Share News

Vaibhav Suryavanshi: చరిత్ర తిరగరాసిన యువ సంచలనం.. రెండు ప్రపంచ రికార్డులు బద్దలు

ABN , Publish Date - Dec 24 , 2025 | 12:38 PM

వైభవ్ సూర్యవంశీ.. క్రికెట్ అభిమానులు ఇప్పుడు ఈ పేరునే జపిస్తున్నారు. విజయ్ హజారే ట్రోఫీలో ఏకంగా రెండు ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టాడు. 36 బంతుల్లోనే సెంచరీ బాదాడు. అంతటితో ఆగలేదు.. 84 బంతుల్లోనే 150 పరుగలు చేసి ఏబీడీ రికార్డును బ్రేక్ చేశాడు.

Vaibhav Suryavanshi: చరిత్ర తిరగరాసిన యువ సంచలనం.. రెండు ప్రపంచ రికార్డులు బద్దలు
Vaibhav Suryavanshi

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా యువ సంచలనం 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ.. ఫార్మాట్ ఏదైనా తన బ్యాటుతో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నాడు. క్రీజులోకి దిగాడంటే సెంచరీ మోత మోగాల్సిందే అన్నట్లు విరుచుకుపడుతున్నాడు. తాజాగా విజయ్ హజారే ట్రోఫీలో బిహార్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న వైభవ్ 84 బంతుల్లో190 పరుగులు చేసి ఔరా అనిపించాడు. ఈ క్రమంలో రెండు ప్రపంచ రికార్డులను తన(Vaibhav Suryavanshi) పేరిట లిఖించుకున్నాడు.


లిస్ట్-ఏ క్రికెట్‌లో శతకం సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా వైభవ్‌ చరిత్ర సృష్టించాడు. కేవలం 36 బంతుల్లోనే తొలి లిస్ట్-ఏ సెంచరీ పూర్తి చేశాడు. ప్రొఫెషనల్ వన్డే టోర్నీలోనూ 14 ఏళ్ల వయసులో శతకం సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. భారతీయులలో వేగవంతమైన లిస్ట్-ఏ శతకాల జాబితాలో అతడు రెండో స్థానంలో నిలిచాడు. గత ఏడాది అన్మోల్‌ప్రీత్ సింగ్(35 బంతుల్లో) అగ్రస్థానంలో ఉన్నాడు. శతకం తర్వాత మరింత ఉగ్రరూపం దాల్చిన వైభవ్‌ కేవలం 54 బంతుల్లోనే 150 పరుగుల మార్క్‌ను దాటాడు. దీంతో లిస్ట్-ఏ క్రికెట్‌లో అత్యంత వేగంగా 150 పరుగులు చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఏబీ డివిలియర్స్‌ (64 బంతులు) పేరిట ఉండేది.


డబుల్ సెంచరీ రికార్డును కూడా బద్దలు కొట్టే దిశగా సాగిన వైభవ్‌.. 190 వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. అయినా అతడి ఇన్నింగ్స్ క్రికెట్ అభిమానులను మంత్రముగ్ధులను చేసింది. 16 ఫోర్లు, 15 భారీ సిక్సర్లతో 226.19 స్ట్రైక్‌రేట్‌తో ఆడి అరుణాచల్ బౌలర్లను వణికించాడు.


సెంచరీల ప్రవాహం..

వైభవ్ సూర్యవంశీ.. ఈ పేరు ఇప్పటికే క్రికెట్ చరిత్రలో నిలిచిపోయింది. ఐపీఎల్‌లో అత్యంత పిన్న వయసులో అరంగేట్రం చేసిన ఆటగాడిగా, రాజస్థాన్ రాయల్స్ తరఫున సెంచరీ చేసిన క్రికెటర్‌గా రికార్డులు నెలకొల్పాడు. అలాగే ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో భారత్ ‘ఏ’ జట్టు తరఫున 32 బంతుల్లోనే శతకం బాదాడు. విజయ్ హజారే ట్రోఫీ కొనసాగుతున్న కొద్దీ, ఇప్పుడు అందరి చూపు ఒక్క వైభవ్ సూర్యవంశీ పైనే ఉంది. 14 ఏళ్ల వయసులోనే రికార్డులు బద్దలు కొడుతూ, యువ క్రికెటర్ అంటే ఏమిటన్న నిర్వచనాన్నే మార్చేస్తున్నాడు. అతడి ప్రయాణం ఇప్పుడే మొదలైంది… ముందు ఇంకా ఎన్ని మైలురాళ్లు ఎదురుచూస్తున్నాయో చూడాల్సిందే.


ఇవీ చదవండి:

మద్యం మత్తులో ఇంగ్లండ్ క్రికెటర్స్.. తొలిసారి స్పందించిన స్టోక్స్

బాదుడే బాదుడు.. 36 బంతుల్లోనే వైభవ్ సూపర్ సెంచరీ

Updated Date - Dec 24 , 2025 | 12:38 PM