Rishabh Pant-Virat Kohli: జెర్సీ నంబర్ 18 ధరించిన పంత్
ABN , Publish Date - Oct 30 , 2025 | 05:37 PM
పంత్ జెర్సీ నంబర్ 18 ధరించి మైదానంలోకి వచ్చాడు. అది స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ జెర్సీ కావడంతో అందరి దృష్టి ఆ జెర్సీపైనే పడింది. సాధారణంగా పంత్ జెర్సీ నంబర్ 17.. పొరపాటున 18గా ముద్రితమైన జెర్సీని ధరించాడా? లేక కావాలనే ఆ నంబర్ జెర్సీని వేసుకుని వచ్చాడా? అనేది చర్చనీయాంశంగా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్ సమయంలో పాదానికి గాయం కావడంతో రిషభ్ పంత్(Rishabh Pant) దాదాపు మూడు నెలల పాటు ఆటకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా గాయం నుంచి కోలుకుని సౌతాఫ్రికా ఏతో పంత్ అనధికారిక టెస్టు సిరీస్ బరిలోకి దిగాడు. ఇప్పుడు భారత్ ఏ జట్టు సారథిగా మ్యాచ్ ఆడుతున్నాడు. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ మైదానం వేదికగా తొలి మ్యాచ్ జరుగుతోంది. అయితే ఇక్కడ పంత్ ధరించిన జెర్సీ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
పంత్ జెర్సీ నంబర్ 18 ధరించి మైదానంలోకి వచ్చాడు. అది స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ( Virat Kohli) జెర్సీ కావడంతో అందరి దృష్టి ఆ జెర్సీపైనే పడింది. విరాట్ ఇప్పటికే టెస్టులకు రిటైర్‌మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. సాధారణంగా పంత్ జెర్సీ నంబర్ 17.. పొరపాటున 18గా ముద్రితమైన జెర్సీని ధరించాడా? లేక కావాలనే ఆ నంబర్ జెర్సీని వేసుకుని వచ్చాడా? అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే ఇంతకుముందు ముకేశ్ కుమార్(జెర్సీ నంబర్ 49) కూడా గత ఇంగ్లండ్ పర్యటనకు ముందు ‘ఏ’ జట్టు తరఫున బరిలోకి దిగినప్పుడు 18వ నంబర్ జెర్సీనే ధరించాడు.
అందుకే ఆ జెర్సీ ధరించాడా?
స్టార్ ఆటగాళ్లు ఆటకు వీడ్కోలు పలికినప్పుడు ఆ జెర్సీ నంబర్లకు కూడా రిటైర్‌మెంట్ ఇచ్చేయడం ఆనవాయితీగా వస్తుంది. సచిన్ టెండూల్కర్(10), ధోనీ(7) ఆటకు వీడ్కోలు పలికినప్పుడు బీసీసీఐ ఇలానే చేసింది. ఆ నంబర్ల జెర్సీలను ఎవరూ వాడేందుకు వీలు లేకుండా బీసీసీఐ(BCCI) నిర్ణయం తీసుకుంది. కానీ కోహ్లీ విషయంలో మాత్రం బీసీసీఐ ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే విరాట్ ఇప్పుడు వన్డేల్లోనూ ఉండటంతో 18వ నంబర్‌కు రిటైర్‌మెంట్ ఇవ్వలేదు. దీంతో టెస్టుల్లో అందుబాటులో ఉన్న ఈ నంబర్‌ను పంత్ ఎంచుకుని ఉంటాడని క్రికెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఒకవేళ కోహ్లీ, రోహిత్(జెర్సీ నంబర్ 45) వన్డే ఫార్మాట్‌నూ వదిలేస్తే బీసీసీఐ ఆ దిశగా ఆలోచన చేసే అవకాశం ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
Gold Price Today: ఇవాళ్టి మార్కెట్లో బంగారం ధరలు
Australian cricketer: విషాదం.. ఆసీస్ యువ క్రికెటర్ మృతి