Acchennaidu slams Jagan: జగన్‌కు మంత్రి అచ్చెన్నాయుడు చాలెంజ్
ABN , Publish Date - Oct 30 , 2025 | 07:01 PM
రైతులు కష్టాల్లో ఉంటే... గదిలో కూర్చుని జగన్ అబద్దాలు ప్రచారం చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటల బీమాపై జగన్ పచ్చి అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు.
గుడివాడ, అక్టోబర్ 30: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు మరోసారి నిప్పులు చెరిగారు. వైఎస్ జగన్ ఒక అబద్దాల కోరని విమర్శించారు. ఆయన గురించి మాట్లాడాలంటేనే అసహ్యంగా ఉందన్నారు. గురువారం ఉమ్మడి కృష్ణాజిల్లా పామర్రు, వెంట్రప్రగడలో మొంథా తుపాన్ అనంతరం పరిస్థితులను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పంటల బీమాపై వైసీపీ టెలి కాన్ఫరెన్స్‌లో వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు.
వాస్తవాలు మాట్లాడితే సమాధానం చెబుతామని వైఎస్ జగన్‌కు స్పష్టం చేశారు. విమానం లేదని తుపాన్ ప్రభావంతో ఐదు రోజులుగా ఇబ్బంది పడుతున్న ప్రజలను పట్టించుకోని వ్యక్తి జగన్ అని తెలిపారు. చుట్టం చూపుగా వచ్చే వ్యక్తి మాటలకు ఏమనాలో అర్ధం కావడం లేదన్నారు. రైతులు కష్టాల్లో ఉంటే... గదిలో కూర్చుని జగన్ అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటల బీమాపై జగన్ పచ్చి అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. దమ్ము ధైర్యం ఉంటే టెలి కాన్ఫరెన్స్ వ్యాఖ్యలపై తమతో చర్చకు రావాలని వైఎస్ జగన్‌కు ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు చాలెంజ్ విసిరారు. వాస్తవ నివేదికతో తాము చర్చకు వస్తామన్నారు.
తుపాన్ ప్రభావంతో ఐదు రోజులుగా రైతులు, ప్రజలు కష్టపడుతుంటే.. కేవలం బెంగళూరు నుంచి విమానం లేదనే సాకుతో రాష్ట్రానికి రాని వ్యక్తిగా జగన్ మిగిలిపోయారని వ్యంగ్యంగా పేర్కొన్నారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు అసత్యాలు ప్రచారం చేస్తున్నాడన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వ బీమా వాటా చెల్లించ లేదని.. సాక్షాత్తు అప్పటి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి బహిరంగంగా చెప్పారని ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు గుర్తు చేశారు.
రైతులకు సంబంధించిన ప్రతి విషయంలో అసత్యాలు ప్రచారం చేస్తూ.... వైసీపీ నేతలు అభాసు పాలవుతున్నారని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వరితో పాటు మిర్చి, పొగాకు, మామిడి రైతులకు సీఎం చంద్రబాబు అండగా నిలిచారని వివరించారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఊసులో లేని.... పొగాకుకు కూటమి ప్రభుత్వం రూ.300 కోట్లు చెల్లించిందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
డైవర్షన్ కోసమే వైసీపీ కుట్ర: ఎమ్మెల్యే ఎంఎస్ రాజు
తెలుగు వారికి తీవ్ర గాయాలు.. స్పందించిన కేంద్ర మంత్రి
Read Latest AP News And Telugu News