Share News

ICC Rankings-Rohit: వన్డేల్లో నంబర్‌ 1 బ్యాటర్‌గా రోహిత్ శర్మ

ABN , Publish Date - Oct 29 , 2025 | 04:17 PM

హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ వన్డేల్లో టాప్ ర్యాంకర్‌గా నిలిచాడు. ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉన్న కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రెండు స్థానాలు కిందికి దిగజారి మూడో స్థానానికి పడిపోయాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ 781 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థాంలో కొనసాగుతున్నాడు.

ICC Rankings-Rohit: వన్డేల్లో నంబర్‌ 1 బ్యాటర్‌గా రోహిత్ శర్మ

సుదీర్ఘ విరామం తర్వాత అంతర్జాతీయ వన్డే మ్యాచ్ ఆడిన టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ(Rohit Sharma) అదరగొట్టాడు. ఏడు నెలల విరామం తర్వాత ఆసీస్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడిన హిట్‌మ్యాన్.. ఒక సెంచరీ, హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు. ఆ సిరీస్‌లో రోహిత్ ప్రదర్శనకు ఐసీసీ ర్యాంకుల్లో(ICC Rankings) ఫలితం కనిపించింది. హిట్‌మ్యాన్ వన్డేల్లో టాప్ ర్యాంకర్‌గా నిలిచాడు. ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉన్న కెప్టెన్ శుభ్‌మన్ గిల్(Gill) రెండు స్థానాలు కిందికి దిగజారి మూడో స్థానానికి పడిపోయాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ 781 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అఫ్గానిస్తాన్ ప్లేయర్ ఇబ్రహీం జద్రాన్ 764 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా.. గిల్ (745), బాబర్ అజామ్(739), విరాట్ కోహ్లీ (725) పాయింట్లతో ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.


హాఫ్ సెంచరీ చేసినా..

ఆసీస్‌తో జరిగిన మూడు వన్డేల్లో తొలి రెండు మ్యాచ్‌ల్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) డకౌట్‌గా వెనుదిరిగిన విషయం తెలిసిందే. మూడో వన్డేలో పుంజుకుని హాఫ్ సెంచరీ చేసినా.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో విరాట్ ఓ స్థానం కిందకి పడిపోయాడు. డకౌట్ అవ్వడమే దీనికి ముఖ్య కారణమని క్రికెట్ విశ్లేషకుల అంచనా. శ్రేయస్ అయ్యర్(700) టాప్-10లో కొనసాగుతున్నాడు. ఇక ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్(589) ఏకంగా 23 స్థానాలను మెరుగుపర్చుకుని 25వ ర్యాంకును అందుకున్నాడు.


బౌలింగ్ విభాగంలో..

బౌలింగ్ విభాగంలో టీమిండియా(Team India) తరఫున కేవలం ఒక్కరు మాత్రమే ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఉండటం గమనార్హం. అదీ కూడా కుల్‌దీప్ యాదవ్ 634 పాయింట్లతో ఒక స్థానం కిందికి పడిపోయి ఏడో ర్యాంకులో నిలిచాడు. ఆసీస్ స్టార్ పేసర్ హేజిల్‌వుడ్ (628) రెండు స్థానాలు పైకి ఎగబాకి 8వ ర్యాంకులో ఉన్నాడు. అఫ్గాన్ ఆటగాడు రషీద్ ఖాన్(710) బౌలింగ్ విభాగంలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆల్‌రౌండర్ల విభాగంలో రవీంద్ర జడేజా(215) మాత్రమే ఉన్నాడు. అతడు ఆసీస్‌తో జరిగిన వన్డే సిరీస్ ఆడని విషయం తెలిసిందే. అక్షర్ పటేల్(208) రెండు స్థానాలను మెరుగుపర్చుకుని 12వ ర్యాంకులో నిలిచాడు. ఇందులోనూ అఫ్గాన్ ఆటగాడు అజ్మతుల్లా ఒమర్జాయ్‌(334) టాప్ ర్యాంకర్.


Also Read:

Bihar Elections: పీఎం, సీఎం సీట్లు ఖాళీగా లేవు.. అమిత్‌షా

IND vs AUS : టాస్ గెలిచిన ఆసీస్.. తుది జట్లు ఇవే

Updated Date - Oct 29 , 2025 | 04:17 PM