Share News

N Ramachander Rao: కాంగ్రెస్‌ సర్కారుపై ధర్మయుద్ధం

ABN , Publish Date - Jul 06 , 2025 | 04:11 AM

కాంగ్రెస్‌ పార్టీ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు ఆరోపించారు. రాష్ట్రంలో అవినీతి, అధర్మ పాలన సాగుతోందన్నారు.

N Ramachander Rao: కాంగ్రెస్‌ సర్కారుపై ధర్మయుద్ధం

  • 600 రోజులైనా ఆరు గ్యారంటీల అమలేదీ?

  • సీఎం పదవికి రేవంత్‌ రాజీనామా చేసి బీసీకి

  • ఇస్తే.. నేనూ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తా

  • స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతాం

  • బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు

  • రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతల స్వీకరణ

హైదరాబాద్‌/గన్‌పార్క్‌/చార్మినార్‌, జులై 5 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పార్టీ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు ఆరోపించారు. రాష్ట్రంలో అవినీతి, అధర్మ పాలన సాగుతోందన్నారు. ప్రజలను దగా చేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ధర్మయుద్ధం చేస్తామని ప్రకటించారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నుంచి పార్టీ అధ్యక్ష బాధ్యతలను రాంచందర్‌రావు స్వీకరించారు. అనంతరం అధ్యక్షుడి హోదాలో తొలిసారిగా మీడియా సమావేశంలో మాట్లాడారు. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలో రైతులు, మహిళలు, విద్యార్థులను మభ్యపెడుతూ అనేక హామీలు ఇచ్చిందని, కానీ.. అధికారంలోకి వచ్చాక డబ్బుల్లేవని, ప్రభుత్వం భిక్షాటన స్థితిలో ఉందని, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోతున్నామంటూ ఏడుస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు హామీలు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీల్లో ఏవీ అమలు కాలేదన్నారు. వంద రోజుల్లో అమలు చేస్తామంటూ గొప్పలు చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి 600 రోజులైనా ఒక్క హామీని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదన్నారు. ఏఐసీసీ అంటే.. ఆలిండియా చీటింగ్‌ కమిటీ అని ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, ఏ ప్రభుత్వం కూడా ఇంత తక్కువ సమయంలో ఇంతగా వ్యతిరేకత ఎదుర్కోలేదని అన్నారు. ‘‘ముఖ్యమంత్రి పదవికి రేవంత్‌రెడ్డిని రాజీనామా చేసి.. బీసీ నేతను సీఎంను చేయమనండి. నేను కూడా రాజీనామా చేసి బీసీ నేతను పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకుంటాం’’ అని రాంచందర్‌రావు.. మంత్రి పొన్నం ప్రభాకర్‌కు సవాల్‌ చేశారు. ఇతర సామాజికవర్గం నేతకు ఒక పదవి ఇస్తే బీసీలకు అన్యాయం చేసినట్లు ఎలా అవుతుందని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌లపై కాంగ్రె్‌సకు చిత్తశుద్ధి ఉంటే.. న్యాయనిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుని ఉండేదన్నారు. అసెంబ్లీలో బీసీలకు 42శాతం రిజర్వేషన్‌ బిల్లుకు బీజేపీ మద్దతిచ్చిందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రె్‌సకు రాష్ట్ర ప్రజలు చుక్కలు చూపిస్తారని వ్యాఖ్యానించారు.


బీజేపీకి వంద సీట్లు అని చెప్పబోయి..

