Share News

MLC Kavitha: రాయబారం.. విఫలం!

ABN , Publish Date - May 27 , 2025 | 04:57 AM

పార్టీలో తన పరిస్థితిపై ముందే స్పష్టత ఇవ్వాలని, లేకపోతే తన దారి తాను చూసుకుంటానని కాస్త ఘాటుగానే స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. వరంగల్‌లో బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ నేపథ్యంలో కేసీఆర్‌కు కవిత లేఖ రాయడం, ఆమె అమెరికాలో ఉన్నప్పుడు అది బహిర్గతం కావడం..

MLC Kavitha: రాయబారం..  విఫలం!

కవితతో ఫలించని కేసీఆర్‌ దూతల చర్చలు

  • కేసీఆర్‌ ఆదేశాలతో కవిత నివాసానికి దామోదరరావు, గండ్ర మోహనరావు

  • 3 గంటలపాటు కొనసాగిన చర్చలు

  • పార్టీకి, కుటుంబానికి నష్టమంటూ వివరణ

  • ఫోన్లో మాట్లాడిన కేసీఆర్‌ తొందరపడొద్దని కుమార్తెకు సూచన

  • పార్టీలో తన పరిస్థితి ఏమిటో ఇప్పుడే స్పష్టం చేయాలని పట్టుబట్టిన కవిత

  • లేకపోతే తన దారి చూసుకుంటానని వెల్లడి

హైదరాబాద్‌, మే 26 (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్సీ కవితతో బీఆర్‌ఎస్‌ పార్టీ అధినాయకత్వం జరిపిన రాయబారం విఫలమైందా!? వరుసగా రెండు సార్లు రాయబార ప్రయత్నాలు చేసినా.. ఆమె ఏమాత్రం మెత్తబడలేదా!? పార్టీలో తన ప్రాధాన్యం.. పార్టీ అధికారంలోకి వస్తే తన పరిస్థితిపై ఇప్పుడే స్పష్టత ఇవ్వాలని పట్టుబట్టారా!? ఈ ప్రశ్నలకు ‘ఔను’ అనే అంటున్నాయి అత్యంత విశ్వసనీయ వర్గాలు. పార్టీలో తన పరిస్థితిపై ముందే స్పష్టత ఇవ్వాలని, లేకపోతే తన దారి తాను చూసుకుంటానని కాస్త ఘాటుగానే స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. వరంగల్‌లో బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ నేపథ్యంలో కేసీఆర్‌కు కవిత లేఖ రాయడం, ఆమె అమెరికాలో ఉన్నప్పుడు అది బహిర్గతం కావడం.. దానిని తానే రాశానని స్పష్టం చేసిన కవిత.. కేసీఆర్‌ చుట్టూ ఉన్న దయ్యాలే దానిని లీకు చేశాయని తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై ఆదివారం కేటీఆర్‌ను పిలిపించుకుని కేసీఆర్‌ సంప్రదింపులు జరిపారు. కవిత వ్యవహారాన్ని ఓ కొలిక్కి తీసుకురాకుంటే మరింత నష్టం తప్పదన్న భావనకు వచ్చి.. సోమవారం ఆమె వద్దకు రాయబారం పంపారు. బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలతో పార్టీ దూతలు కవిత నివాసానికి వచ్చారు. తొలుత, కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు, బీఆర్‌ఎస్‌ ఎంపీ దివికొండ దామోదర రావు సోమవారం మధ్యాహ్నం కవిత నివాసానికి చేరుకున్నారు. కేసీఆర్‌ ఆదేశాల మేరకు సంప్రదింపులకు వచ్చానని ఆయన కవితకు స్పష్టం చేసినట్లు జాగృతి వర్గాలు తెలిపాయి. కొంతసేపు చర్చించిన తర్వాత ఆయన వెళ్లిపోయారు. అనంతరం, పార్టీ లీగల్‌ సెల్‌ బాధ్యతలు చూసే గండ్ర మోహన్‌రావు కవిత నివాసానికి చేరుకున్నారు. ఆయన కూడా కొంతసేపు మాట్లాడి.. వెళ్లిపోయారు. కేసీఆర్‌ పంపిన ఇద్దరు దూతలూ ఒకరి తర్వాత మరొకరు కవితతో మాట్లాడారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు దాదాపు మూడు గంటలపాటు ఈ సంప్రదింపుల ప్రక్రియ నడిచినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. దివికొండ దామోదర రావు, గండ్ర మోహనరావు ఇద్దరికీ కూడా కేసీఆర్‌ కుటుంబంతో బంధుత్వం ఉన్నట్లు పార్టీలోని సీనియర్‌ నేతలు చెబుతున్నారు. అందుకే వారిని సంప్రదింపుల కోసం పంపినట్లు సమాచారం.


