Vinesh Phogat: రిటైర్‌మెంట్ వెనక్కి తీసుకున్న వినేశ్ ఫోగట్
ABN , Publish Date - Dec 12 , 2025 | 01:24 PM
భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ తన రిటైర్‌మెంట్‌ను వెనక్కి తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్స్‌లో ఆడనున్నట్లు వెల్లడించింది.
ఇంటర్నెట్ డెస్క్: భారత స్టార్ రెజర్ల్ వినేశ్ ఫొగట్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పారిస్ ఒలింపిక్స్‌తో అనూహ్యంగా అనర్హత వేటుకు గురైన వినేశ్.. ఆ షాక్‌తో రిటైర్‌మెంట్ ప్రకటించిన వినేశ్.. తాజాగా దాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు వెల్లడించారు. 2028లో లాస్ ఏంజిల్స్‌లో జరిగే ఒలింపిక్స్‌లో ఆడతానని శుక్రవారం సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు.
‘పారిస్ ఒలింపిక్స్ తర్వాత నాకు ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యాయి. ‘ఇదే ముగింపా?’ అని కూడా అడిగారు. అప్పుడు నా(Vinesh Phogat) దగ్గర సమాధానం లేదు. అనూహ్యంగా అనర్హత వేటు పడటంతో తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొన్నాను. దాంట్లో నుంచి బయట పడటానికి నాకు ఎంతో సమయం పట్టింది. మళ్లీ ఆటలోకి దిగాలి అనుకుంటున్నా. ఒలింపిక్ పథంలోకి మళ్లీ అడుగుపెట్టాలనుకుంటున్నా. ఈ సారి నేను ఒంటరిగా బరిలోకి దిగట్లేదు. నా వెంట నా కొడుకు వస్తున్నాడు. నన్ను ప్రోత్సహించేందుకు నా కొడుకు సిద్ధమయ్యాడు. లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్స్‌లో కలుద్దాం’ అని వినేశ్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
అప్పుడు ఏం జరిగిందంటే?
50 కిలోల విభాగంలో ఫైనల్‌కు అర్హత సాధించిన వినేశ్… 100 గ్రాములు అధిక బరువు కారణంగా అనర్హత వేటుకు గురైంది. వెంటనే ఆమె కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (CAS)ను ఆశ్రయించి, తనకు జాయింట్ సిల్వర్ ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేసింది. కానీ విచారణ అనంతరం CAS ఆమె అప్పీల్‌ను తిరస్కరించింది. దీంతో తీవ్ర నిరాశలో ఆమె రిటైర్మెంట్ ప్రకటించింది.
ఆసియా, కామన్వెల్త్ గేమ్స్‌ల్లో మూడు సార్లు బంగారు పతకాలు సాధించింది వినేశ్. ఇప్పుడు మళ్లీ రంగంలోకి దిగుతూ, తన కెరీర్‌లో మొదటి ఒలింపిక్ మెడల్ కోసం పోరాడేందుకు సిద్ధమవుతోంది.
ఇవీ చదవండి:
పేలవ ప్రదర్శన.. సూర్యకు అసలు ఏమైంది?
ప్రపంచ రికార్డు బ్రేక్ చేసిన సౌతాఫ్రికా.. భారత్‌పై తొలి జట్టుగా..!