Telangana Jagruthi: బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ కుట్ర.. తెలంగాణ జాగృతి
ABN , Publish Date - Sep 23 , 2025 | 10:03 AM
తెలంగాణ బీసీల హక్కుల కోసం తెలంగాణ జాగృతి ప్రారంభం నుంచి కృషి చేస్తోందని, రిజర్వేషన్ల పెంపు లక్ష్యంగా ముందుకు సాగుతోందని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఈ క్రమంలో బీసీల రిజర్వేషన్ల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన సర్వే వివరాలను దాచిపెట్టి, బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు కుట్రలు పన్నుతోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఇది దేశంలోని బడుగు బలహీన వర్గాలకు జరిగే మోసం లాంటిదని, తమకు అనుకూలమైన చోట్ల మాత్రమే రిజర్వేషన్లు పెట్టి, రాజకీయ లాభాలు పొందాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల తేదీలు ప్రకటించే ముందు, కులగణన వివరాలను బహిరంగం చేసి, ప్రభుత్వం తన చిత్తశుద్ధిని కాపాడుకోవాలన్నారు.
హడావుడిగా ఎన్నికలు జరిపి, ప్రయోజనం పొందాలని చూస్తే, అది బీసీలకు చేసే అన్యాయం చేసినట్లే అవుతుందని కవిత గుర్తు చేశారు. గ్రామ పంచాయతీల వారీగా కుల గణన వివరాలు వెల్లడించాలని, ఎలాంటి దాపరికాలు లేకుండా, న్యాయంగా రిజర్వేషన్లు పెంచాలన్నారు. ఇలాంటి అన్యాయాలపై మొదటి నుంచి తెలంగాణ జాగృతి పోరాడుతున్నట్లు చెప్పారు. బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్న తాము, దానిని సాధించే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు.
ప్రభుత్వం బీసీల హక్కులను కాపాడాలని, రాజకీయ కుట్రలతో జనాన్ని మోసం చేయకూడదని కవిత సూచించారు. ఇలాంటి సమయంలో తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, న్యాయం కోసం ప్రశ్నించాలని కోరారు. ఇది కేవలం రిజర్వేషన్ల సమస్య కాదని, సమానత్వం, న్యాయం గురించి పోరాటమని పేర్కొన్నారు. తెలంగాణ జాగృతి ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తుందని, బీసీలు ఏకమై, అన్యాయాన్ని ఎదిరించాలన్నారు. ఇలాంటి ఎన్ని కుట్రలు పన్నినా విఫలమవుతాయని, చివరకు న్యాయం గెలుస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి