Ind Vs SA: నేను ఫామ్ కోల్పోలేదు: భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్
ABN , Publish Date - Dec 15 , 2025 | 07:51 AM
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ గత కొంత కాలంగా ఫామ్ లేమితో విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. తాజాగా తన ఫామ్‌పై సూర్య స్పందించాడు. తాను ఫామ్ కోల్పోలేదని స్పష్టం చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా టీ20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్.. గత కొంత కాలంగా పేలవ ప్రదర్శన చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా సౌతాఫ్రికాతో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లోనూ వరుస మూడు మ్యాచుల్లో విఫలమయ్యాడు. కెప్టెన్ ఫామ్‌పై అభిమానులతో పాటు క్రికెట్ మాజీలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ టీ20ల్లో గత 21 ఇన్నింగ్స్‌లో సూర్య.. ఒక్క హాఫ్ సెంచరీ చేయలేకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ధర్మశాలలో జరిగిన మూడో టీ20లోనూ సూర్య 12 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. అయితే తన ఫామ్‌పై మ్యాచ్ అనంతరం స్కై(Suryakumar Yadav) స్పందించాడు.
‘నేను నెట్స్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాను. పరుగులు రాబట్టేందుకు నా నియంత్రణలో ఉన్న ప్రతిదాన్నీ నేను ప్రయత్నిస్తున్నాను. రన్స్ ఎప్పుడు రావాలో అప్పుడే కచ్చితంగా వస్తాయి. నేను కూడా నా బ్యాట్ నుంచి పెద్ద ఇన్నింగ్స్ కోసం ఎదురు చూస్తున్నా. నేను పరుగులు చేయడం లేదు అనే మాట వాస్తవం.. కానీ నేను ఫామ్ మాత్రం కోల్పోలేదు. త్వరలోనే మంచి నాక్ ఆడతాననే నమ్మకం నాకుంది’ అని సూర్య వివరించాడు.
అదే కీలకం..
మూడో టీ20 విజయంపై సూర్య మాట్లాడాడు. ‘ఈ ఆట మనకు చాలా విషయాలు నేర్పుతుంది. గత మ్యాచ్ ఓటమి తర్వాత ఎలా పుంజుకుంటామనేదే కీలకం. పక్కా ప్రణాళికలతోనే సిద్ధమై విజయం సాధించాం. కటక్‌లో చేసిన పనులనే మళ్లీ చేయడానికి ప్రయత్నించాం. ఫలితం మాకు అనుకూలంగా వచ్చింది. ముల్లాన్‌పుర్ పరాజయం నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాం. ప్రాక్టీస్ సెషన్‌లో తప్పిదాలను సవరించుకున్నాం. ప్రయోగాలు చేయాలనుకోలేదు’ అని సూర్య వెల్లడించాడు.
ఇవి కూడా చదవండి:
చరిత్ర సృష్టించిన హార్దిక్ పాండ్య.. తొలి భారత ప్లేయర్‌గా!
ఆ తప్పిదమే మా ఓటమికి కారణమైంది: కెప్టెన్ మార్క్‌రమ్