Share News

N Ramchander Rao: ఎలా హామీ ఇచ్చారో.. అలా అమలు చేయండి

ABN , Publish Date - Jul 22 , 2025 | 03:42 AM

రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు.

N Ramchander Rao: ఎలా హామీ ఇచ్చారో.. అలా అమలు చేయండి

  • కేంద్రంపై నిందలు వేయడం అన్యాయం

  • 42% బీసీ రిజర్వేషన్లు కాంగ్రెస్‌ బాధ్యత

  • 9వ షెడ్యూల్లో చేర్చాలంటే చిక్కులున్నాయ్‌

  • న్యాయ సమీక్ష చేస్తామని సుప్రీం చెప్పింది

  • బిల్లు పెట్టినపుడు 9వ షెడ్యూల్‌ అనలేదే?

  • మధ్యప్రదేశ్‌లో 50% పైగా రిజర్వేషన్లు

  • ఆ దారిలో వెళ్లండి: రాంచందర్‌రావు

  • నేడు అమిత్‌ షా, జేపీ నడ్డాతో భేటీ

న్యూఢిల్లీ, జూలై 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు. బీసీ రిజర్వేషన్లను తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చడానికి న్యాయపరమైన చిక్కులు ఉన్నాయని, అది తెలిసీ బీసీలను తప్పుదోవ పట్టిస్తూ వారి ప్రయోజనాలతో కాంగ్రెస్‌ చెలగాటం ఆడుతోందని మండిపడ్డారు. తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చిన ప్రతీ అంశాన్నీ సమీక్షించే అధికారం తమకు ఉందని సుప్రీంకోర్టు పలుమార్లు చెప్పిన విషయం కాంగ్రెస్‌ మంత్రులకు, న్యాయ సలహా దారులకు తెలియదా? అని ప్రశ్నించారు. తొమ్మిదో షెడ్యూల్‌ను చూపిస్తూ కేంద్రంపై నిందలు వేయకుండా, 42 శాతం రిజర్వేషన్ల హామీని ఏ విధంగా ఇచ్చారో ఆ విధంగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఢిల్లీకి వచ్చిన రాంచందర్‌రావు సోమవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి న్యాయపరమైన చిక్కులను పరిష్కరించినట్లు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తమను నమ్మించిందని చెప్పారు. ఇప్పుడు కొత్తగా తొమ్మిదో షెడ్యూల్‌ ప్రస్తావన చేయడం అనేది ఎన్నికలు పెట్టకుండా ఉండటానికి వేస్తున్న నాటకంగా భావించాల్సి ఉంటుందని అన్నారు. ఈ విధంగా బీసీలను మోసం, దగా చేసినందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. అసెంబ్లీలో బీసీ బిల్లుకు బీజేపీ మద్దతు ఇచ్చిన తర్వాత కేంద్రంపై నిందలు వేయడం అన్యాయమన్నారు. ఆర్డినెన్స్‌ రాకముందే అందులో 10 శాతం ముస్లిం మైనారిటీలకు ఇస్తామంటున్నారని, దానికి తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. బీసీ బిల్లుపై రాష్ట్ర మంత్రివర్గంలో చర్చించినపుడు న్యాయ సలహా తీసుకున్నారా? లేదా? అన్న అనుమానం కలుగుతోందన్నారు. 42 శాతం అంటే, 50 శాతం పరిమితి దాటుతుందని, బీసీ రిజర్వేషన్లు పెంచాలంటే రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్‌ చట్టంలోని సెక్షన్‌ 285ని సవరించాల్సి ఉంటుందని రాంచందర్‌రావు ప్రస్తావించారు. అవన్నీ వదిలేసి, కేంద్రంపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. మధ్యప్రదేశ్‌లోనూ 50 శాతానికి పైగా రిజర్వేషన్లు అమలయ్యాయని, వాళ్లు ఎలా చేశారో అధ్యయనం చేసి, ఆ దారిలో వెళ్లాలని సూచించారు. ఆర్డినెన్స్‌లో ఏం పొందుపరిచారో ప్రజలకు ఎందుకు తెలియజేయలేదు? అని ప్రశ్నించారు.


