Bhatti Vikramarka: అనర్హులకు పథకాలు అందితే అధికారులదే బాధ్యత
ABN , Publish Date - Jan 14 , 2025 | 03:34 AM
సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక పూర్తిగా పారదర్శకంగా ఉండాలని, అనర్హులను ఎంపిక చేస్తే అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హెచ్చరించారు.

లబ్ధిదారుల ఎంపిక గ్రామసభల్లోనే.. జాబితాను కూడా అక్కడే ప్రకటించాలి
ఉపాధి కార్డు ఉండి ఏడాదిలో 20రోజులు పనిచేస్తే ఆత్మీయ భరోసా
26 నుంచి ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా: భట్టి
ఖమ్మం, జనవరి 13 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక పూర్తిగా పారదర్శకంగా ఉండాలని, అనర్హులను ఎంపిక చేస్తే అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హెచ్చరించారు. గ్రామసభల్లోనే లబ్ధిదారులను ఎంపిక చేయాలని, ఇందులో ఇందిరమ్మ కమిటీలను భాగస్వామ్యం కల్పించాలని ఆదేశించారు. లబ్ధిదారుల జాబితాను గ్రామసభల్లోనే ప్రకటించాలన్నారు. ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాను జిల్లా మంత్రితో ఆమోదింపజేసుకొని, మంజూరు కోసం ప్రభుత్వానికి నివేదించాలన్నారు. ప్రభుత్వ పథకాలు పొందిన లబ్ధిదారుల వివరాలతో గ్రామాల్లో ఫ్లెక్సిలు ఏర్పాటు చేయాలని సూచించారు. సోమవారం మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితీశ్ పాటిల్‌లతో కలిసి భట్టి విక్రమార్క.. రాష్ట్రంలో కొత్తగా ప్రారంభించబోయే సంక్షేమ పథకాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి హామీ జాబ్‌కార్డ్ ఉండి, భూమి లేని వ్యవసాయ కుటుంబాలు ఏడాదిలో 20రోజులు ఉపాధి హామీ పని చేసి ఉంటే.. వారికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఏటా రూ.12వేలు అందజేస్తామన్నారు. జనవరి 26 నుంచి కొత్తరేషన్ కార్డులను అందజేస్తామని, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ప్రారంభిస్తామని తెలిపారు. ఈ పథకాలకు రూ.45వేల కోట్లకు పైగా ఖర్చు చేయనున్నట్లు వివరించారు.
ఈ ఏడాది 4.50లక్షల ఇందిరమ్మ ఇళ్లు
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. అధికారులు వ్యవసాయ యోగ్యం కాని భూములకు ఎక్కడా పెట్టుబడి సాయం చేరకుండా చూడాలన్నారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ప్రతి అర్హుడికి రైతు భరోసా అందాలన్నారు. వ్యవసాయ యోగ్యమైన ప్రతీ ఎకరాకు ఏటా రూ.12వేల ఆర్థిక సహాయాన్ని ‘రైతు భరోసా’ కింద అందించనున్నామని, పంట వేసినా, వేయకపోయినా ఈ భూములకు రైతుభరోసా అందుతుందని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఈ ఏడాది 4.50లక్షల ఇళ్లు మంజూరు చేస్తామని, రాబోయే నాలుగేళ్లలో మొత్తం 20లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి పొంగులేటి చెప్పారు. లబ్ధిదారుల ఎంపికలో సిఫార్సులకు, ప్రలోభాలకు లొంగవద్దని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అధికారులకు సూచించారు.
ఇందిరమ్మ ఇళ్లకు గ్రీన్ చానల్ ద్వారా బిల్లులు
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా క్రమశిక్షణ పాటిస్తూ.. ఇచ్చిన హామీ మేరకు మొదటి ఏడాదిలోనే 4.50లక్షల ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 3,500 ఇళ్లకు తగ్గకుండా మంజూరు చేస్తామన్నారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి గ్రీన్‌ఛానల్ ద్వారా పెండింగ్ లేకుండా బిల్లులు చెల్లిస్తామన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచిలో ఇందిరమ్మ మోడల్‌హౌ్‌సను ఎంపీ రఘురాంరెడ్డి, అదనపు కలెక్టర్ శ్రీజతో కలిసి మంత్రి ప్రారంభించారు. మరోవైపు, ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం మంచుకొండలో రూ.66.33 కోట్లతో చేపట్టిన మంచుకొండ ఎత్తిపోతల పథకానికి తుమ్మల, పొంగులేటి. ఉత్తమ్, కోమటిరెడ్డితో కలిసి భట్టి విక్రమార్క సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో భట్టి మాట్లాడుతూ.. జిల్లాల విభజన తర్వాత పరిశ్రమలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లావైపు వెళ్లాయని, అందువల్లే ఖమ్మం జిల్లాలో పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు కృషి చేస్తామని చెప్పారు. మంచుకొండ ఎత్తిపోతల పథకాన్ని ఉగాది నాటికి పూర్తిచేసి రైతులకు నీరివ్వాలన్నదే తన లక్ష్యమని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
ఒక్కొక్కరికి 6కిలోల సన్నబియ్యం
రేషన్ కార్డులో పేర్లున్న ఒక్కొక్కరికీ 6కిలోల సన్నబియ్యాన్ని ఇవ్వనున్నట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఇందుకు రూ.12వేల కోట్ల వరకు ప్రభుత్వంపై భారం పడుతుందన్నారు. కొత్త రేషన్‌కార్డుల జారీ అంశంలో అధికారులు మానవతా దృక్పథంతో పని చేయాలన్నారు. సమీక్ష సమావేశంలో ఎంపీ రఘురాంరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను విజయవంతంగా అమలు చేసేందుకు సమాచార సేకరణ చాలా కీలకమని, అధికారులు వివరాలు సరిగ్గా నమోదు చేస్తేనే ఈ కార్యక్రమాలు విజయవంతమవుతాయని అన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న బ్యాంకుల్లో గిరిజనేతరులకు రుణాలు కూడా అందడం లేదని, దీనిని పరిష్కరించాలని ఎంపీ బలరాం నాయక్ కోరారు.