Chandanagar: 'ఖజానా'లో కాల్పులు
ABN , Publish Date - Aug 13 , 2025 | 03:38 AM
రాజధాని హైదరాబాద్ మహానగరంలో పట్టపగలే దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. చందానగర్‌లోని ఖజానా జువెలరీలో భీభత్సం సృష్టించారు.
హైదరాబాద్‌లోని చందానగర్‌లో పట్టపగలే దోపిడీ
ఖజానా జువెలరీ తెరవగానే లోపలికి దొంగల చొరబాటు
లాకర్, గల్లాపెట్టె తాళాలు ఇవ్వాలంటూ రివాల్వర్ చూపి
బెదిరింపులు.. ఇవ్వనందుకు సిబ్బందిపై కాల్పులు
వెండి ఆభరణాలను దోచుకుని పరారైన దుండగులు
12 ప్రత్యేక బృందాలతో గాలింపు: సీపీ అవినాశ్‌మహంతి
హైదరాబాద్ సిటీ/చందానగర్, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): రాజధాని హైదరాబాద్ మహానగరంలో పట్టపగలే దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. చందానగర్‌లోని ఖజానా జువెలరీలో భీభత్సం సృష్టించారు. దుకాణం తెరిచిన కొద్దిసేపటికే.. చేతిలో పిస్తోళ్లతో లోపలికి దూసుకొచ్చి.. సిబ్బందిపై రెండు రౌండ్ల కాల్పులు జరిపి.. చేతికి దొరికిన వెండి ఆభరణాలతో ఉడాయించారు. వారి కాల్పుల్లో దుకాణం సిబ్బందిలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చందానగర్ జాతీయ రహదారి పక్కన ఉన్న ఖజానా జువెలరీ దుకాణాన్ని ఎప్పట్లాగానే మంగళవారం ఉదయం 10.30 గంటలకు తెరిచారు. ఆ తర్వాత ఐదు నిమిషాలకే ద్విచక్రవాహనాలపై 10 మంది అక్కడికి వచ్చారు. వారిలో నలుగురు బయటే ఉండగా.. ఆరుగురు చేతిలో తుపాకులతో వేగంగా లోపలికి వెళ్లారు. లాకర్ తాళాలు ఇవ్వాలని సిబ్బందిని అడిగారు. తమవద్ద లేవని వారు చెప్పడంతో.. ‘తాళాలు ఇస్తారా? చస్తారా?’ అంటూ తమ తుపాకులను చూపించి పెద్దగా అరుస్తూ బెదిరించారు. తాళాలు ఇవ్వనందుకు.. దుకాణం డిప్యూటీ మేనేజర్ సతీష్ కాలుకు గురిపెట్టి కాల్చారు. దీంతో ఆయన అక్కడే పడిపోయారు. అనంతరం దుండగులు అక్కడే ఉన్న అప్రైజర్ ధనంజయ్‌ను.. గల్లా పెట్టె తాళాలు ఇవ్వాలని అడిగారు. ఆ తాళాలు తనవద్ద లేవని అతడు చెప్పడంతో.. అతడి ముఖంపై కొట్టి.. అక్కడే ఉన్న వెండి ఆభరణాలను తమ వెంట తెచ్చుకున్న బ్యాగుల్లో నింపుకొని అక్కణ్నుంచీ పారిపోయారు.
ఆ సమయంలోనే ఎందుకు?