క్రమశిక్షణ చర్యలు తప్పవు

బీజేపీలో ఎవరైనా క్రమశిక్షణ తప్పినా, పార్టీకి నష్టం చేసేలా వ్యవహరించినా వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని రాంచందర్‌రావు స్పష్టం చేశారు. బండి సంజయ్‌, ఈటల రాజేందర్‌ పరస్పరం చేసుకున్న వ్యాఖ్యలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. అది తమ పార్టీ అంతర్గత వ్యవహారమన్నారు. అంతర్గతంగానే పరిష్కరించుకుంటామని చెప్పారు. పార్టీ కంటే ఎవరూ ఎక్కువ కాదన్నారు. రాత పూర్వకంగా ఫిర్యాదు వస్తే అధిష్ఠానం దృష్టి సారిస్తుందన్నారు. కాంగ్రె్‌సలో రేవంత్‌, రాజగోపాల్‌రెడ్డి మధ్య, బీఆర్‌ఎ్‌సలో కేటీఆర్‌, కవిత మధ్య గొడవలు లేవా? అని ప్రశ్నించారు. బీజేపీలో కొత్త, పాత తేడాల్లేవని, కొంతమంది కావాలని చేస్తున్న ప్రచారమని కొట్టి పారేశారు. పార్టీ నేతలు నితిన్‌ గడ్కరీ, సునీల్‌ బన్సల్‌, అర్వింద్‌ మీనన్‌ కలిశానని, మంగళవారం పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో భేటీ కాబోతున్నట్లు తెలిపారు. రేవంత్‌రెడ్డి 46 సార్లు ఢిల్లీకి వస్తే రాహుల్‌గాంధీ ఒక్కసారి కూడా అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదని, ఇది తెలంగాణ ప్రజలను అవమానపరిచినట్లేనని అన్నారు. రాష్ట్రంలో దారిమళ్లిన యూరియాపై సీఎం రేవంత్‌రెడ్డి విచారణకు ఆదేశించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. డిమాండ్‌ కంటే ఎక్కువ యూరియా కేంద్రం సరఫరా చేసిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు తిన్నారా? దళారుల పాలైందా? అని నిలదీశారు.


బండి సంజయ్‌తో మల్లారెడ్డి కోడలు లంచ్‌

  • బీజేపీ నేత ఇంట్లో ప్రీతిరెడ్డి భోజనం.. బీజేపీ నేతల ఫ్లెక్సీలోనూ ప్రీతిరెడ్డి ఫొటో

  • కమలం పార్టీలో చేరతారని ప్రచారం

హైదరాబాద్‌ సిటీ, జూలై 21 (ఆంధ్రజ్యోతి): బోనాల పండుగ సందర్భంగా ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మేడ్చల్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కోడలు డాక్టర్‌ ప్రీతిరెడ్డి.. కేంద్రమంత్రి బండి సంజయ్‌తో కలిసి భోజనం చేశారు. బీజేపీ భాగ్యనగర్‌ జిల్లా ఉపాధ్యక్షుడు, పాతబస్తీలోని మేకలబండ నల్లపోచమ్మ ఆలయ కమిటీ అధ్యక్షుడు వెంకటరమణ నివాసం ఇందుకు వేదికైంది. వెంకటరమణ ఆహ్వానం మేరకు నల్లపోచమ్మ దేవాలయంలో ప్రీతిరెడ్డి బంగారు బోనం సమర్పించారు. అయితే మధ్యాహ్నం ఆలయానికి వచ్చిన ప్రీతిరెడ్డి.. సాయంత్రం బండి సంజయ్‌ ఆలయ దర్శనానికి వచ్చేంతవరకు అక్కడే ఉన్నారు. అనంతరం కేంద్రమంత్రి, పలువురితో కలిసి భోజనం చేశారు. అంతేకాదు.. బోనాల సందర్భంగా వెంకటరమణ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌షా, నడ్డా, కిషన్‌రెడ్డి, కె.లక్ష్మణ్‌, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్‌.రామచంద్రరరావుతో పాటు ప్రీతిరెడ్డి బోనం ఎత్తుకున్న ఫోటోను ముద్రించడం చర్చనీయాంశంగా మారింది. మల్లారెడ్డి విశ్వ విద్యాపీఠ్‌ వైస్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ప్రీతిరెడ్డి.. బీజేపీలో చేరతారా! అన్న చర్చ మొదలైంది. అయితే ఈ కార్యక్రమానికి ఎటువంటి రాజకీయ ప్రాధాన్యం లేదని ప్రీతిరెడ్డి అంటున్నారు. ఇది కాకతాళీయంగాజరిగిందేనన్నారు.


ఇవి కూడా చదవండి

ఈ వారం రానున్న ఐపీఓలు ఇవే.. ఈసారి ఎన్ని వస్తున్నాయంటే..

ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 22 , 2025 | 03:42 AM