Share News

Ashwin: సిరీస్ మధ్యలో వైస్ కెప్టెన్‌ను తొలగిస్తే పద్ధతిగా ఉండదు: అశ్విన్

ABN , Publish Date - Dec 15 , 2025 | 01:06 PM

టీమిండియా టీ20 వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కొంత కాలంగా పేలవ ప్రదర్శన కనుబరుస్తున్నాడు. ఇదే తీరు కొనసాగితే జట్టులో స్థానం కోల్పోతాడన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో టీమిండియా మాజీ స్నిన్నర్ అశ్విన్ స్పందించాడు.

Ashwin: సిరీస్ మధ్యలో వైస్ కెప్టెన్‌ను తొలగిస్తే పద్ధతిగా ఉండదు: అశ్విన్
Ashwin

ఇంటర్నెట్ డెస్క్: సౌతాఫ్రికాతో టీమిండియా ఐదు టీ20 సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మూడు టీ20 మ్యాచులు ముగిశాయి. ఇందులో టీమిండియా 2-1 తేడాతో ముందంజలో ఉంది. అయితే కెప్టెన్ సూర్యకుమావ్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ పేలవ ప్రదర్శనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా గిల్ ప్రదర్శన.. అతడి వైస్ కెప్టెన్సీ పైనే కాదు, జట్టులో స్థానంపై కూడా ప్రభావం పడేలా కనిపిస్తుంది. ఈ విషయంపై టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) స్పందించాడు.


‘శుభ్‌మన్ గిల్(Shubman Gill) కేవలం టీమిండియా ఓపెనర్ మాత్రమే కాదు.. వైస్ కెప్టెన్ కూడా. జట్టు నుంచి వైస్ కెప్టెన్‌ను తొలగిస్తే.. అది పద్ధతిగా ఉండదు. సిరీస్ మధ్యలో గిల్‌ను తప్పించి సంజు శాంసన్‌ను తీసుకురావడం కూడా సరైనది కాదు. అలా చేస్తే.. ఆటగాడినే కాదు, వైస్ కెప్టెన్‌నూ తొలగించినట్లు అవుతుంది. గతంలో ఇలా జరిగిందా? లేదా? అనేది అప్రస్తుతం. కానీ వైస్‌ కెప్టెన్‌గా గిల్‌ను ఎంపిక చేశాక.. అతడికి తగిన అవకాశాలు ఇవ్వాల్సిందే. ఐదు మ్యాచ్‌ల్లోనూ అతడిని ఆడనివ్వాలి.. అప్పటికీ గిల్‌ నుంచి సరైన ప్రదర్శన రాకపోతే వైస్‌ కెప్టెన్‌ విషయంలో నిర్ణయం తీసుకోవచ్చు’ అని అశ్విన్‌ తెలిపాడు.


గిల్ ఫామ్ అందుకోవాలి..

టీ20 ప్రపంచ కప్ 2026 కోసం జట్టు కూర్పు విషయంపై కూడా అశ్విన్ స్పందించాడు. ‘ప్రపంచ కప్‌కు ఇంకా రెండు నెలల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికీ భారత జట్టు తమ ఉత్తమ తుది జట్టును ఖరారు చేయకపోవడం మంచిది కాదు. బౌలింగ్ విషయంలో ఎలాంటి అనుమానాలు లేవు. హర్షిత్ రాణా ఉత్తమ ప్రదర్శన చేస్తున్నాడు. ఆందోళన అంతా గిల్ గురించే. ఫామ్ అందుకుని పరుగులు చేయాలి. లేకపోతే జట్టులో ఉంటాడా? అతడి స్థానంలో సంజుకి అవకాశం ఇస్తారా? అనేది కచ్చితంగా చర్చకు వస్తుంది’ అని అశ్విన్ తెలిపాడు.


ఇవి కూడా చదవండి:

ఆ ఒక్క రోజు నేనలా చేయకపోయుంటే!.. గబ్బర్ కీలక వ్యాఖ్యలు

వాళ్లిద్దరికీ ఆ సత్తా ఉంది.. సూర్య, గిల్‌కు అభిషేక్ శర్మ మద్దతు

Updated Date - Dec 15 , 2025 | 01:25 PM