Bhatti Vikramarka: హరీశ్‌రావు కాదు.. కాళేశ్వర్ రావు!
ABN , Publish Date - Sep 01 , 2025 | 03:43 AM
కాళేశ్వరం ప్రాజెక్టును ఆయనే ముందుండి నిర్మింపజేశారని అప్పటి ప్రభుత్వ పెద్దలు హరీశ్‌రావుకు ‘కాళేశ్వర్‌రావు’ అనే పేరు పెట్టారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులాగే కుంగిపోతూ నిటారుగా నిలబడలేకపోతున్నారు: భట్టి విక్రమార్క
హైదరాబాద్, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టును ఆయనే ముందుండి నిర్మింపజేశారని అప్పటి ప్రభుత్వ పెద్దలు హరీశ్‌రావుకు ‘కాళేశ్వర్‌రావు’ అనే పేరు పెట్టారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఇప్పుడు జస్టిస్ ఘోష్ నివేదికను చూశాక హరీశ్‌రావు ఆ కాళేశ్వరం ప్రాజెక్టులాగే కుంగిపోతూ.. కూలిపోతూ.. నిటారుగా నిలబడలేక.. వాస్తవాలు చెప్పలేక ఇ్బబంది పడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆదివారం అసెంబ్లీలో భట్టి మాట్లాడుతూ ‘‘హరీశ్‌రావు రాష్ట్ర ప్రజలను పక్కదోవ పట్టించాలని చూస్తున్నారు. సభలో ఎప్పుడు చర్చ జరిగినా ఆయన వాస్తవాలు మాట్లాడరు. తప్పుడు కాగితాలు సృష్టిస్తారు. ఏ అంశం తీసుకున్నా అది తప్ప మిగతావి మాట్లాడతార’ని విమర్శించారు. వంద సంవత్సరాల క్రితం నిర్మించిన నిజాంసాగర్, పోచారం వంటి ప్రాజెక్టులు భారీ వరదలను తట్టుకొని నిలబడ్డాయి కానీ లక్షన్నర కోట్లు వెచ్చించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఒక్క ఎకరాకు నీరు ఇవ్వకుండానే కుంగిపోయిందన్నారు. ‘‘ఈ దోపిడీపై జ్యుడిషియల్ కమిషన్ రిపోర్టును చెత్త రిపోర్టు అంటారు. మరి మీరు దేనికి ఒప్పుకుంటారు హరీశ్‌రావు గారూ? మీరంతా అతీతులా, దైవాంశసంభూతులా? తప్పు చేయకపోతే ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టుకు ఎందుకు వెళ్లారు?’’అని ప్రశ్నించారు.
తుమ్మిడిహట్టి వద్దే ప్రాజెక్టు నిర్మిస్తే దోపిడీ చేయడానికి వీలుండదని కాళేశ్వరాన్ని ముందుకు తెచ్చారని ఆరోపించారు. ఎత్తిపోసిన నీళ్ల కంటే కిందికి వదిలినవే ఎక్కువని, కాళేశ్వరం ద్వారా నీళ్లు ఎత్తిపోయడానికి విద్యుత్ బిల్లులు రూ.12 వేల కోట్లు అయ్యాయన్నారు. ‘‘కేసీఆర్ చెప్పారు.. హరీశ్‌రావు కట్టారు. మేం ఇందిరమ్మ ఇల్లు కట్టాలన్నా ఇంజనీరు సలహా తీసుకుంటాం. కానీ లక్షన్నర కోట్లు వెచ్చించిన ప్రాజెక్టు ఇంజనీర్లు ఇచ్చిన డిజైన్‌ను హరీశ్‌రావు పెద్ద ఇంజనీరులాగా మార్చేసి కట్టడం వల్లే ఈ ప్రమాదం ముంచుకొచ్చింది’’అని మండిపడ్డారు. ఘోష్ కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెడితే తలెత్తుకోలేమని బీఆర్‌ఎస్ నేతలు కోర్టుకు వెళ్లారన్నారు. బీఆర్‌ఎస్ నేతలు కృష్ణా, గోదావరిపై ఏ ప్రాజెక్టునూ వదల్లేదని, చీల్చిచెండాడారని వ్యాఖ్యానించారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏం చేయాలో నిర్ణయం తీసుకునేందుకు సభలో ఘోష్ కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టాం.. చర్చించాం. ఏం చేద్దామని రాష్ట్ర ప్రజలను అడుగుతున్నామ’’ని భట్టి పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ నేతలు జస్టిస్ ఘోష్‌పై అభాండాలు వేయడం తగదన్నారు. మాజీ సీఎం కేసీఆర్ సభకు వచ్చి సమాధానం చెబితే బాగుండేదని సూచించారు. పదేళ్లు తమకు మైక్ ఇవ్వకపోయినా అడిగి అడిగి అలిసిపోయామే తప్ప సభను వదిలిపెట్టి ఏనాడూ పోలేదన్నారు. కేవలం ఐదుగురు సభ్యులం పదేళ్ల పాటు పోరాటం చేశామని గుర్తుచేశారు.
ఇవి కూడా చదవండి
లిక్కర్ కేసులో మాజీ సీఎం జైలుకు పోవటం ఖాయం.. గోనె ప్రకాష్ రావు సంచలన ప్రెస్‌మీట్
మహా గణపతి దర్శనం కోసం తరలివస్తున్న లక్షలాది మంది భక్తులు..