Share News

Kaleshwaram Project: కట్టుడు నుంచి కూలుడు దాకా సర్వం కేసీఆరే!

ABN , Publish Date - Aug 05 , 2025 | 04:17 AM

మేడిగడ్డ దగ్గర బ్యారేజీ నిర్మాణం కేవలం కేసీఆర్‌ మదిలో పుట్టిన ఆలోచన. దాన్ని ఇష్టానుసారం అమలుచేయడం, తానే ఇంజనీర్‌లా వ్యవహరించడం, ప్లానింగ్‌లో, నిర్మాణంలో లోపాలు, అవకతవకలు, నిబంధనల ఉల్లంఘన వల్లే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు విఫలమయ్యాయి.

Kaleshwaram Project: కట్టుడు నుంచి కూలుడు దాకా సర్వం కేసీఆరే!
KCR

  • సీఎంలా కాకుండా ఇంజనీర్‌లా వ్యవహారం

  • తందానా అన్న నాటి మంత్రి హరీశ్‌, అధికారులు

  • నిశ్శబ్ద నేరస్థుడు నాటి ఆర్థిక మంత్రి ఈటల

  • నిపుణుల కమిటీ నివేదికను కావాలనే తొక్కిపెట్టారు

  • క్యాబినెట్‌ ఆమోదం లేకుండానే అంచనాల పెంపు

  • నామినేషన్‌పై అప్పగించి కాంట్రాక్టు సంస్థలకు లబ్ధి

  • జస్టిస్‌ పీసీ ఘోష్‌ నివేదిక సారాంశాన్ని క్యాబినెట్‌కు అందజేసిన అధికారుల కమిటీ

మెదడు కరిగించి, రక్తాన్ని రంగరించి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టానన్న కేసీఆర్‌ మాటలు మరోవిధంగా నిజమేనని తేలిపోయింది. ప్రాజెక్టు కట్టుడు నుంచి కూలుడు దాకా బాధ్యత అంతా కేసీఆర్‌దేనని.. తన బుర్రలో పుట్టిన ఆలోచనతో ఇష్టానికి నిర్ణయం తీసుకుని, తన ఇష్టం వచ్చినట్టు కాళేశ్వరం బ్యారేజీలు కట్టించారని అధికారికంగా స్పష్టమైంది. ప్రాజెక్టు నిర్మాణంలో ప్రతి చిన్న అంశం కూడా కేసీఆర్‌ కనుసన్నల్లో, ఆయన ఇష్టానుసారమే జరిగిందని జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ వెల్లడించింది.

మెదడు కరిగించి, రక్తాన్ని రంగరించి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టానన్న మాజీ సీఎం కేసీఆర్‌ మాటలు మరోవిధంగా నిజమేనని తేలిపోయింది. ప్రాజెక్టు కట్టుడు నుంచి కూలుడు దాకా బాధ్యత అంతా కేసీఆర్‌దేనని.. తన బుర్రలో పుట్టిన ఆలోచనతో ఇష్టానికి నిర్ణయం తీసుకుని, తన ఇష్టం వచ్చినట్టు కాళేశ్వరం బ్యారేజీలు కట్టించారని అధికారికంగా స్పష్టమైంది. తుమ్మిడిహెట్టి వద్ద నీళ్లు లేవంటూ ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చడం మొదలు.. కాళేశ్వరం బ్యారేజీలు విఫలమవడం దాకా బాధ్యత అంతా కేసీఆర్‌దేనని జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ తేల్చిచెప్పింది.

ప్రాజెక్టు నిర్మాణంలో ప్రతి చిన్న అంశం కూడా కేసీఆర్‌ కనుసన్నల్లోనే జరిగిందని నివేదిక స్పష్టం చేసింది. ఇది ఎంత అరాచకంగా ఉందంటే.. ప్రతిపాదించిన బ్యారేజీ పొడవు కన్నా నది వెడల్పు ఎక్కువగా ఉన్నట్టు నిర్మాణ సమయంలో గుర్తించి, అదనంగా ఒక బ్లాక్‌ నిర్మించారని బయటపెట్టింది. కట్టకూడని చోట మేడిగడ్డ బ్యారేజీ కట్టారని, రిటైర్డ్‌ ఇంజనీర్ల కమిటీ నివేదికను తొక్కిపెట్టి మరీ పనులు చేయించారని స్పష్టంగా వివరించింది. నిర్మాణ సంస్థకు లబ్ధి చేకూర్చేందుకు డిజైన్లలో, పనుల్లో ఇష్టానుసారం మార్పులు చేసి, అంచనాలను పెంచేశారనీ తేల్చిచెప్పింది.

