Womens WC 2025: వెల్‌డన్ టీమిండియా: విరాట్ కోహ్లీ
ABN , Publish Date - Oct 31 , 2025 | 02:03 PM
ఐసీసీ వన్డే మహిళల ప్రపంచ కప్ 2025లో భాగంగా గురువారం జరిగిన రెండో సెమీస్‌లో టీమిండియా ఆసీస్‌పై సంచలన విజయాన్ని నమోదు చేసింది. దీంతో టీమిండియాపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత దిగ్గజాలు విరాట్, సచిన్, వీరేంద్ర సెహ్వాగ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
ఇంటర్నెట్ డెస్క్: మహిళల ప్రపంచ క్రికెట్‌లో ఆస్ట్రేలియాకు తిరిగే లేదు. ఆ జట్టు ఇప్పటి వరకు ఏడుసార్లు వన్డే ప్రపంచ కప్(Women’s World Cup 2025)ను నెగ్గింది. ఈ సారి అదే దూకుడుతో బరిలోకి దిగింది. అజేయంగా సెమీస్‌కు చేరుకున్న ఆసీస్‌కు టీమిండియా(Team India) అడ్డుగా నిలబడింది. దీనికి కారణం జెమీమా రోడ్రిగ్స్(Jemimah Rodrigues) బ్యాట్ రోరింగ్..! అద్భుతమైన సెంచరీతో జెమీమా(127*) చెలరేగగా.. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(89) హాఫ్ సెంచరీతో అదరగొట్టింది. దీంతో టీమిండియాపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత దిగ్గజాలు విరాట్, సచిన్, వీరేంద్ర సెహ్వాగ్ ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
‘ఆస్ట్రేలియా వంటి బలమైన ప్రత్యర్థిపై మన జట్టు అద్భుత విజయం సాధించింది. భారీ టార్గెట్‌ను ఛేదించడం తేలికైన విషయం కాదు. ఇలాంటి తీవ్ర ఒత్తిడి ఉన్న మ్యాచ్‌లో జెమీమా రోడ్రిగ్స్ సూపర్ ఇన్నింగ్స్ ఆడింది. నమ్మకం, ఆటపై నిబద్ధత, గెలవాలనే తపనే ఈ గెలుపుకు కారణం. వెల్ డన్ టీమిండియా’ అని విరాట్(Virat Kohli) సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టాడు.
‘జెమీమా రోడ్రిగ్స్, హర్మన్ ప్రీత్ కౌర్ జట్టును ముందుండి నడిపించారు. శ్రీచరణి, దీప్తి శర్మ బంతితో రాణించి మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇలాగే మున్ముందు మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నా’ అని భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar tweet) పేర్కొన్నాడు.
‘ఇది కేవలం మరో సెమీ ఫైనల్.. సులువుగా గెలిచేసి ఫైనల్‌కు చేరుకుంటామని ఆసీస్ భావించింది. మన అమ్మాయిలు మాత్రం సంచలనం సృష్టించే అవకాశం ఇదే అని భావించారు. వారిపై వచ్చిన విమర్శలను పక్కన పెట్టారు. టీమిండియా ఆటను చూసి ఇప్పుడు ప్రతి ఒక్కరూ గర్వపడుతున్నారు.’ అని వీరేంద్ర సెహ్వాగ్(Sehwag) అన్నాడు.
ఈ వార్తలు కూడా చదవండి..
చాంపియన్‌ను కొట్టేసి ఫైనల్ బెర్త్ పట్టేసి
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..