Bandi Sanjay: మోదీ, రాహుల్ కులంపై.. రెఫరెండానికి సిద్ధమా?
ABN , Publish Date - Feb 16 , 2025 | 03:36 AM
‘ప్రధాని మోదీ బీసీకనా..? కాదా..? రాహుల్ గాంధీ కులం, మతం, దేశం ఏంటి..? ఈ రెండు అంశాలపై రెఫరెండాన్ని కోరుతూ ఎమ్మెల్సీ ఎన్నికలకు వెళదామా..?’ అని కేంద్ర మంత్రి బండి సంజయ్.. సీఎం రేవంత్‌రెడ్డికి సవాల్ చేశారు.
అదే ఎజెండాగా ఎమ్మెల్సీ ఎన్నికలకు వెళదామా.. సీఎంకు బండి సవాల్
రాహుల్ గాంధీకి మతం, జాతి, దేశం లేదంటూ నిప్పులు
హైదరాబాద్, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): ‘ప్రధాని మోదీ బీసీకనా..? కాదా..? రాహుల్ గాంధీ కులం, మతం, దేశం ఏంటి..? ఈ రెండు అంశాలపై రెఫరెండాన్ని కోరుతూ ఎమ్మెల్సీ ఎన్నికలకు వెళదామా..?’ అని కేంద్ర మంత్రి బండి సంజయ్.. సీఎం రేవంత్‌రెడ్డికి సవాల్ చేశారు. ‘రాహుల్ కులం, మతం, దేశం ఏంటి..?’ రేవంత్ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. రాహుల్‌కు కులం, మతం, జాతి, దేశం లేదంటూ సంజయ్ నిప్పులు చెరిగారు. మోదీని బీసీ అని దేశం గుర్తించిందని, రాహుల్ కుటుంబంపై చర్చ జరగాలన్నారు. రాహుల్ తాత ఫిరోజ్‌ఖాన్.. తల్లి క్రిస్టియన్, ఇటలీ దేశస్ధురాలని పేర్కొన్నారు. కుల గణన తప్పుల తడక అని, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండటంతోనే సీఎం రేవంత్, మోదీ కులంపై అవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. బేగంపేటలోని టూరిజం ప్లాజాలో సంజయ్ శనివారం, మీడియాతో మాట్లాడారు. 1994లో గుజరాత్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమే మోదీ కులాన్ని బీసీ జాబితాలో చేర్చిందని సంజయ్ గుర్తుచేశారు. రాష్ట్రంలో 10శాతం ఉన్న ముస్లింలను బీసీల్లో చేర్చితే ఒప్పుకోబోమని స్పష్టం చేశారు. అదే జరిగితే స్థానిక ఎన్నికల్లో బీసీల స్థానాల్లో ముస్లింలే గెలుస్తారని, వారిదే రాజ్యమవుతుందని చెప్పారు. ఒకే కులానికి జిల్లా అధ్యక్ష పదవులు ఎక్కువ ఇచ్చారంటూ రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు సరికాదని సంజయ్ అన్నారు.
మార్చిలోపు ఎనిమీ ఆస్తుల లెక్క తేల్చండి..
తెలంగాణలో కస్టోడియన్ ప్రాపర్టీ ఆఫ్ ఇండియా(సెపీ) సంరక్షణలో ఉన్న ఆస్తులను మార్చి నెలాఖరులోపు క్షేత్రస్థాయి పరిశీలన చేసి లెక్కతేల్చాలని కేంద్ర, రాష్ట్ర అధికారులను బండి సంజయ్ ఆదేశించారు. శనివారం ఆయన టూరిజం ప్లాజాలో హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, కొత్తగూడెం జిల్లాల్లోని ఎనిమీ ప్రాపర్టీ్‌సపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడారు. ఏళ్ల తరబడి పొజిషన్‌లో ఉన్న రైతులకు అన్యాయం జరక్కుండా చూడాలని చెప్పారు. తెలంగాణలో రూ.10వేల కోట్ల విలువైన ఎనిమీ ప్రాపర్టీస్ ఉన్నట్లు గుర్తించామని సంజయ్ తెలిపారు. ‘పాకిస్తాన్‌తో యుద్ధం సందర్భంగా ఇక్కడి వాళ్లు కొంతమంది తమ ఆస్తులను వదలిపెట్టి పాకిస్తాన్‌కు వెళ్లారు. అలాగే, పాకిస్తాన్ వాసులు ఇక్కడికి వచ్చారు. ఒప్పందం ప్రకారం, వీరి ఆస్తులను ఆయా దేశాలు రక్షించాల్సి ఉంటుంది. అయితే, దీనిని పాక్ ఉల్లంఘించింది. అందుకే, మన దేశంలోని ఎనిమీ ప్రాపర్టీ్‌సను విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది’ అని సంజయ్ వివరించారు. ఇందులో భాగంగా తెలంగాణలోని ఎనిమీ ప్రాపర్టీ్‌సపై మార్చి నెలాఖరులోపు సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. కాగా, త్వరలోనే హైదరాబాద్‌లో సెపీ అనుబంధ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని సమావేశం నిర్ణయించింది. కాగా, బండి సంజయ్‌ని టీఎన్జీవో నాయకులు టూరిజం ప్లాజాలో సన్మానించారు. ఆదాయ పన్ను మినహాయింపును పెంచడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు.