Womens World Cup: చాంపియన్‌ను కొట్టేసి ఫైనల్ బెర్త్ పట్టేసి
ABN , Publish Date - Oct 31 , 2025 | 05:33 AM
వన్డే వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన భారత మహిళల జట్టు మూడోసారి ఫైనల్లోకి అడుగుపెట్టింది. జెమీమా రోడ్రిగ్స్ (134 బంతుల్లో 14 ఫోర్లతో 127 నాటౌట్), హర్మన్‌ప్రీత్ కౌర్ (88 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 89) అదరగొట్టడంతో..
అజేయ ఆస్ట్రేలియాకు సెమీస్‌లో చెక్
జెమీమా శతకమోత ఫ విజృంభించిన హర్మన్
దక్షిణాఫ్రికాతో భారత్ టైటిల్ పోరు
మహిళల వన్డే వరల్డ్‌కప్
నవీ ముంబై: వన్డే వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన భారత మహిళల జట్టు మూడోసారి ఫైనల్లోకి అడుగుపెట్టింది. జెమీమా రోడ్రిగ్స్ (134 బంతుల్లో 14 ఫోర్లతో 127 నాటౌట్), హర్మన్‌ప్రీత్ కౌర్ (88 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 89) అదరగొట్టడంతో.. గురువారం ఉత్కంఠభరితంగా సాగిన రెండో సెమీ్‌సలో డిఫెండింగ్ చాంప్ ఆస్ట్రేలియాను భారత్ 5 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. తొలుత ఆస్ట్రేలియా 49.5 ఓవర్లలో 338 పరుగులకు ఆలౌటైంది. ఫోబీ లిచ్‌ఫీల్డ్ (119), ఎలీస్ పెర్రీ (77), ఆష్లే గార్డ్‌నర్ (63) శ్రమ వృథా అయింది. శ్రీచరణి, దీప్తి చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఛేదనలో భారత్ 48.3 ఓవర్లలో 341/5 స్కోరు చేసి గెలిచింది. రిచా ఘోష్ (26) దూకుడుగా ఆడింది. కిమ్ గార్త్, సదర్లాండ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఓపెనర్‌గా షఫాలీని ఎంపిక చేయ గా.. హర్లీన్ డియోల్ స్థానంలో అమన్‌జోత్ కౌర్ టీమ్‌లోకి వచ్చింది. జెమీమా ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచింది. కాగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరుగుతుంది.

ఆందోళనకు గురైనా.. : భారీ ఛేదనలో జెమీమా జట్టును ముందుండి నడిపించింది. కెప్టెన్ హర్మన్‌తో కలిసి మూడో వికెట్‌కు 167 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన రోడ్రి గ్స్.. దీప్తి శర్మ (24), రిచా, అమన్‌జోత్ కౌర్ (15 నాటౌట్)తో కలసి జట్టును విజయ తీరాలకు చేర్చింది. ఓపెనర్ షఫాలీ వర్మ (10) స్వల్ప స్కోరుకే వెనుదిరిగిం ది. అయితే, మరో ఓపెనర్ స్మృతి మంధాన (24), వన్‌డౌన్ బ్యాటర్ జెమీమా రెండో వికెట్‌కు 46 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకొనే ప్రయత్నం చేశారు. కానీ, లెగ్‌సైడ్‌లో వెళ్తున్న బంతిని కదిలించి మరీ మంధాన అవుట్ కావడంతో భారత్ 59/2తో నిలిచింది. అయితే, రోడ్రిగ్స్‌కు కెప్టెన్ హర్మన్ జత కావడంతో స్కోరు ఊపందుకొంది. స్ట్రయిక్ రొటేట్ చేస్తూనే వీలుచిక్కినప్పుడల్లా షాట్లు ఆడుతూ రన్‌రేట్‌ను నియంత్రణలో ఉంచారు. ఈ క్రమంలో జెమీమా అర్ధ శతకం పూర్తి చేసుకోగా.. ఆ తర్వాత కౌర్ జోరందుకొంది. 29వ ఓవర్‌లో సింగిల్‌తో ఫిఫ్టీ పూర్తి చేసుకొన్న హర్మన్ ఆ తర్వాత రెండు భారీ సిక్స్‌లతో దూకుడు పెంచింది. దీంతో 32వ ఓవర్‌లో టీమ్ స్కోరు 200 మార్క్ దాటింది. ఈ క్రమంలో వరుస బౌండ్రీలతో విరుచుకుపడుతున్న కౌర్‌ను సదర్లాండ్ అవుట్ చేసింది. ఈ దశలో దీప్తితో కలసి జెమీమా జట్టును గెలిపించే బాధ్యత భుజాన వేసుకొంది. కానీ, చివరి 10 ఓవర్లలో 82 పరుగులు కావల్సి ఉండగా.. దీప్తి రనౌట్ అయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన రిచా అటాకింగ్ ఆటతో ఆసీస్ బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించే ప్రయత్నం చేసింది. మరోవైపు బౌండ్రీతో సెంచరీ పూర్తి చేసుకొన్న రోడ్రిగ్స్.. సదర్లాండ్ బౌలింగ్‌లో మెక్‌గ్రాత్ క్యాచ్ చేజార్చడంతో బతికిపోయింది. 45వ ఓవర్‌లో గార్డ్‌నర్ బౌలింగ్‌లో రిచా 6,4తో జోరు చూపడంతో.. సమీకరణం 34 బంతుల్లో 30 పరుగులకు దిగివచ్చింది. కీలక సమయంలో రిచాను అవుట్ చేసిన సదర్లాండ్ ఉత్కంఠ రేపింది. కానీ, అమన్‌జోత్, జెమీమా చెరో రెండు బౌండ్రీలతో మోతెక్కించడంతో.. భారత్ 9 బంతులు మిగిలుండగానే విజయాన్ని అందుకొంది.