కేసీఆర్‌ కళ్లలో ఆనందం కోసం హరీశ్‌రావు, అధికారులు తానా అంటే తందానా అన్నట్టు వ్యవహరించారని.. నాటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ అన్నీ చూస్తూ నిశ్శబ్ద నేరస్తుడిగా ఉండిపోయారని వ్యాఖ్యానించింది. బ్యారేజీల వైఫల్యానికి కారకులైన ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇంజనీర్లు, నిర్మాణ సంస్థలపై చర్యలు తీసుకోవాలని సూచించింది. అధికారుల కమిటీ జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ నివేదికలోని ప్రధాన అంశాలను క్రోడీకరించి మంత్రివర్గానికి సమర్పించిన ప్రజెంటేషన్‌లో వెల్లడించింది. అందులోని పది కీలక అంశాలను పరిశీలిస్తే...

1. అంతా ఆయనే!

11.jpg

మేడిగడ్డ దగ్గర బ్యారేజీ నిర్మాణం కేవలం కేసీఆర్‌ మదిలో పుట్టిన ఆలోచన. దాన్ని ఇష్టానుసారం అమలుచేయడం, తానే ఇంజనీర్‌లా వ్యవహరించడం, ప్లానింగ్‌లో, నిర్మాణంలో లోపాలు, అవకతవకలు, నిబంధనల ఉల్లంఘన వల్లే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు విఫలమయ్యాయి. దీనికి ప్రత్యక్ష, పరోక్ష కారకుడు కేసీఆరే. మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణం ఏ మాత్రం శ్రేయస్కరం కాదన్న నిపుణుల కమిటీ సిఫారసును కేసీఆర్‌ కావాలనే పక్కనపెట్టేశారు. కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) డీపీఆర్‌ను పరిశీలించక ముందే పనులు ప్రారంభించారు. నీటి లభ్యత ఉందనే సాకుతో కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయం మొత్తం బ్యారేజీలను ప్రమాదంలోకి నెట్టేసింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా బ్యారేజీల నిర్మాణం జరగలేదు. ప్రాజెక్టు నిర్మాణ నిర్ణయం, బ్యారేజీలకు పరిపాలన అనుమతి నిర్ణయం కేసీఆర్‌ ఒక్కరిదే. తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదంటూ మేడిగడ్డకు తరలింపులో సదుద్దేశంతో తీసుకున్న నిర్ణయం కాదు. ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకంలోని తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత ఉన్నా లేనట్టు కేసీఆర్‌ తప్పుడు ప్రచారం చేశారు. తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత ఉందని కేంద్ర జలవనరుల సంఘం క్లియరెన్స్‌ ఇచ్చింది.బ్యారేజీలు విఫలమవడానికి బ్యారేజీల్లో నీటి నిల్వ కూడా ఒక కారణం. కేసీఆర్‌ ఆదేశాలతోనే బ్యారేజీల్లో నిండుగా నీటిని నిల్వ చేశారు. కేసీఆర్‌ ప్రభుత్వాధినేతగా కాకుండా ఓ అధికారిలా వ్యవహరించారు.


2. మామ కళ్లలో ఆనందం కోసం!

