Share News

MS Dhoni: రూ. 100 కోట్ల పరువు నష్టం దావాపై సంచలన నిర్ణయం

ABN , Publish Date - Aug 12 , 2025 | 08:23 PM

2013 ఐపీఎల్ మ్యాచ్‌లో స్పాట్ ఫిక్సింగ్ జరిగింది. అందులో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే), రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్)లతోపాటు పలువురు ఆటగాళ్ల ప్రమేయం ఉందంటూ విమర్శలు వెల్లువెత్తాయి.

MS Dhoni: రూ. 100 కోట్ల పరువు నష్టం దావాపై సంచలన నిర్ణయం
MS Dhoni

చెన్నై, ఆగస్ట్ 12: చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ఫిక్సింగ్ కేసు విచారణను త్వరిత గతిన పూర్తి చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో భారత క్రికెట్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని స్టేట్‌మెంట్‌ రికార్డు చేయాలని సూచించింది. అతడి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసేందుకు అడ్వకేట్ కమిషనర్‌ను సైతం ఇప్పటికే నియమించింది. అయితే ఈ కేసులో తన వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు.. ఈ ఏడాది అక్టోబర్ 20 లేకుంటే డిసెంబర్ 10వ తేదీలలో తాను అందుబాటులో ఉంటానని కోర్టుకు ఎంఎస్ ధోని స్పష్టం చేశారు.


ఇంతకీ ఏమిటీ కేసు..?

2013లో ఐపీఎల్ బెట్టింగ్ కుంభకోణం జరిగింది. ఈ వ్యవహారంపై వివిధ టీవీ చానెళ్లలో పలు చర్చా కార్యక్రమాలు జరిగాయి. ఈ చర్చల సందర్భంగా ఈ బెట్టింగ్ కుంభకోణంలో ఎంఎస్ ధోని పాత్ర కూడా ఉందంటూ పలువురు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో దీనిపై ఎంఎస్ ధోని స్పందించారు. తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా వివిధ మీడియా సంస్థలుతోపాటు పలువురు జర్నలిస్టులు వ్యవహరించారంటూ చెన్నై హైకోర్టును ఆయన ఆశ్రయించారు. ఆ క్రమంలో ఆయా సంస్థలతోపాటు జర్నలిస్ట్‌లపై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. అందుకు సంబంధించిన కేసును చెన్నై హైకోర్టు మంగళవారం విచారించింది. అందులోభాగంగా ఈ కేసు విచారణను త్వరిత గతిన చేపట్టి పూర్తి చేయాలని ఆదేశించింది.


బ్యాగ్రౌండ్ ఇది..

2013 ఐపీఎల్ మ్యాచ్‌లో స్పాట్ ఫిక్సింగ్ జరిగింది. అందులో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే), రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్)లతోపాటు పలువురు ఆటగాళ్ల ప్రమేయం ఉందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంపై జస్టిస్ లోథా కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటి విచారణ జరిపిన నివేదికను అందజేసింది. ఈ నివేదికలో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్‌‌పై నిషేధం విధించాలని ఆ కమిటీ సిఫార్స్ చేసింది. ఈ కమిటీ నివేదిక ఆధారంగా ఈ రెండింటిపై రెండేళ్ల పాటు అంటే.. 2016, 2017లో నిషేధం విధించారు. ఇది క్రికెట్‌పై తీవ్ర ప్రభావం చూపింది.


అలాగే బీసీసీఐ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్ అల్లుడు, సీఎస్‌కే‌కు చెందిన గురునాథ్ మేయప్పన్‌లతోపాటు ప్రముఖ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా తదితరులపై విమర్శలు వెల్లువెత్తాయి. అదే విధంగా రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన ఆటగాళ్లు.. ఎస్ శ్రీకాంత్, అంకిత్ చవాన్‌తోపాటు అజిత్ చండిలియాలను ఇదే వ్యవహారంలో అరెస్టయ్యారు. అదే సమయంలో ఎంఎస్ ధోనిపై పలు మీడియా సంస్థలు వివిధ కథనాలు వండి వార్చాయి. కానీ ఈ వ్యవహారంలో ఎంఎస్ ధోని ప్రమేయంపై ఆరోపణలను నిరూపించలేక పోయారు.

ఇవి కూడా చదవండి

బీసీ గర్జన సభను మరోసారి వాయిదా వేసిన బీఆర్ఎస్

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. సీఎం చంద్రబాబు కీలక సూచనలు

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 12 , 2025 | 08:30 PM