Share News

N Ramchander Rao: పొన్నం లేదా మహేశ్‌గౌడ్‌ను సీఎం చేయాలి!

ABN , Publish Date - Jul 26 , 2025 | 05:27 AM

బీజేపీ సీనియర్‌ నేత, హరియాణా మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయను ఉపరాష్ట్రపతిని చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేయడం సంతోషకరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు అన్నారు.

N Ramchander Rao: పొన్నం లేదా మహేశ్‌గౌడ్‌ను సీఎం చేయాలి!

  • బీసీలపై రేవంత్‌కున్న ప్రేమను చాటుకోవాలి

  • దత్తాత్రేయను ఉపరాష్ట్రపతి చేయాలన్న ముఖ్యమంత్రి డిమాండ్‌ సంతోషకరం

  • రేవంత్‌ తన విమర్శలతో మోదీనే కాదు బీసీలనూ అవమానించారు

  • బండి, ఈటల వివాదం సమసిపోతుంది

  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ముందు మీ నాయకుడిది ఏ కులమో చెప్పు!

  • ప్రధాని మోదీని కన్వర్టెడ్‌ బీసీ అంటావా?

  • సీఎం వ్యాఖ్యలకు కిషన్‌రెడ్డి కౌంటర్‌

హైదరాబాద్‌, జూలై 25 (ఆంధ్రజ్యోతి): బీజేపీ సీనియర్‌ నేత, హరియాణా మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయను ఉపరాష్ట్రపతిని చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేయడం సంతోషకరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు అన్నారు. అదేసమయంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ లేదా టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ను ముఖ్యమంత్రిని చేసి.. బీసీల పట్ల తనకున్న ప్రేమను రేవంత్‌ చాటుకోవాలని సూచించారు. రేవంత్‌రెడ్డికి ‘ఆస్కార్‌’ కాదు.. ‘భాస్కర్‌ ’ అవార్డు ఇవ్వాలని వ్యంగ్యంగా అన్నారు. ప్రధాని మోదీ కన్వర్టెడ్‌ బీసీ అంటూ ప్రచారం చేస్తున్నందుకు ఆయనకు గోబెల్స్‌ బహుమతి ఇవ్వాలని పేర్కొన్నారు. దీనిపై తాము సోనియాకు లేఖ రాస్తామని తెలిపారు. రేవంత్‌ తన విమర్శల ద్వారా మోదీనే కాదని, బీసీలందరినీ అవమానించారని ధ్వజమెత్తారు. బీజేపీని బీసీలకు దూరం చేసేందుకు కుట్ర జరుగుతోందని రాంచందర్‌రావు అన్నారు. తాను కూడా బీసీ (బ్రాహ్మణ కమ్యూనిటీ)నే అని చమత్కరించారు.


బ్రాహ్మణుడినని చెప్పుకొన్న రాహుల్‌కు గాయత్రీ మంత్రం వచ్చా? సంధ్యావందనం చేస్తారా? అని రేవంత్‌ను ప్రశ్నించారు. కులగణన చేసిన కాంగ్రెస్‌ సర్కారు.. అన్ని కులాల వివరాలను ఎందుకు వెల్లడించడం లేదని నిలదీశారు. శుక్రవారమిక్కడి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాంచందర్‌రావు మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. కేంద్ర మంత్రి బండి సంజయ్‌, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ మధ్య తలెత్తిన వివాదం సమసిపోతుందని చెప్పారు. అన్ని పార్టీల్లోనూ ఇలాంటివి సహజమన్న ఆయన.. తమ పార్టీలో ఇలాంటివి బహిరంగంగా జరిగి ఉండాల్సింది కాదని అభిప్రాయపడ్డారు. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించాలని రాంచందర్‌రావు సీఎం రేవంత్‌ను డిమాండ్‌ చేశారు. హైడ్రా ఒక విఫల సంస్థ అని విమర్శించారు. పరువు నష్టం కేసుకు సంబంధించి తాను ఇచ్చిన నోటీసుకు డిప్యూటీ సీఎం భట్టి సమాధానం ఇవ్వలేదని, తదుపరి చర్యగా హైకోర్టును ఆశ్రయిస్తానని చెప్పారు.


మేం బీసీలకు 42 శాతం పదవులిస్తాం

కాంగ్రెస్‌ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ అమలు చేయకున్నా తాము మాత్రం పార్టీలో బీసీలకు 42 శాతం పదవులు ఇస్తామని రాంచందర్‌రావు స్పష్టం చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. మతపరమైన రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమన్నారు. కేవలం బీసీలకే 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే ప్రభుత్వానికి మద్దతిస్తామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని రాంచందర్‌రావు ప్రకటించారు. క్షేత్రస్థాయిలో పర్యటించాలని, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తనకు నిర్దేశించారని తెలిపారు. శని, ఆదివారాల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో, ఆ తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటిస్తానని చెప్పారు. బీజేపీ రాష్ట్ర కమిటీని వారంలోగా ప్రకటిస్తామని రాంచందర్‌రావు తెలిపారు. తనతో కలిపి 20 మంది సభ్యులు ఉంటారన్నారు. ఈ కమిటీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ అమలు చేస్తామన్నారు. కాగా, రాష్ట్రంలో జరిగే ఏ ఎన్నికలోనైనా బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని రాంచందర్‌రావు ప్రకటించారు. ఏ పార్టీతోనూ పొత్తు ఉండబోదని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్‌ ఎన్నికను సవాలుగా తీసుకుంటున్నట్లు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నా జోలికొస్తే అడ్డంగా నరికేస్తా..

బాలికపై అత్యాచారం.. గర్భం దాల్చిందని బతికుండగానే..

For Telangana News And Telugu News

Updated Date - Jul 26 , 2025 | 05:27 AM