండగలకు తోడు ఆదివారం కలిసి కావడంతో నగరంలో ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటున్న జనం సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు.
రాఖీ పండుగ, వరుస సెలవులతో సొంతూళ్లకు..
ఇదే అదనుగా 41-50ు చార్జీలు పెంచిన ఆర్టీసీ
ప్రత్యేక బస్సుల పేరుతో ప్రయాణికులపై భారం
అడ్డగోలుగా దోచేస్తున్నారంటూ జనం ఆగ్రహం
హైదరాబాద్/హైదరాబాద్ సిటీ/చౌటుప్పల్ టౌన్, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో నగరంలోని ప్రధాన బస్టాండ ్లన్ని కిక్కిరిసిపోయాయి. వరలక్ష్మీ వ్రతం, రాఖీ పౌర్ణమి పండగలకు తోడు ఆదివారం కలిసి కావడంతో నగరంలో ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటున్న జనం సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు. శుక్రవారం ఉదయం నుంచే బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ కొనసాగింది. ఉచిత ప్రయాణాల నేపఽథ్యంలో ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లో వెళ్లేందుకు పోటీపడ్డారు. కాగా, రద్దీని ముందే ఊహించిన ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది. జేబీఎస్, ఎంజీబీఎ్‌సతో పాటు ఎల్‌బీనగర్, ఆరాంఘర్, ఉప్పల్, మేడ్చల్, కేపీహెచ్‌బీ, మియాపూర్ ప్రాంతాల నుంచి వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆర్టీసీ ప్రత్యేక అధికారుల బృందాలను ఏర్పాటు చేసింది. రద్దీకి తగ్గట్లూ రోజూవారీ సర్వీసులతో పాటు అదనంగా 400 ప్రత్యేక సర్వీసులు నడిపినట్లు ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలిపారు. బస్టాండ్ల ఆవరణలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ట్రాఫిక్ కంట్రోలర్లను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
పండగ వేళ ఆర్టీసీ నిలువు దోపిడీ
సులభతరంగా, క్షేమంగా అందరికీ అందుబాటులో టికెట్ ధరలతో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తామని చెప్పిన ఆర్టీసీ యంత్రాంగం పండగ సమయాల్లో మాత్రం వారిపై అధికభారం మోపుతోంది. రాఖీ సందర్భంగా ప్రత్యేక బస్సులు నడుపుతున్నామన్న పేరుతో.. ఆర్టీసీ అధిక చార్జీలు వసూలు చేస్తుండడంతో ప్రయాణికులు నిలువు దోపిడికి గురవుతున్నారు. సాధారణ చార్జీల కంటే 41-50 శాతం చార్జీలు పెంచి వసూలు చేస్తోందంటూ ప్రయాణికులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. మామూలు రోజుల్లో ఉప్పల్ నుంచి హన్మకొండకు రాజధాని బస్సుల్లో టికెట్ చార్జీ రూ. 390 అయితే శనివారం ప్రత్యేక బస్సుల్లో ఒక్కో టికెట్‌పై రూ.160పెంచి.. రూ. 550 వసూలు చేశారంటూ హన్మకొండకు వెళ్లే ఓ ప్రయాణికుడు ఆర్టీసీ తీరుపై ఆగ్రహాం వ్యక్తం చేశాడు. మహిళలకు ఉచిత ప్రయాణాలు కల్పిస్తున్నామంటూ ప్రచారం చేస్తున్న ప్రభుత్వం ఈ దోపిడిపై ఎందుకు స్పందించడం లేదంటూ పలువురు ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో చార్జీలు పెంచడంతో ఇదే అదనుగా భావించిన ప్రైవేట్ వాహనదారులు కూడా అందినకాడికి దండుకుంటున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. అయితే ప్రత్యేక బస్సుల్లో మాత్రమే అదనపు చార్జీలు వసూలు చేస్తామని, సాధారణ బస్సు సర్వీస్ చార్జీల్లో ఎలాంటి మార్పు లేదని అధికారులు స్పష్టం చేశారు. పండగల వేళ బస్సు టికెట్ ధరలు పెంచేందుకు ఆర్టీసీకి అనుమతి ఉందని తెలిపారు.
జాతీయ రహదారిపై వాహనాల రద్దీ
మరోవైపు, యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలోని 65వ నంబరు జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం నుంచి రద్దీ నెలకొంది.. నల్లగొండ, సూర్యాపేట, ఉమ్మడి ఖమ్మం జిల్లాలతో పాటు ఏపీలోని పలు జిల్లాలకు వెళ్లేందుకు వాహనాలు బారులు తీరాయి. జాతీయ రహదారితో పాటు సర్వీస్ రహదారులు కూడా కిక్కిరిసిపోయాయి. టోల్‌ప్లాజాల వద్ద ట్రాఫిక్‌ను సులభతరం చేయడానికి అదనపు సిబ్బందిని నియమించారు. చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్ రెడ్డి పర్యవేక్షణలో ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అవి చూసి షాక్ అయ్యా: బండి సంజయ్
‘బీజేపీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు’
For More AndhraPradesh News And Telugu News