11.jpg

ముఖ్యమంత్రి కేసీఆర్‌ కోరికను నెరవేర్చేందుకు, ఆయన ఆలోచనలను అమలు చేసేందుకే నాటి సాగునీటి శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రయత్నించారు. మేడిగడ్డ వద్దే బ్యారేజీ కట్టాలని ఒక ఇంజనీర్‌లా కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయాన్నియథాతథంగా అమలు చేశారు. రిటైర్డ్‌ ఇంజనీర్లతో కూడిన నిపుణుల కమిటీ నివేదికను తొక్కిపెట్టి, మేడిగడ్డకు మార్గం సుగమం చేశారు. నిబంధనలకు విరుద్ధ్దంగా ఆదేశాలు జారీ చేశారు. సొంత నిర్ణయాలూ తీసుకున్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో షీట్‌పైల్స్‌ బదులుగా సీకెంట్‌ పైల్స్‌ను వినియోగించాలని 2017 జనవరి 9వ తేదీన హరీశ్‌రావు ఇచ్చిన ఆదేశాలే దీనికి సాక్ష్యం. 2015 ఏప్రిల్‌ 7న ప్రభుత్వానికి నిపుణుల కమిటీ నివేదిక అంశంపై హరీశ్‌రావు కమిషన్‌ ముందు వాస్తవాలు చెప్పలేదు. ఇక తుమ్మిడిహెట్టి బ్యారేజీకి హైడ్రాలజీ క్లియరెన్స్‌ ఇచ్చినట్టు 2015 మార్చి 13న నాటి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఉమాభారతి లేఖ రాస్తే.. తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత అంచనాల మేరకు లేదని, దీనిపై మళ్లీ సమీక్షించాలంటూ హరీశ్‌రావు 2015 మార్చి 20న కేంద్రానికిలేఖ రాశారు. ఈ కారణంలో నిజాయితీ, చిత్తశుద్ది లేవు.

3. ఈటల రాజేందర్‌.. నిశ్శబ్ద నేరస్తుడు

11.jpg

నాటి ముఖ్యమంత్రి, నీటి పారుదల శాఖ మంత్రులు సొంత నిర్ణయాలు తీసుకుని వాటినే అధికారిక నిర్ణయాలుగా అమలు చేస్తుంటే... ఆర్థిక శాఖ మంత్రిగా అడ్డుకునే బాధ్యతను ఈటల రాజేందర్‌ నిర్వర్తించలేదు. రాష్ట్ర ఖజానాకు భారీగా నష్టం వాటిల్లుతుందని తెలిసినా ఉదాసీనంగా వ్యవహరించారు. ఆయన నిశ్శబ్ద నేరస్తుడు. ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్థిక నిర్ణయాలపై తనకు సమాచారం లేదని బాధ్యతారహితంగా కమిషన్‌ ముందు చెప్పారు. ఇక కేబినెట్‌ సబ్‌ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే మూడు బ్యారేజీల నిర్మాణం చేయాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుందంటూ ఈటల తప్పుడు వాంగ్మూలం ఇచ్చారు.