నా సంగతేంటో తేల్చాల్సిందే..

తాజా రాజకీయ పరిణామాలు, అంతర్గత విభేదాల కారణంగా పార్టీకి జరిగే నష్టం వంటి విషయాలతోపాటు ఎవరికి వారుగా ఉంటే ఎదురయ్యే సమస్యలపై అధినేత కేసీఆర్‌ చేసిన సూచనలను వారు కవితకు వివరించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. చర్చల్లో భాగంగా కేసీఆర్‌తోనూ ఫోన్‌లో మాట్లాడించినట్లు విశ్వసనీయ వర్గాలు వివరించాయి. పదవులు, హోదాల విషయంలో తొందరపడవద్దని ఆమెకు కేసీఆర్‌ సూచించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. అయినా, కవిత మెత్తబడలేదని జాగృతి వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రధానంగా రెండు, మూడు అంశాలపై కవిత చాలా పట్టుదలగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని, రాబోయే రోజుల్లో మళ్లీ బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే కేటీఆరే ముఖ్యమంత్రి అవుతారని, అప్పుడు తన సంగతేంటని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కేటీఆర్‌ సీఎం అయితే పార్టీలో గానీ, ప్రభుత్వంలోని గానీ తనకు ఇచ్చే హోదా ఏమిటో ఇప్పుడే స్పష్టత ఇవ్వాలని కవిత పట్టుబట్టినట్లు జాగృతి వర్గాలు వెల్లడించాయి.


ఆ స్పష్టత ముందే ఇవ్వాలని, లేకపోతే, తన దారి తాను చూసుకుంటానని ఆమె కాస్త ఘాటుగా చెప్పినట్లు సమాచారం. మొత్తంగా తాను లెవనెత్తిన పలు అంశాలపై కూడా స్పష్టత కోరినట్లు తెలిసింది. ముఖ్యంగా పార్టీలో తన ప్రాధాన్యం తగ్గించడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దాంతో దామోదర రావు ఆమె నివాసం నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. అనంతరం లీగల్‌సెల్‌ ఇన్‌చార్జి గండ్ర మోహన్‌రావు కవిత నివాసానికి చేరుకున్నారు. ఆయన కూడా జరుగుతున్న పరిణామాలను కవితకు వివరించినట్లు తెలిసింది. ఈ వ్యవహారం కొలిక్కి రాకపోతే మరింత నష్టం జరిగే ప్రమాదం అటు పార్టీకి, ఇటు కుటుంబానికి ఉంటుందని నచ్చజెప్పే ప్రయత్నం చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అలాగే, కేసులపరంగా కూడా కేటీఆర్‌కు ఏమీ కాదని, సాంకేతికంగా అవి కోర్టులలో నిలబడవని కవితతో అన్నట్లు తెలుస్తోంది. గండ్రతో సంప్రదింపులు జరిపిన తర్వాత కూడా కవిత ఏ మాత్రం మెత్తబడలేదని సమాచారం. చివరకు ఆయన కూడా చేసేదేమీ లేక అక్కడి నుంచి వెళ్లిపోయారు. మొత్తంగా పార్టీ అధిష్ఠానం వెంట వెంటనే ఇద్దరు దగ్గరి బంధువులను రంగంలోకి దించినా ప్రయోజనం లేకుండాపోయింది.


Also Read:

సైంటిస్టులు అద్భుత ఆవిష్కరణ.. 'సూపర్-విజన్' లెన్స్‌తో చీకట్లోనూ చూసేయచ్చు..

సన్నగా, బలహీనంగా ఉన్నారా? ఫిట్‌నెస్ మంత్ర ఇదే..

For More Health News and Telugu News..

Updated Date - May 27 , 2025 | 04:57 AM