U19 Asia Cup: చతికిలపడ్డ టీమిండియా.. పాకిస్తాన్ ఘన విజయం
ABN , Publish Date - Dec 21 , 2025 | 05:15 PM
అండర్ 19 ఆసియా కప్ 2025లో భాగంగా ఇండియాతో జరిగిన ఫైనల్‌లో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. 348 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 156 పరుగులకే కుప్పకూలింది. దీంతో పాక్ 191 పరుగుల భారీ తేడాతో గెలిచింది.
ఇంటర్నెట్ డెస్క్: అండర్ 19 ఆసియా కప్ వన్డే టోర్నమెంట్ ఫైనల్‌లో టీమిండియాపై పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. 348 పరుగుల భారీ లక్ష్యంతో ఛేదనకి దిగిన టీమిండియా బ్యాటర్లు చతికిల పడ్డారు. పాక్ బౌలర్ల ధాటికి పేకమేడలా కుప్పకూలారు. ఆసియా కప్ ఆరంభం నుంచి విజయ భేరి మోగిస్తూ వస్తున్న భారత యువ జట్టు.. ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. 348 పరుగుల విజయం లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. 26.2 ఓవర్లు ఆడి 156 పరుగులే చేసింది. దీంతో 191 పరుగుల భారీ తేడాతో పాకిస్తాన్‌పై ఓటమి పాలైంది.
సెంచరీల సంచలనం వైభవ్ సూర్యవంశీ(26).. పాకిస్తాన్‌తో మ్యాచులోనే విఫలమవుతున్నాడు. తాజాగా మళ్లీ అదే రిపీట్ అయింది. ఆరోన్ జార్జ్(16), ఆయుశ్ మాత్రే(2), విహాన్ మల్హోత్ర(7), వేదాంత్ త్రివేది(9), అభిజ్ఞాన్ కుందు(13), కాన్షిక్ చౌహాన్(9), ఖిలాన్ పటేల్(19), హేనిల్ పటేల్(6) తీవ్రంగా నిరాశ పర్చారు. ఒక్కరు కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయారు. ఆఖరిలో దీపేశ్ దేవేంద్రన్(36)మెరుపు ఇన్నింగ్స్ ఆడినా ఫలితం లేకపోయింది. కిషాన్ కుమార్(3) నాటౌట్‌గా నిలిచాడు. పాక్ బౌలర్లలో అలీ రజా 4 కీలక వికెట్లు తీసి భారత జట్టు పతనాన్ని శాసించాడు. మహ్మద్ సయ్యం, అబ్దుల్ సుభాన్, హుజైఫా తలో రెండు వికెట్లు పడగొట్టారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాక్.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది. ఓపెనర్ సమీర్ మిన్హాస్ (172) భారీ శతకంతో విరుచుకుపడ్డాడు. అహ్మద్ హుస్సేన్ (56) హాఫ్ సెంచరీ చేశాడు. ఉస్మాన్ ఖాన్ (35), ఫర్హాన్ యూసుఫ్ (19), హంజా జహూర్ (18) పరుగులు చేశారు. భారత బౌలర్లలో దీపేశ్ దేవేంద్రన్ 3, హెనిల్ పటేల్ 2, ఖిలాన్ పటేల్ 2, కాన్షిక్ చౌహాన్ ఒక వికెట్ పడగొట్టారు.
ఇవీ చదవండి:
ఇషాన్‌కు ఇది క్రికెట్ ఇచ్చిన గిఫ్ట్: అశ్విన్
చెలరేగిన సమీర్ మిన్హాస్.. భారత్ టార్గెట్ 348