4. నమ్మకాన్ని వమ్ము చేశారు

11.jpg

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్ణయాల్లో నాటి సీఎం కేసీఆర్‌ తీసుకున్న సొంత నిర్ణయాలన్నింటికీ అఽధికారులు తందాన అన్నారు. ఈ అవకతవకల్లో సీనియర్‌ ఐఏఎస్‌ అఽధికారుల పాత్రతోపాటు మొత్తం 18 మంది అధికారుల బాధ్యత ఉంది. వీరిలో సీఎస్‌గా పనిచేసిన ఎస్‌కే జోషి కూడా ఉన్నారు. ఆయన అప్పట్లో నీటిపారుదల శాఖకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, కాళేశ్వరం ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ కన్‌స్ట్రక్షన్‌ లిమిటెడ్‌ (కేఐపీసీఎల్‌) చైర్మన్‌గా వ్యవహరించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించడంతోపాటు కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యారు. అధికారుల స్థాయిలో తీవ్రమైన లోటుపాట్లకు ఈయనే బాధ్యుడు. ముఖ్యమంత్రి కార్యదర్శిగా ఉన్న స్మితా సబర్వాల్‌.. క్యాబినెట్‌ అనుమతులకు విరుద్ధంగా వ్యవహరించారు. ఈఎన్‌సీ మురళీధర్‌ తన అధికార పరిధిని మించి ప్రవర్తించారు. సెంట్రల్‌ డిజైన్స్‌ ఆర్గనైజేషన్‌ (సీడీవో) సభ్యులు చీఫ్‌ ఇంజనీర్లు టి.శ్రీనివాస్‌, నరేందర్‌రెడ్డి, ఎస్‌ఈ చంద్రశేఖర్‌, ఈఈ బసవరాజు తప్పుడు డిజైన్లు, డ్రాయింగ్‌లు సమర్పించారు. రాష్ట్ర నమ్మకాన్ని కుట్రపూరితంగా వమ్ము చేశారు. విధుల్లో నిర్లక్ష్యం చూపిన చీఫ్‌ ఇంజనీర్లు జె.శ్రీదేవి, జి.రమేష్‌, ఆశీర్వాదం కూడా బాధ్యులే. ప్రాజెక్టు పూర్తయినట్టు తప్పుడు ధ్రువీకరణ పత్రాలు జారీచేసిన ఈఈ, ఎస్‌ఈలు చర్యలకు అర్హులు. క్షేత్రస్థాయి నిర్మాణాలపై తప్పుడు సమాచారం ఇచ్చిన ఈఎన్‌సీ జి.అనిల్‌కుమార్‌, బి.నాగేందర్‌రావు, ఎస్‌డీఎస్‌ఏ చీఫ్‌ ఇంజనీర్‌ టి.ప్రమీల, హైడ్రాలజీ చీఫ్‌ ఇంజనీర్‌ శంకర్‌ నాయక్‌, సీడీవో చీఫ్‌ ఇంజనీర్లు టి.శ్రీనివాస్‌, నరేందర్‌రెడ్డి, రామగుండం ఈఈ సర్దార్‌ ఓంకార్‌సింగ్‌, పీసీఎ్‌సఎస్‌ ప్రాజెక్టు చీఫ్‌ ఇంజినీర్‌ బి.హరిరామ్‌ బాధ్యులే.

5. అంచనాలు పెంచి.. అనుచిత లబ్ధి..

11.jpg

ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకంగా భావించే గైడ్‌బండ్‌, ఫ్లడ్‌ బ్యాంక్‌ వంటి కీలక పనులను కూడా ప్రాజెక్టులో కాకుండా అదనపు పనులుగా విభజించారు. వీటిని నామినేషన్‌ పద్ధతిలో నిర్మాణ సంస్థలకు అప్పగించారు. 2017 డిసెంబరు 9వ తేదీన కేసీఆర్‌ సమీక్షా సమావేశం నిర్వహించి, ఒప్పందంలో లేని అదనపు పనులను నేరుగా అప్పగించారు. కాంట్రాక్టర్‌కు అనుచిత లబ్ధి చేకూర్చేవిధంగా వ్యవహరించారు. సీఎం మౌఖిక ఆదేశాలతో కాఫర్‌ డ్యామ్‌, గైడ్‌ బండ్‌ నిర్మాణ పనులను అప్పగించడం వల్ల ప్రభుత్వంపై రూ.369 కోట్ల అదనపు భారం పడింది. అవకతవకలకు పక్కా ఆధారమిది. ఇక కొన్ని పనులకు సంబంధించి సవరణ అంచనాలకు ముందే పరిపాలన అనుమతులు ఇచ్చేసి.. తర్వాత మంత్రివర్గం ఆమోదం తీసుకున్నారు. ప్రాజెక్టు డిజైన్‌లలో మార్పు, సిబ్బంది నివాస గృహాల నిర్మాణం, గెస్ట్‌హౌ్‌సల నిర్మాణం, కరకట్టల నిర్మాణం అదనపు పనుల్లో చేరడంతో నిర్మాణ అంచనాలు విపరీతంగా పెరిగాయి. నిర్మాణ సంస్థలకు అనుచిత లబ్ధిని చేకూర్చడానికే అంచనాలను సవరించారు.


6. నిబంధనలను పట్టించుకున్నవారే లేరు

  • కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇష్టారాజ్యంగా నిబంధనలను ఉల్లంఘించారు. పనులను టర్న్‌కీ పద్ధతిలో కేటాయించాలని సీడబ్ల్యూసీ చెప్పినా.. గంపగుత్తగా కాంట్రాక్టు సంస్థలకు అప్పగించారు.

  • కాళేశ్వరం కార్పొరేషన్‌ ఏ లక్ష్యాల కోసం ఏర్పడిందో ఆ లక్ష్యాల కోసం పనిచేయలేదు. కేవలం అప్పులు తేవడానికి, చెక్కులు ఇవ్వడానికే పరిమితమైంది.

  • అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణ స్థలాల మార్పు, బ్యారేజీల పొడవు, ఫ్లడ్‌ బ్యాంకుల నిర్మాణం, డిజైన్‌ల మార్పులలో ఎలాంటి సహేతుకత కనిపించలేదు.

  • 2016 జూలై/ఆగస్టులో ఒప్పందాలు ముగిశాక.. వ్యాప్కో్‌సతో సంప్రదించకుండానే అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణ స్థలాలు మార్చాలని హైపవర్‌ కమిటీ 2016 అక్టోబరు 22వ తేదీన నిర్ణయం తీసుకుంది. వ్యాప్కోస్‌ ప్రతిపాదించిన చోట కాకుండా మరో చోటికి నిర్మాణ స్థలాలను మార్చారు.

  • ప్రభుత్వం ఇచ్చిన డిజైన్లతోనే బ్యారేజీ నిర్మించామన్న కాంట్రాక్టు సంస్థ ఎల్‌ అండ్‌ టీ వాదన సరికాదు. ప్రతి దశలో డిజైన్లను ఎల్‌ అండ్‌ టీ నిర్మాణ సంస్థ పరిశీలించింది. ఎల్‌ అండ్‌ టీ సొంత టెక్నాలజీతో కూడిన విభాగాలు పర్యవేక్షించాయి కూడా.

  • బ్యారేజీల నిర్వహణ (ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌) పనులు చేయనేలేదు. అసలు దీనికి సంబంధించి మ్యానువల్‌ కూడా రూపొందించలేదు. బ్యారేజీల్లో నీటిని ఖాళీ చేసి నిర్వహణ పనులు చేయాలని నిర్మాణ సంస్థలు కోరినా అధికారులు పట్టించుకోలేదు. రాష్ట్ర జలాశయాల భద్రత సంస్థ తన బాధ్యతను నిర్వర్తించడంలో విఫలమైంది.

  • బ్యారేజీల నిర్మాణం పనులు పూర్తికాకుండానే పూర్తయినట్లు.. అది కూడా అవి దెబ్బతిన్నాక మేడిగడ్డ (ఎల్‌ అండ్‌ టీకి), అన్నారం (అఫ్కాన్స్‌), సుందిళ్ల (నవయుగ) నిర్మాణ సంస్థలకు కంప్లీషన్‌ సర్టిఫికెట్లు ఇచ్చారు. బ్యాంకు గ్యారంటీలు కూడా విడుదల చేశారు.


7. కాంట్రాక్టు సంస్థల ద్రోహం

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లోటుపాట్ల బాధ్యత కాంట్రాక్టు సంస్థలదే. కానీ సంస్థలు కుదుర్చుకున్న ఒప్పందానికి విరుద్ధంగా వ్యవహరించాయి. భారీగా ఆర్థిక ప్రయోజనాలు పొందేందుకు ద్రోహానికి పాల్పడ్డాయి. ప్రాజెక్టు నిర్మాణం పూర్తికాక ముందే పూర్తయినట్టు.. పనులు పూర్తయినట్టు చెప్పి, సర్టిఫికెట్లు పొందాయి. అసంపూర్తిగా వదిలేసిన పనులు, లోపభూయిష్టంగా చేసిన పనులను ప్రభుత్వ నిబంధనలు, ఒప్పందం ప్రకారం నిర్మాణ సంస్థలే పూర్తిచేయాలి. లేనిపక్షంలో ప్రభుత్వమే పూర్తిచేసి ఆ వ్యయాన్ని సంస్థల నుంచి వసూలు చేయాలి. లోపభూయిష్టంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ బాధ్యత సంబంధిత కంపెనీలదే. డిజైన్‌ ప్రకారమే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టామన్న ఎల్‌అండ్‌టీ వాంగ్మూలం ఆమోదయోగ్యం కాదు. సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌ (సీడీవో) రూపొందించిన డిజైన్లలో ఎల్‌అండ్‌టీ పాత్ర ఉందన్న విషయం ఈ-మెయిళ్లను పరిశీలిస్తే స్పష్టమవుతుంది. పలు అంశాల్లో కాంట్రాక్టు సంస్థలు, అధికారులు కుమ్మక్కయ్యారన్నది స్పష్టంగా తెలుస్తోంది. రెండోసారి అడ్డగోలుగా అంచనాల పెంపునకు కారకులైన ఇంజనీర్లు, అనుమతించిన రాష్ట్రస్థాయి స్టాండింగ్‌ కమిటీ సభ్యుల నుంచి అదనపు మొత్తాన్ని వసూలుచేయాలి.


8. 37,228 నమూనాలకు.. 7,498 మాత్రమే పరీక్ష

బ్యారేజీల డిజైన్‌లతోపాటు నిర్మాణ నాణ్యతలో లోపాలున్నాయి. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణ ప్రదేశాలు మార్చినప్పుడు కీలకమైన బ్లాక్‌ వాటర్‌ అధ్యయనాలు, టెయిల్‌ వాటర్‌ రేటింగ్‌ కర్వ్‌లు, జీ-డీ కర్వ్‌లు, జియో ఫిజికల్‌ పరీక్షలు చేయలేదు. తగిన క్షేత్రస్థాయి అధ్యయనాలు లేకుండానే డిజైన్లను సిద్ధం చేశారు. మేడిగడ్డ బ్యారేజీ ఎగువ, దిగువ భాగంలో మోనోలిథిక్‌ డిజైన్‌కు విరుద్ధంగా ఆర్‌సీసీ కటా్‌ఫలు డిజైన్‌ చేశారు. రాఫ్ట్‌ స్లాబులో ప్రమాణాలు పాటించలేదు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో లోపాలున్నాయి. ప్లింత్‌ స్లాబ్‌, జాయింట్‌ నిర్మాణంలో ప్రమాణాలు పాటించలేదు. వరద ప్రవాహ వేగాన్ని సరిగా అంచనా వేయలేదు. దీంతో పనులన్నీ దెబ్బతిన్నాయి. సీకెంట్‌ పైల్స్‌ అమరికలో, కాంక్రీట్‌ నాణ్యతలోనూ లోపాలున్నాయి. మొత్తం 37,228 నమూనాలు పరీక్షించాల్సి ఉండగా.. కేవలం 7,498 నమూనాలే పరిశీలించారు. ఇసుక, సిమెంట్‌ ఏ నిష్పత్తిలో వినియోగించారనే దానిపై స్పష్టత లేదు. అన్నారంలో ప్లింత్‌స్లాబును మోనోలిథికల్‌ విధానంలో కట్టలేదు. 2019లోనే బ్యారేజీల్లో లోపాలు బయటపడ్డాయి. వాటిని సకాలంలో సరిచేయలేదు.


9. మంత్రివర్గం ఊసేదీ?

2016 మార్చి 1న మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం కోసం రూ.2,591 కోట్ల అంచనాతో జీవో నం.231ను జారీ చేశారు. దానికి మంత్రివర్గ ఆమోదం లేదు. ఈ నిర్ణయం మాజీ సీఎం కేసీఆర్‌, అప్పటి మంత్రి టి.హరీశ్‌రావు మాత్రమే తీసుకున్నారు. మంత్రివర్గంలో చర్చించి, నిర్ణయం తీసుకోకుండా జీవో జారీ చేయాల్సినంత అత్యవసర నిర్ణయం కూడా కాదు. బ్యారేజీలకు పరిపాలన అనుమతినిచ్చే నోట్‌ఫైల్స్‌పై నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి 2016 ఫిబ్రవరి 26న సంతకం పెడితే... అదే రోజు అప్పటి మంత్రి, సీఎం సంతకం చేశారు. ఇది నిబంధనలకు విరుద్ధం.

10. అంతిమ లబ్ధిదారు తేలాలి

కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం ప్రారంభంలో రూ. 38,500 కోట్లుగా ఉంది. నాటి సీఎం కేసీఆర్‌ లేఖ ఆధారంగా 2016లో 71,436 కోట్లకు పెంచారు. తర్వాత 2022 మార్చిలో రెండోసారి అంచనా వ్యయాన్ని 1,10,248 కోట్లకు పెంచారు. ప్రాజెక్టు కోసం ప్రభుత్వ గ్యారంటీపై కాళేశ్వరం కార్పొరేషన్‌ 87,449 కోట్లు రుణంగా తీసుకుంది. ఈ ప్రాజెక్టు అంతా ఆర్థిక అవకతవకలు, భారీగా నిబంధనల ఉల్లంఘన ఉన్నాయి. భారీగా ప్రజాధనం వృధా అయింది.కాంట్రాక్టు సంస్థలు సమర్పించిన బిల్లులు, ధరల సర్దుబాటుపై లోతైన విచారణ చేయాలి. బడ్జెటేతర అప్పులపై లోతుగా, నిశితంగా, నిష్పక్షపాతంగా అధ్యయనం చేయాలి. మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తెచ్చిన అప్పులపై ఆర్థికపరమైన విచారణ జరగాలి. ఈ వ్యవహారంలో అంతిమ లబ్ధిదారు ఎవరో తేలాలి.


వివాదం విచారణ

2016 ఆగస్టు 26

మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ ఒప్పందం

2019 జూన్‌ 21

కాళేశ్వరం ప్రాజెక్టు ఆవిష్కరణ

2023 అక్టోబరు 21

మేడిగడ్డ పిల్లర్‌ నంబరు 20 కుంగినట్లు వెల్లడి

2023 అక్టోబరు 25

పరిశీలించిన ఎన్‌డీఎ్‌సఏ బృందం, ప్రాజెక్టు నిర్వహణ ఈఎన్‌సీ. ఎల్‌అండ్‌టీ సంస్థతో సమావేశం

2023 నవంబరు 1

పిల్లర్‌ కుంగుబాటుకు

గల కారణాలు తెలుపుతూ నివేదిక

2023 నవంబరు 30

తెలంగాణ శాసన సభ ఎన్నికలు

2024 ఫిబ్రవరి 13

మూడు బ్యారేజీల నిర్మాణ లోపాల గురించి

అధ్యయనం చేసి సమగ్ర నివేదిక ఇవ్వాలని

ఎన్‌డీఎ్‌సఏ ఛైర్మన్‌కు నూతన ప్రభుత్వ విజ్ఞప్తి

2024 మార్చి 2

నిపుణుల కమిటీని

నియమిస్తూ ఎన్‌డీఎ్‌సఏ ఛైర్మన్‌ నిర్ణయం

మార్చి 7, 8

3 బ్యారేజీలను పరిశీలించిన నిపుణుల కమిటీ

మార్చి 14

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి

జస్టిస్‌ పినాకి చంద్ర ఘోష్‌ నేతృత్వంలో

కాళేశ్వరం అక్రమాలపై విచారణ

కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.

2025 జూలై 31

ప్రభుత్వానికి నివేదిక అందజేసిన కమిషన్‌

విచారణ జరిగిన తీరు..

కాళేశ్వరం ప్రాజెక్టుపై పలు సంస్థలు ఇచ్చిన నివేదికలను విచారణ కమిషన్‌ సేకరించింది. అందులో ఎన్‌డీఎ్‌సఏ నివేదిక, కాగ్‌ రిపోర్టు, విజిలెన్స్‌ నివేదిక, నీటి పారుదల శాఖ నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక, క్యాబినెట్‌ తీర్మానాలు, ప్రభుత్వం ఇచ్చిన ఇతర పత్రాలు ఉన్నాయి. క్షేత్ర స్థాయి పరిశీలన జరపడంతోపాటు నిపుణుల కమిటీ, ఇంజినీర్లు, గుత్తేదారు సంస్థల ప్రతినిధులతో సమావేశాలు జరిపింది. మాజీ ముఖ్యమంత్రి, ఆనాటి ఆర్థిక, సాగునీటి మంత్రులు, కీలక విభాగాల అధిపతులను విచారించి వివరాలు సేకరించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

కాళేశ్వరం నివేదికపై ఆరోపణలు.. బీఆర్ఎస్ పార్టీ సంచలన నిర్ణయం

కవితకు షాక్ ఇచ్చిన కోర్టు

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 05 , 2025 | 07:21 AM