Ind Vs SA: పవర్ హిట్టింగ్.. రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు
ABN , Publish Date - Dec 06 , 2025 | 07:49 PM
వైజాగ్ 3వ వన్డేలో రోహిత్ శర్మ 20,000 అంతర్జాతీయ పరుగుల భారీ మైలురాయిని అందుకుని ప్రపంచ రికార్డు సృష్టించాడు. 50 సెంచరీలు, 110 హాఫ్ సెంచరీలతో హిట్‌మ్యాన్ భారత క్రికెట్ చరిత్రలో అరుదైన ఘనత సాధించాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా-సౌతాఫ్రికా జట్లు వైజాగ్ వేదికగా మూడో వన్డేలో తలపడుతున్నాయి. తొలి ఇన్నింగ్స్‌లో 270 పరుగులు చేసిన సౌతాఫ్రికా.. టీమిండియాకు 271 లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేదనకి దిగిన భారత్ ఆది నుంచి నిలకడగా ఆడుతుంది. ఈ క్రమంలో స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ(Rohit Sharma) ఓ కీలక మైలురాయిని అందుకున్నాడు.
ప్రపంచంలోనే..
హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 20,000 పరుగుల మార్కును అధిగమించాడు. ఈ ఘనత సాధించిన ప్రపంచంలోనే 14వ ఆటగాడిగా.. భారత నాలుగో క్రికెటర్‌గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. ఈ జాబితాలో క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్(34,357 పరుగులు), విరాట్ కోహ్లీ(27,910 పరుగులు), రాహుల్ ద్రవిడ్(24,064 పరుగులు) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. మరోవైపు హిట్‌మ్యాన్‌కు విశాఖలో ఇది మూడో హాఫ్ సెంచరీ కావడం విశేషం. రోహిత్ తన కెరీర్‌లో ఇప్పటివరకు 50 సెంచరీలు, 110 హాఫ్ సెంచరీలు పూర్తి చేశాడు. భారత్ తరఫున 50 అంతర్జాతీయ సెంచరీలు చేసిన మూడో ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. అతడికి ముందు సచిన్(100), విరాట్(83) ఉన్నారు. వన్డేల్లో ఇండియాలో రోహిత్.. 5వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు.
ఫార్మాట్ల వారీగా..
రోహిత్ శర్మ తన కెరీర్‌లో 500 కంటే ఎక్కువ అంతర్జాతీయ మ్యాచ్‌లు(505) ఆడిన ఐదో భారత ప్లేయర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో రోహిత్ ముందు సచిన్, విరాట్, ధోనీ, ద్రవిడ్ ఉన్నారు. పరుగుల ఫార్మాట్ వారీగా చూస్తే.. వన్డే క్రికెట్‌లో 33 సెంచరీలతో 11,450+ పరుగులు సాధించి భారత్ తరఫున మూడో అత్యధిక రన్-గెటర్‌గా ఉన్నారు. టెస్టుల్లో ఆయన 12 సెంచరీలతో 4,301 పరుగులు, టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో రికార్డు స్థాయిలో 5 సెంచరీలతో 4,231 పరుగులు నమోదు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సౌతాఫ్రికా ఆలౌట్.. భారత్ టార్గెట్ 271
రికార్డు సృష్టించిన క్వింటన్ డికాక్