వంద ఎమ్మెల్యే సీట్లు, 15 ఎంపీ సీట్లు గెలుస్తామని సీఎం రేవంత్‌రెడ్డి.. ఎన్నికల్లో ఓడిపోయిన ఖర్గే ముందు వాగ్దానం చేశారని రాంచందర్‌రావు ఎద్దేవా చేశారు. వాస్తవానికి ఆ సీట్లను బీజేపీ గెలుస్తుందని చెప్పబోయి కాంగ్రెస్‌ గెలుస్తుందంటూ రేవంత్‌ నోరు జారారని అన్నారు. వంద సీట్లు గెలిచే సత్తా ఉంటే మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిటింగ్‌ సీటును ఎలా కోల్పోయారని ప్రశ్నించారు. గతంలో బీఆర్‌ఎస్‌ కూడా సారు.. కారు.. పదహారు.. అంటూ ఇలాగే ప్రగల్భాలు పలికిందని, కాంగ్రె్‌సకు కూడా అదే గతి పడుతుందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రె్‌సకు ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. రైతుబంధు కింద 15 వేలు ఇస్తామని చెప్పి..ఈ సీజన్‌కు 7500 ఇవ్వకుండా 6 వేలు మాత్రమే ఇచ్చిందని, స్థానిక సంస్థల ఎన్నికలు లేకపోతే ఇవి కూడా ఎగ్గొట్టేదేనని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ బలపడుతోందని గుర్తించి రైతులను తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు. తెలంగాణ రైతాంగానికి అవసరమైన యూరియా కంటే 2లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియాను ఎక్కువగా కేంద్రం ఇచ్చిందని, కానీ.. రాష్ట్ర ప్రభుత్వం రైతులను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు.


మోదీని తిట్టడమే మీ సామాజిక న్యాయమా?

ప్రధాని మోదీని, బీజేపీని, ఆరెస్సె్‌సను తిట్టడమే మీ సామాజిక న్యాయమా? అని రాంచందర్‌రావు ప్రశ్నించారు. ‘‘మీరు పెట్టిన సభ ఏంటి? మాట్లాడిన మాటలేంటి?’’ అని ధ్వజమెత్తారు. ఎమర్జన్సీ తర్వాత సెక్యులరిజం.. సోషలిజం పదాలను 42వ రాజ్యాంగ సవరణలో కాంగ్రెస్సే పెట్టిందని, ఓటుబ్యాంకు రాజకీయాల కోసమే ఈ పనిచేసిందని అన్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే కొన్ని విషయాలు మరచిపోతున్నారని ఎద్దేవా చేశారు. భారత సైన్యాన్ని కాంగ్రెస్‌ అవమానించిందని, ఇందుకు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌ రాజీనామా అంశంపై అధిష్ఠానాన్ని అడిగి చెబుతానని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం, గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసి స్థానిక సంస్థల్లో మెజారిటీ సీట్లు కైవసం చేసుకోవడం తన ప్రాథమ్యాలని తెలిపారు. చంద్రబాబు, కేసీఆర్‌ల సూచన మేరకే పార్టీ నాయకత్వం రాంచందర్‌రావును అధ్యక్షుడిగా నియమించిందంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోందన్న అంశాన్ని ప్రస్తావించగా.. అలా ప్రచారం చేసిన వ్యక్తి మంచి కథా రచయిత అని, ఆయనకుఅవార్డు ఇస్తామని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ముక్త్‌ తెలంగాణే బీజేపీ నినాదమన్నారు.


కార్యకర్తల ఆశీర్వాదంతోనే పదవి..

కార్యకర్తల ఆశీర్వాదంతోనే తనకు అధ్యక్ష పదవి వచ్చిందని రాంచందర్‌రావు అన్నారు. బీజేపీ పాలనలో అవినీతి, అబద్ధాలు ఉండవన్నారు. తెలంగాణను వికసిత రాష్ట్రంగా మార్చేందుకు డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం అవసరమని, త్వరలో రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్థి కోసం మోదీ ప్రభుత్వం రూ.12 లక్షల కోట్ల నిధులు ఇచ్చిందని, దీనిపై చర్చకు కాంగ్రెస్‌ సిద్ధమా? అని సవాల్‌ చేశారు. అంతకుముందు గన్‌పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద రాంచందర్‌రావు నివాళులర్పించారు. చార్మినార్‌లోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని ఆయన దర్శించుకొని పూజలు చేశారు. కాగా, ఎన్నికల సందర్భంగా ప్రకటించిన 6 గ్యారంటీలు, 63 అనుబంధ హామీలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలంటూ సీఎం రేవంత్‌రెడ్డికి రాంచందర్‌రావు లేఖ రాశారు.


ఇవి కూడా చదవండి

తిరుపతికి వెళ్లేందుకు గూగుల్‌ను నమ్మారు.. తీరా చూస్తే

మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ముందుకు: డిప్యూటీ సీఎం భట్టి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 06 , 2025 | 04:11 AM