Rohit Sharma: మీరు చేయలేనిది మేం చేసి చూపించాం.. ఇంగ్లండ్‌పై హిట్‌మ్యాన్ వ్యంగ్యాస్త్రాలు
ABN , Publish Date - Dec 22 , 2025 | 05:41 PM
ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ గెలవడం అంత ఈజీ కాదని.. కావాలంటే ఇంగ్లండ్ ప్లేయర్లను అడగండని టీమిండియా స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ అన్నాడు. ఆసీస్ వేదికగా జరిగుతున్న యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ 0-3తేడాతో సిరీస్ చేజార్చుకున్న విషయం తెలిసిందే.
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ పేలవ ప్రదర్శన చేస్తున్న సంగతి తెలిసిందే. జరిగిన మూడు మ్యాచుల్లోనూ ఇంగ్లండ్ ఓటమిపాలై 0-3 తేడాతో సిరీస్‌ను కోల్పోయింది. ఆస్ట్రేలియా గడ్డపై ఇంగ్లండ్ జట్టు వరుసగా నాలుగో సారి సిరీస్‌న కోల్పోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ జట్టుపై టీమిండియా వెటరన్ ప్లేయర్ రోహిత్ శర్మ(Rohit Sharma)సంచలన వ్యాఖ్యలు చేశాడు. గురుగ్రామ్‌లో జరిగిన మాస్టర్స్ యూనియన్ స్నాతకోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన ‘హిట్‌మ్యాన్’ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ తన క్రికెట్ కెరీర్‌లో మరపురాని విజయాలను గుర్తుచేసుకున్నాడు.
‘ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ గెలవడం అంత ఈజీ కాదు. కావాలంటే ఇంగ్లండ్ ప్లేయర్లను అడగండి చెబుతారు. 2021 ఆస్ట్రేలియాలో గబ్బాలో జరిగిన మ్యాచ్‌లో మేం గెలిచాం. రిషభ్ పంత్ అద్భుతంగా ఆడి జట్టుకు విజయాన్ని అందించాడు. మేం గెలుస్తామని ఎవరూ ఊహించలేదు. అలాంటి స్థితి నుంచి టీమిండియా పుంజుకుని గెలిచింది. ఆ మ్యాచులో మా ఫస్ట్ ఛాయిస్ ఆటగాళ్లందరూ గాయాలు, వివిధ కారణాల వల్ల ఆటకు దూరమయ్యారు. ఆ సమయంలో ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ మాపై కొన్ని కామెంట్స్ చేశాడు. అది నాకు ఇంకా గుర్తుంది.
ఆ కామెంట్స్‌లో ఒకటి మమ్మల్ని ఆలోచనలో పడేసింది. మ్యాచ్ ప్రారంభమైనప్పుడు తుది జట్టులో ముగ్గురు అరంగేట్ర ఆటగాళ్లున్నారు. గబ్బా ఆస్ట్రేలియాకు కంచుకోట. అప్పటివరకు వారికి అక్కడ ఓటమి అనేదే తెలీదు. కానీ, గెలుపుపై ఆశలు లేని స్థితి నుంచి మేం గొప్పగా పుంజుకుని ఆ మ్యాచ్ గెలిపించాం. అయితే, టెస్ట్ క్రికెట్ ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఇందులో ఆడటం అంత సులభం కాదు. ఆస్ట్రేలియాలో ఆడటం కఠినమైన సవాలు. కావాలంటే మీరు ఇంగ్లాండ్ ఆటగాళ్లను అడగండి. గబ్బాలో విజయం సాధించి ఆ తర్వాత ఆస్ట్రేలియాలో సిరీస్ గెలవడం మాకు గ్రేట్ అచీవ్‌మెంట్’ అని రోహిత్ పేర్కొన్నాడు.
ఇవీ చదవండి:
దశాబ్దాల నిరీక్షణ తర్వాత.. కలల ‘కప్పు’ దరి చేరిన వేళ!
విజయ్ హజారే ట్రోఫీలో ఆడనున్న మరో ముగ్గురు స్టార్ ప్లేయర్లు!