IPL 2026: కెప్టెన్సీ నిర్ణయం పూర్తిగా ఫ్రాంచైజీదే: రియాన్ పరాగ్
ABN , Publish Date - Dec 05 , 2025 | 05:41 PM
రాజస్థాన్ రాయల్స్ జట్టు సంజూ శాంసన్‌ను వదిలి సీఎస్కే నుంచి జడేజాను జట్టులోకి ట్రేడ్ చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఆర్ఆర్ కెప్టెన్ ఎవరనే దానిపై సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ స్టార్ బ్యాటర్ రియాన్ పరాగ్ ఈ విషయంపై మాట్లాడాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 సందడి ఇప్పటికే మొదలైంది. డిసెంబర్ 16న అబుదాబి వేదికగా మినీ వేలం జరగనుంది. ఇప్పటికే ఆయా ఫ్రాంచైజీలు తన రిటెన్షన్, రిలీజ్ లిస్ట్‌ను ప్రకటించాయి. ఇందులో అందరి దృష్టిని ఆకర్షించింది.. సంజూ శాంసన్-రవీంద్ర జడేజా ట్రేడ్! చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.. రవీంద్ర జడేజాను వదిలి సంజూ శాంసన్‌ను జట్టులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కెప్టెన్‌గా ఎవరు ఉండనున్నారు? అనేది అందరి ప్రశ్న.
దేశవాళీ క్రికెట్‌లో అస్సాం జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన రియాన్ పరాగ్(Riyan Parag).. ఐపీఎల్‌లో కూడా నాయకత్వం వహించిన అనుభవం ఉంది. గత సీజన్‌లో ఆర్ఆర్ కెప్టెన్ సంజూ శాంసన్ గాయం బారిన పడినప్పుడు.. ఎనిమిది మ్యాచ్‌లకు రియాన్ నాయకత్వం వహించాడు. ‘గత సీజన్‌లో ఎనిమిది మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించా. డ్రెస్సింగ్ రూమ్‌లో విశ్లేషణల సమయంలో 80శాతం సరైన నిర్ణయాలు తీసుకున్నాననే నమ్మకం నాకుంది. ఈ సారి కెప్టెన్ బాధ్యతలు ఎవరికి ఇస్తారనే విషయంపై పూర్తి నిర్ణయం ఫ్రాంచైజీదే’ అని రియాన్ పరాగ్ వెల్లడించాడు.
ఆ నిర్ణయం వేలం తర్వాతే..
‘కెప్టెన్ నిర్ణయం డిసెంబర్ 16న జరిగే మినీ వేలం తర్వాతే అని ఇప్పటికే ఆర్ఆర్ ఓనర్ మనోజ్ సర్ స్పష్టం చేశారు. దీని గురించి ఇప్పటి నుంచే ఆలోచిస్తే మానసిక ఒత్తిడికి గురవుతాం. జట్టు నన్నే కెప్టెన్‌గా కావాలి అనుకుంటే సిద్ధంగా ఉన్నా. లేదా ప్లేయర్‌గానే నేను ఎక్కువ ఉపయోగపడతా అనుకుంటే దానికీ రెడీ. కెప్టెన్సీ అంటే కేవలం పేరు ప్రఖ్యాతి మాత్రమే కాదు. అసలు క్రికెట్‌కు దాదాపు 20 శాతం మాత్రమే సమయం దొరుకుతుంది. మిగతా అంతా మీటింగ్‌లు, మీడియా, స్పాన్సర్ షూట్లతోనే నిండిపోతుంది’ అని పరాగ్ వివరించాడు.
ఈ వార్తలు కూడా చదవండి..
టికెట్ల కోసం ఎగబడ్డ జనం.. వీడియో వైరల్
అనుభవాన్ని అంగట్లో కొనుక్కోలేం.. రో-కోతో పెట్టుకోవద్దు: రవిశాస్త్రి