Share News

BC population: తెలంగాణ బీసీల్లో ముదిరాజ్‌లే టాప్‌!

ABN , Publish Date - Feb 09 , 2025 | 03:10 AM

తెలంగాణలోని బీసీ జనాభాలో ముదిరాజ్‌లు సంఖ్యాపరంగా అగ్రస్థానంలో ఉన్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. రాష్ట్రంలో ముస్లిమేతర బీసీ జనాభా 46.25 శాతం ఉన్నట్టు ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వేలో తేలింది.

BC population: తెలంగాణ బీసీల్లో ముదిరాజ్‌లే టాప్‌!

  • జనాభా పరంగా అగ్రస్థానం

  • తర్వాతి స్థానాల్లో యాదవ, గౌడ, మున్నూరు కాపు, పద్మశాలీలు

  • కులగణన నివేదిక తేల్చిన లెక్క!

  • అగ్రకులాల్లో రెడ్లదే అగ్ర తాంబూలం

హైదరాబాద్‌, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): తెలంగాణలోని బీసీ జనాభాలో ముదిరాజ్‌లు సంఖ్యాపరంగా అగ్రస్థానంలో ఉన్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. రాష్ట్రంలో ముస్లిమేతర బీసీ జనాభా 46.25 శాతం ఉన్నట్టు ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వేలో తేలింది. ఇందులో 24.9శాతం మంది అంటే సగానికిపైగా జనాభా ఐదు సామాజిక వర్గాలకు చెందిన వారు ఉన్నారు. ఆ ఐదింటిలో ముదిరాజ్‌ వర్గానికి చెందిన వారు సంఖ్యాపరంగా అగ్రస్థానంలో ఉండగా యాదవ, గౌడ, మున్నూరు కాపు, పద్మశాలీ సామాజిక వర్గాల వారు తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఈ ఐదు సామాజిక వర్గాల జనాభా రాష్ట్ర జనాభాలో 24.9 శాతం మేర ఉన్నట్టు సమాచారం. ఈ లెక్క ప్రకారం ముస్లిమేతర బీసీల్లో ఈ ఐదు సామాజిక వర్గాలను మినహాయిస్తే బీసీ జనాభా 21.35 శాతమే. 2014లో అప్పటి ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే లెక్కలతో పోలిస్తే ఈ ఐదు సామాజిక వర్గాల జనాభా 2 శాతానికి పైగా పెరిగినట్లు కులగణన సర్వేలో తేలినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఐదు సామాజిక వర్గాల జనాభా సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్ర జనాభాలో 22.5 శాతంగా ఉంటే.. పదేళ్ల తర్వాత జరిగిన కులగణన సర్వే ప్రకారం 24.9 శాతంగా నమోదైంది. అంటే పదేళ్లలో ఈ ఐదు సమాజిక వర్గాల జనాభా 2.4 శాతం పెరిగింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం కులగణన సర్వే ఆధారంగా ఈ ఐదు సామాజిక వర్గాల జనాభా వివరాలు ఇవి.


రాష్ట్ర జనాభాలో ముదిరాజ్‌లది 7.3%

కులగణన సర్వేలో ముదిరాజ్‌లు, ముతరాసీలు, తెనుగోళ్లను ఒక కేటగిరీలో లెక్కించారు. దీంతో వీరి సంఖ్య 26.36 లక్షలుగా తేలింది. ఇది రాష్ట్ర జనాభాలో 7.43 శాతం. యాదవ సామాజిక వర్గానికి చెందిన వారు 20.17 లక్షల మంది ఉండగా జనాభాలో వీరి వాటా 5.69ు. గౌడ సామాజిక వర్గం(ఈడిగ, గౌడ, కలలి, గౌండ, శ్రీసయన) జనాభా 16.27 లక్షలు కాగా జనాభాలో వీరు 4.59 శాతంగా ఉన్నారు. మున్నూరు కాపు సామాజిక వర్గం జనాభా 13.71 లక్షల మంది కాగా.. రాష్ట్ర జనాభాలో వీరు 3.87 శాతంగా ఉన్నారు. ఇక పద్మశాలీలు(సాలి, శాలివాన్‌, పట్టుశాలి, సేనాపతులు, తొగుటశాలీ) 11.79 లక్షల మంది ఉంటే రాష్ట్ర జనాభాలో వీరు 3.32 శాతంగా ఉన్నారు. 2014 సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభాలో ముదిరాజ్‌లు 6 శాతం, యాదవులు 5.4, గౌడలు 4.3, మున్నూరు కాపులు 3.5, పద్మశాలీలు 3.3 శాతం మంది ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.


రెడ్లు 17.06 లక్షల మంది

రాష్ట్రంలో రాజకీయంగా అత్యంత ప్రభావం చూపుతున్న రెడ్డి సామాజిక వర్గం జనాభా 17.06 లక్షలుగా ఉంది. రాష్ట్ర జనాభాలో వీరు 4.81 శాతంగా ఉన్నారు. 2014 సర్వేతో పోలిస్తే రెడ్డి సామాజిక వర్గం జనాభా 0.5 శాతం మేర పెరిగింది. ముస్లిమేతర అగ్రకులాల జనాభా 13.31 శాతంగా ఉంటే.. రెడ్డి సామాజిక వర్గాన్ని మినహాయించి.. బ్రాహ్మణ, కమ్మ, వెలమ, కోమటి తదితర అగ్రకులాలన్నీ కలిపి 8.50 శాతంగా ఉన్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి

MLC Kavitha: కాంగ్రెస్‌ ఆరోపణల్లో నిజం లేదు.. కేసీఆర్ ఎంతో కష్టపడ్డారు

Nandamuri Balakrishna: నాన్న ఆశీర్వాదం వల్లే పద్మ భూషణ్: బాలకృష్ణ

Supreme Court: ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్‌.. సుప్రీం కీలక వ్యాఖ్యలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 09 , 2025 | 03:10 AM