బ్రేకులేసిన చరణి..: ఓపెనర్ లిచ్‌ఫీల్డ్, పెర్రీ రెండో వికెట్‌కు 155 పరుగుల దూకుడైన భాగస్వామ్యంతో ఆసీస్ భారీ స్కోరు చేసింది. ఒకదశలో స్కోరు 400 మార్క్ దాటేలా కనిపించింది. కానీ, చివరి 16.1 ఓవర్లలో 118 పరుగులకు 8 వికెట్లు పడగొట్టిన భారత బౌలర్లు ఆసీస్ జోరుకు కొంతమేర బ్రేకులు వేశారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ స్వల్ప స్కోరుకే కెప్టెన్ హీలీ (5) వికెట్ కోల్పోయింది. కానీ, ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. లిచ్‌ఫీల్డ్, పెర్రీ క్రీజులో నిలదొక్కుకోవడంతో పరుగుల వరద పారింది. ముఖ్యంగా లిచ్‌ఫీల్డ్ గతితప్పిన భారత బౌలింగ్‌ను ఉతికి ఆరేసింది. ఫీల్డింగ్ కూడా పేలవంగా ఉండడంతో ఫోబి స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసింది. ఆమెను నియంత్రించడానికి హర్మన్‌ప్రీత్ బౌలర్లను మార్చి ప్రయోగించిన ఫలితం దక్కలేదు. ఈ క్రమంలో శతకం పూర్తి చేసుకొన్న లిచ్‌ఫీల్డ్‌ను అమన్‌జోత్ బౌల్డ్ చేసి జట్టుకు ఊరటనిచ్చింది. ఆ తర్వాత బెత్ మూనీ (24), సదర్లాండ్ (3)ను చరణి అవుట్ చేయడంతో స్కోరు వేగం మందగించింది. ఫిఫ్టీ పూర్తి చేసుకొన్న పెర్రీని రాధ బౌల్డ్ చేసింది. కానీ, డెత్ ఓవర్లలో గార్డ్‌నర్ ఎడాపెడా షాట్లతో చెలరేగడంతో ఆసీస్ 330కి పైగా స్కోరు సాధించింది.
స్కోరుబోర్డు
ఆస్ట్రేలియా: హీలీ (బి) క్రాంతి 5, లిచ్‌ఫీల్డ్ (బి) అమన్‌జోత్ 119, పెర్రీ (బి) రాధ 77, బెత్ మూనీ (సి) జెమీమా (బి) చరణి 24, సదర్లాండ్ (సి అండ్ బి) చరణి 3, గార్డ్‌నర్ (రనౌట్/క్రాంతి) 63, మెక్‌గ్రాత్ (రనౌట్/జెమీమా) 12, కిమ్ గార్త్ (రనౌట్/అమన్‌జోత్) 17, కింగ్ (సి) రిచా (బి) దీప్తి 4, మోలినెక్స్ (బి) దీప్తి 0, మేగన్ షుట్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు: 13; మొత్తం: 49.5 ఓవర్లలో 338 ఆలౌట్; వికెట్ల పతనం: 1-25, 2-180, 3-220, 4-228, 5-243, 6-265, 7-331, 8-336, 9-336; బౌలింగ్: రేణుక 8-0-39-0, క్రాంతి గౌడ్ 6-0-58-1, శ్రీచరణి 10-0-49-2, దీప్తి శర్మ 9.5-0-73-2, అమన్‌జోత్ 8-0-51-1, రాధ 8-0-66-1.
భారత్: షఫాలీ (ఎల్బీ) గార్త్ 10, మంధాన (సి) హీలీ (బి) గార్త్ 24, జెమీమా (నాటౌట్) 127, హర్మన్ (సి) గార్డ్‌నర్ (బి) సదర్లాండ్ 89, దీప్తి (రనౌట్/గార్త్) 24, రిచా (సి) గార్త్ (బి) సదర్లాండ్ 26, అమన్‌జోత్ (నాటౌట్) 15; ఎక్స్‌ట్రాలు: 26; మొత్తం: 48.3 ఓవర్లలో 341/5; వికెట్ల పతనం: 1-13, 2-59, 3-226, 4-264, 5-310; బౌలింగ్: మేగన్ షుట్ 6-0-40-0, కిమ్ గార్త్ 7-0-46-2, గార్డ్‌నర్ 8-0-55-0, మోలినెక్స్ 6.3-0-44-0, సదర్లాండ్ 10-0-69-2, అలనా కింగ్ 9-0-58-0, తహిల 2-0-19-0.
ఆస్ట్రేలియా వరుస 15 వన్డేల విజయాలకు బ్రేక్
3
మహిళల వన్డేల్లో 300 పైగా స్కోరును చేధించడం ఇది మూడోసారి. ఇదే టోర్నీలో భారత్‌తో మ్యాచ్‌లో 331 పరుగుల రికార్డు లక్ష్యాన్ని ఆసీస్ అధిగమించింది. ఇప్పుడు భారత్ 339 పరుగుల టార్గెట్‌ను ఛేదించి టాప్‌లో నిలిచింది. గతేడాది సౌతాఫ్రికాపై లంక 302 స్కోరు చేసి గెలిచింది.
ఈ వార్తలు కూడా చదవండి..
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్.. రాష్ట్రపతి ఉత్తర్వులు
జగన్‌కు మంత్రి అచ్చెన్నాయుడు చాలెంజ్
Read Latest AP News And Telugu News