జాతీయ రహదారి పక్కనే.. పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో.. ఉన్న దుకాణంలో ఉదయం 10.30 గంటల సమయాన్ని దోపిడీకి ఎందుకు ఎంచుకున్నారంటే.. ఆ సమయంలో ఉద్యోగులు తప్ప వినియోగదారులు పెద్దగా ఉండరనే ఉద్దేశంతోనే వారు ఆ సమయాన్ని ఎంచుకున్నట్టు భావిస్తున్నారు. పాఠశాలకు, కళాశాలలకు, కార్యాలయాలకు వెళ్లే వారితో ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు రద్దీగా ఉండే ట్రాఫిక్.. 10.30 గంటల సమయానికి కాస్తంత తగ్గుతుంది. చోరీ చేశాక అక్కణ్నుంచీ వేగంగా తప్పించుకోవడం సులువవుతుంది. దీనికితోడు.. షోరూం నుంచి బయటకు వచ్చాక పారిపోయేందుకు జాతీయ రహదారితో పాటు ఇతర దారులు ఉన్నాయి. అర కిలోమీటరు దూరంలో ఉన్న ధర్మపురి క్షేత్రం వైపు దట్టమైన చెట్లు ఉండడం, పాపిరెడ్డికాలనీ- హఫీజ్‌పేట్ మద్యలో అడవులను తలపించే విధంగా చెట్లు ఉండడంతో అటుగా పారిపోవచ్చని దొంగలు భావించారా? అనే కోణంలోనూపోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆస్పత్రిలో సతీష్..
దుండగుల కాల్పుల్లో గాయపడ్డ షోరూం డిప్యూటీ మేనేజర్ సతీ్‌షను చికిత్స నిమిత్తం సమీపంలోని పీఆర్‌కే అసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. వైద్యులు ఆపరేషన్ చేసి ఆయన కాలిలో ఉన్న బుల్లెట్‌ను బయటకు తీశారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉంది. దుండగుల ఆచూకీ కనిపెట్టేందుకకు ఖజానా జువెలరీతోపాటు.. చుట్టుపక్కల దుకాణాల బయట ఉన్న సీసీ ఫుటేజ్, జాతీయ రహదారి నుంచి వివిధ రాష్ట్రాలకు వెళ్లే రహదారులపై ఉన్న సీసీ ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు. షాపులోని సీసీ కెమెరాల్లో ఉన్న ఫుటేజ్ ఆధారంగా.. నిందితుల ముఖచిత్రాలను వారు గుర్తించినట్టు సమాచారం. కొన్నినెలల క్రితం.. ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలో, నగరంలోని ఓ ఎటీఎంలో దోపిడీకి పాల్పడిన దుండుగులు ఇలాగే కాల్పులు జరిపారు. దీంతో.. ఈ మూడు ఘటనల వెనుకా ఒకే ముఠా ఉందా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దోపిడీకి ముందస్తుగా రెక్కీ నిర్వహించి పథకం ప్రకారమే వచ్చారని.. లోపలికి రాగానే దుకాణం హెడ్ అసిస్టెంట్ మేనేజర్ వద్దకు వెళ్లి లాకర్ తాళాలు అడగడంతోపాటు, ఇవ్వకపోవడంతో అతడిపైనే కాల్పులు జరపడమే ఇందుకు నిదర్శనమని పోలీసులు భావిస్తున్నారు. కాగా.. షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్ థియేటర్లతో సందడిగా ఉండే చందానగర్‌లో పట్టపగలే కాల్పులు జరగడంతో స్థానికులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
త్వరలోనే పట్టుకుంటాం
ఉదయం 10.35 గంటల ప్రాంతంలో ఆరుగురు దొంగలు ఆయుధాలతో లోపలికి వచ్చారు. సిబ్బందిని బెదిరించి.. నగల దోపిడీకి ప్రయత్నించారు. సిబ్బందిలో ఒకరికి గాయమైంది. ఆయన ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం బాగానే ఉంది. దొంగలు దోచుకెళ్లిన వెండి వస్తువుల విలువ ఎంతో ఇంకా తెలియదు. షాపులోని సీసీ టీవీపైనా కాల్పులు జరిపారు. 10.35 గంటలకు వచ్చి 10.45 గంటలకు బయటకు వెళ్లిపోయారు. కేసు దర్యాప్తు కోసం 12 బృందాలను రంగంలోకి దించాం. త్వరలోనే దుండగులను పట్టుకుంటాం.
- అవినాశ్ మహంతి, సీపీ, సైబరాబాద్
ఈ వార్తలు కూడా చదవండి..
బీసీ గర్జన సభను మరోసారి వాయిదా వేసిన బీఆర్ఎస్
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. సీఎం చంద్రబాబు కీలక సూచనలు
Read Latest Telangana News And Telugu News