Share News

Alphabet Inc Warns: టెక్ ప్రపంచంలో కొత్త బెదిరింపులు..ఆల్ఫాబెట్ కీలక హెచ్చరిక

ABN , Publish Date - Oct 03 , 2025 | 08:30 PM

టెక్ ప్రపంచంలో ఇప్పుడు మరోసారి కొత్త బెదిరింపులు వెలుగులోకి వచ్చాయి. గూగుల్ తాజా హెచ్చరిక ప్రకారం, ప్రముఖ కంపెనీల సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను లక్ష్యంగా చేసుకొని హ్యాకర్లు నకిలీ బెదిరింపు ఇమెయిల్స్ పంపుతున్నారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

Alphabet Inc Warns: టెక్ ప్రపంచంలో కొత్త బెదిరింపులు..ఆల్ఫాబెట్ కీలక హెచ్చరిక
Alphabet Inc Warns

టెక్నాలజీ ప్రపంచంలో మరోసారి కొత్త ముప్పు రాబోతుందా. ఆల్ఫాబెట్ ఇంక్‌కు (Alphabet Inc) చెందిన గూగుల్ (Google) దీని గురించి కీలక హెచ్చరిక జారీ చేసింది. హ్యాకర్లు ఇప్పుడు పెద్ద కంపెనీల ఉన్నతాధికారులను లక్ష్యంగా చేసుకుని బెదిరింపు ఈమెయిల్స్ పంపుతున్నారు. ఈమెయిల్స్‌లో ఒరాకిల్ ఈ-బిజినెస్ సూట్ నుంచి సున్నితమైన డేటాను దొంగిలించినట్లు చెబుతున్నారు.

ఆ డేటాను బహిర్గతం చేస్తామని బెదిరిస్తున్నారు. కంపెనీలు డబ్బు చెల్లించకపోతే ఆ డేటాను బయటపెడతామని హెచ్చరిస్తున్నారు. ఈ బెదిరింపుల వెనుక రాన్సమ్‌వేర్ గ్యాంగ్ ఉందని పలువురు అనుమానిస్తున్నారు. ఇది గతంలో పెద్ద ఎత్తున సైబర్ దాడులు చేసిన చరిత్ర కలిగి ఉంది.


బెదిరింపు ఈమెయిల్స్

గూగుల్ ప్రకారం హ్యాకర్లు పలు కంపెనీల ఉన్నతాధికారులకు ఈమెయిల్స్ పంపుతూ, ఒరాకిల్ ఈ-బిజినెస్ సూట్ నుంచి ఆర్థిక, కార్యాచరణ డేటాను దొంగిలించినట్లు తెలిపింది. అయితే, ఈ డేటా నిజంగా దొంగిలించబడినట్లు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లేవని గూగుల్ స్పష్టం చేసింది. ఇది కేవలం కంపెనీలను భయపెట్టి, డబ్బు వసూలు చేసే ఒక వ్యూహంగా ఉండవచ్చని సూచించింది. కానీ ఏ అధికారులను లక్ష్యంగా చేసుకున్నారనే వివరాలను గూగుల్ బయటపెట్టలేదు. ఈ నేపథ్యంలో కార్పొరేట్ డేటా విషయంలో ఆయా సంస్థలు జాగ్రత్త వహించాలని నిపుణులు చెబుతున్నారు.


ఈ ముప్పు ఎందుకు ముఖ్యం?

ఒరాకిల్ ఈ-బిజినెస్ సూట్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద కంపెనీలు తమ కీలక ఆర్థిక, కార్యాచరణ డేటాను సురక్షితంగా ఉంచడానికి ఉపయోగించే సాఫ్ట్‌వేర్. ఒకవేళ ఈ డేటా లీక్ అయితే లేదా లీక్ అయినట్లు కనిపిస్తే, కంపెనీలు భారీ ఆర్థిక నష్టాలతో పాటు తమ బ్రాండ్ విలువ, ఖ్యాతి దెబ్బ తింటుంది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, హ్యాకర్లు చాలా సందర్భాలలో నిజమైన డేటాను కలిగి ఉండరు. భయపెట్టడానికి ఈమెయిల్స్ పంపుతారు. కానీ కొన్ని కంపెనీలు తెలియక నిజమే అనుకుని డబ్బులు చెల్లిస్తాయి. ఇది సైబర్ నేరగాళ్లను మరింత ప్రోత్సహించేలా చేస్తుంది. కాబట్టి ఇలాంటి వాటి పట్ల సాఫ్ట్‌వేర్ సంస్థలు అవగాహన కలిగి ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.


Clop గ్రూప్ తిరిగి రంగంలోకి?

గతంలో పెద్ద ఎత్తున సైబర్ దాడులు నిర్వహించిన Clop అనే ర్యాన్సమ్‌వేర్ గ్రూప్ పేరు ఈ బెదిరింపుల్లో వినిపించడం ఆందోళన కలిగిస్తోంది. గతంలో వీరు పలు ప్రభుత్వ శాఖలు, ఆరోగ్య సంస్థలు, కార్పొరేట్ కంపెనీలపై దాడులు చేశారు. ఇప్పుడు మళ్లీ వీరే కొత్తగా పేరున్న కంపెనీల నుంచి డబ్బు లాగేందుకు ప్రయత్నిస్తున్నట్లు అనుమానం వ్యక్తమవుతోంది.


ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

రూ.485కే 72 రోజుల ప్లాన్..అన్‌లిమిటెడ్ కాలింగ్, 2 జీబీ డేటా

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 03 , 2025 | 08:30 PM