RBI Will Cut: ఆర్బీఐ రెపో రేటును మరో 25 బేసిస్ పాయింట్లు తగ్గించవచ్చు..ఎస్బీఐ రీసెర్చ్
ABN , Publish Date - Sep 23 , 2025 | 09:27 AM
దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపించే కీలక భేటీ సమయం రానే వచ్చింది. సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 1 వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) MPC సమావేశం జరగనుంది. ఈ సమీక్షలో రెపో రేటు మళ్లీ తగ్గించవచ్చనే చర్చలు మొదలయ్యాయి.
ఈ ఏడాది సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కలిసి ఊరట కలిగించే నిర్ణయాలు ప్రకటించాయి. 12 లక్షల రూపాయల వార్షిక ఆదాయంపై ఇన్‌కమ్ ట్యాక్స్ రిబేట్, రోజువారీ వస్తువులపై జీఎస్టీ తగ్గింపు..రెపో రేటు తగ్గించడంతో ఈఎంఐలు తక్కువ అయ్యాయి. ఇప్పుడు ఆర్బీఐ రేట్ ప్యానెల్ మానిటరీ పాలసీ కమిటీ (MPC) సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 1 వరకు మరోసారి సమావేశం కానుంది. ఈ సమావేశంలో రెపో రేటును మరో 25 బేసిస్ పాయింట్లు (BPS) తగ్గిస్తారా అనే చర్చ జోరుగా సాగుతోంది.
ఇప్పటివరకు ఏం జరిగింది?
ఈ రేట్ కట్ సైకిల్‌లో ఆర్బీఐ ఇప్పటికే మూడు సార్లు రెపో రేటును తగ్గించింది. ఫిబ్రవరి, ఏప్రిల్లో 25 బీపీఎస్ చొప్పున, జూన్‌లో 50 బీపీఎస్ తగ్గించింది. కానీ ఆగస్టు 2025లో జరిగిన పాలసీలో రెపో రేటును 5.5% వద్ద మార్పు లేకుండా ఉంచారు. న్యూట్రల్ స్టాన్స్‌తో ఉంచగా, ఇప్పుడు సెప్టెంబర్ 2025 పాలసీలో ఆర్బీఐ మరో 25 బీపీఎస్ తగ్గించవచ్చని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రీసెర్చ్ రిపోర్ట్ అంచనా వేస్తోంది.
రేట్ కట్‌లకు
ఎస్బీఐ రిపోర్ట్ ఏం చెప్తోందంటే సెంట్రల్ బ్యాంక్ కమ్యూనికేషన్ అనేది ఒక పాలసీ టూల్ లాంటిది. సెప్టెంబర్‌లో కూడా రెపో రేటు తగ్గించకపోతే అది ఒక రకమైన తప్పిదం (టైప్ 2 ఎర్రర్) అవుతుంది. అందుకే 25 బీపీఎస్ తగ్గింపు ఈ సమయంలో మంచి నిర్ణయమని తెలిపింది. జూన్ తర్వాత రేట్ కట్‌లకు అవసరమైన ప్రమాణాలు కొంచెం కఠినంగా మారాయని, అందుకే ఆర్బీఐ ఈ నిర్ణయాన్ని చాలా జాగ్రత్తగా కమ్యూనికేట్ చేయాలని రిపోర్ట్ సూచిస్తోంది. ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉండటంతో రెపో రేటు తగ్గించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ద్రవ్యోల్బణం ఎలా ఉంది?
ఎస్బీఐ రిపోర్ట్ ప్రకారం ద్రవ్యోల్బణం (ఇన్‌ఫ్లేషన్) 2027 ఆర్థిక సంవత్సరంలో కూడా నియంత్రణలో ఉంటుందని అంచనా. జీఎస్టీ తగ్గింపు లేకపోయినా, సెప్టెంబర్, అక్టోబర్‌లలో ద్రవ్యోల్బణం 2% కంటే తక్కువగా ఉంది. 2027 ఆర్థిక సంవత్సరంలో సీపీఐ (కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్) ద్రవ్యోల్బణం సగటున 4% లేదా అంతకంటే తక్కువగా ఉంటుందని అంచనా. జీఎస్టీ రేట్ల రీస్ట్రక్చరింగ్‌తో అక్టోబర్ సీపీఐ 1.1%కి పడిపోవచ్చు. ఇది 2004 తర్వాత అతి తక్కువ స్థాయి అవుతుంది.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి