Sunil Gavaskar: కోల్‌కతా ఘటనకు అసలు కారణం ‘మెస్సి’నే.. కుండబద్దలు కొట్టిన సునీల్ గావస్కర్
ABN , Publish Date - Dec 16 , 2025 | 11:22 AM
ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సి భారత్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. కోల్‌కతాలోని ఈవెంట్‌లో మెస్సి ఎక్కువ సేపు ఉండలేదని అభిమానులు విధ్వంసం సృష్టించారు. ఈ ఘటనపై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి మూడు రోజుల పాటు భారత్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. ‘గోట్ టూర్ ఆఫ్ ఇండియా’లో భాగంగా శనివారం ఉదయం కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో నిర్వహించిన ఈవెంట్‌లో పాల్గొన్నాడు. అయితే షెడ్యూల్ ప్రకారం రెండు గంటల పాటు స్టేడియంలో ఉండాల్సిన మెస్సి.. తొందరగా అక్కడి నుంచి వెళ్లిపోవడంతో అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. స్టేడియంలో ఉన్న కుర్చీలు విరగ్గొడుతూ విధ్వంసం సృష్టించారు. ఈ ఘటనపై టీమిండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్(Sunil Gavaskar) స్పందించాడు.
‘కోల్‌కతా ఘటనకు అసలు కారణం మెస్సినే. అభిమానుల పట్ల తన నిబద్ధతను తెలియజేయడంలో మెస్సి విఫలమయ్యాడు. ఆయన్ను తప్పా మిగతావారందరినీ కోల్‌కతా విధ్వంసానికి కారణమని నిందించాడు. నిజానికి అసలు ఒప్పందం ఏంటో బహిరంగంగా తెలియదు. కానీ అతడు అనుకున్న సమయం కన్నా ముందే వెళ్లిపోయాడు. ఈ విషయంలో నిజమైన దోషులు మెస్సి, అతడి బృందమే’ అని సన్నీ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.
కాసేపు ఆడాల్సింది..
మెస్సికి భద్రతా సమస్యలు ఎదురవుతాయేమోనన్న వాదనను కూడా సన్నీ తోసిపుచ్చాడు. ‘మెస్సి చుట్టూ రాజకీయ నాయకులు, వీఐపీలు మూగి ఉన్నారు. అతడికి లేదా.. అతడి బృందానికి ఏ విధమైన ముప్పూ లేదు. అతడు స్టేడియంలో తిరుగుతూ.. ప్రేక్షకులను పలకరించాల్సింది. కాసేపు ఫుట్‌బాల్ ఆడాల్సింది. అలాగే చుట్టూ మూగినవారు కూడా తప్పుకుని ఉండాల్సింది. అప్పుడు ప్రేక్షకులు మెస్సిని స్పష్టంగా వీక్షించేవారు. మెస్సి షెడ్యూల్ ప్రకారం సమయం వెచ్చించడం వల్ల హైదరాబాద్, ముంబై, ఢిల్లీ వేదికల్లో పర్యటన సజావుగా సాగింది. కోల్‌కతా గందరగోళానికి నిర్వహకులు, అభిమానులు కారణమని నిందించే ముందు అసలు ఆ వ్యక్తులు తమ వాగ్దానాలు నిలబెట్టుకున్నారో, లేదో చూడాలి ’ అని సునీల్ గావస్కర్ అన్నాడు.
ఇవి కూడా చదవండి:
వైభవ్ సూర్యవంశీని కట్టడి చేస్తాం: మలేసియా కెప్టెన్ డియాజ్
జట్టుకు సీఈవోలా ఫీలవ్వకూడదు.. గంభీర్‌కు హర్ష భోగ్లే హెచ్చరిక